శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 02:13:12

మన ప్రగతికి వైభవ ప్రతీక

మన ప్రగతికి వైభవ ప్రతీక

  • కొత్త సచివాలయ నిర్మాణా నికి శ్రీకారం
  • శ్రావణ మాసంలో పనుల ప్రారంభం.. వచ్చే జూన్‌ నాటికి పూర్తిచేసేందుకు ప్రణాళిక
  • ఆస్కార్‌ అండ్‌ పొన్ని ఆర్కిటెక్చర్స్‌ డిజైన్‌.. 7 లక్షల చదరపు అడుగుల్లో 6 అంతస్తులు
  • 20% భవనం.. 80% ఉద్యానవనాలు.. రూఫ్‌టాప్‌లపై సోలార్‌ విద్యుత్‌ ప్యానెళ్లు
  • ఏకకాలంలో 800 కార్ల పార్కింగ్‌.. ప్రార్థన స్థలాలు, బ్యాంకు, ఏటీఎంలు, క్యాంటీన్లు
  • మంత్రుల కార్యాలయాలు, హెచ్‌వోడీలు, సెక్షన్‌ ఆఫీసులన్నీ ఒకేచోట కేంద్రీకృతం

ఇంటి ముంగిట వాకిలి చూస్తే ఇల్లెట్లుందో చెప్పొచ్చు అని సామెత! వలస పాలనలో తెలంగాణ దుస్థితి ఏమిటో చెప్పడానికి.. పాత సచివాలయ భవనాలను చూపిస్తే చాలు!  ఈ మరకలను చెరిపేసి, ప్రజలకు, ఉద్యోగులకు మరింత సౌకర్యం కలిగించి, ప్రపంచానికి తెలంగాణ మోతెబరి చూపించేందుకు సర్కారు మరో అడుగు ముందుకు వేసింది. సరికొత్త సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రీతి రివాజు లేకుండా కట్టిన భవనాలు. మంత్రులు ఒకచోట ఉంటారు. హెచ్‌వోడీలు మరోచోట. సెక్షన్‌ ఆఫీసులు ఇంకో చోట. ఒక ఫైలు కిందనుంచి పైదాకా రావడంకన్నా భూ ప్రదక్షిణం చేయడం సులువు. ఇదీ పాత సచివాలయ భవనాల పరిస్థితి. 120 ఏండ్ల కింద కట్టిన భవనాలు. మిగతావి పాతవి. ఎప్పుడు ఎక్కడ పెచ్చులూడి ఎవరి తల పగులుతుందో తెలియదు. సచివాలయ సముదాయంలో ఇప్పటికే చాలాసార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. సాక్షాత్త్తు ముఖ్యమంత్రి కొలువై ఉండే భవనం చుట్టే అగ్నిమాపక యంత్రం తిరిగే అవకాశం లేదు. ఇక మిగతా వాటి సంగతి దేవుడెరుగు. 

వేల మంది ఉద్యోగులు పనిచేసే చోట అగ్నిమాపక పరికరాలుండవు. ప్రమాదం జరిగినప్పుడు పారిపోదామంటే వీలుకూడా లేదు. ఇప్పటిదాకా అందులో పనిచేసిన వారు ధర్మంమీద బతికి పోయారంతే! వేల మంది ఉద్యోగులు ఉండేచోట.. కనీసం వంద మంది సమావేశమయ్యే కాన్ఫరెన్స్‌ హాల్‌ లేదు. గెట్‌ టు గెదర్‌ పెట్టుకునే హాల్‌ లేదు. ఎప్పుడు ఎవరి మీద కూలుతాయో అన్నట్టుగా ఫైళ్ల గుట్టలు. ప్రభుత్వ సిబ్బందితో కనీసం వీడియో కాన్ఫరెన్స్‌ జరుపుకునే వీలులేదు. కరోనా వంటి ఆపత్కాలం దాపురిస్తే పరిపాలన కొనసాగించగల అధునాతన సౌకర్యాలు లేవు. చిట్టచివరికి సిబ్బంది లంచ్‌ చేసేందుకు సెల్లార్‌ తప్ప మంచి క్యాంటీన్‌ కూడా లేదు. పనిమీద ప్రజలు సచివాలయానికి వస్తే కనీసం పార్కింగ్‌ సదుపాయమూ కరువే. ఇదీ వలస పాలన మనకు మిగిల్చిన వారసత్వం!!


ఇంకా వలస మరకలేనా?

కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కూడా మనం ఇంకా వలస మరకలతోనే బతకాలా? కొత్త రాష్ట్రంగా కొత్త ప్రయాణాన్ని ఆరంభించిన తెలంగాణ కొత్తగా ఉండాలని కోరుకోవడంలో, కొత్త సచివాలయాన్ని కట్టుకోవడంలో తప్పేమిటి? కొత్త సంసారం ఆరంభించిన ప్రతి జంటా, తనదైన కొత్తింటి నిర్మాణంకోసం పరితపిస్తున్న ఈ రోజుల్లో, కోట్లాది ప్రజల గౌరవ సూచకంగా చక్కటి సచివాలయం ఎందుకు ఉండకూడదు? అది మన తెలంగాణ పూర్వ వైభవాన్ని జ్ఞప్తికి తెచ్చేది ఎందుకు కాకూడదు? ఇవీ ఇప్పుడు మనముందున్న ప్రశ్నలు. మార్పును వ్యతిరేకించేవారు ఎప్పుడూ ఉంటారు. కానీ దార్శనికులు మాత్రమే ధైర్యంగా మార్పును ఆచరిస్తారు. ఆహ్వానిస్తారు. అందులో సీఎం కేసీఆర్‌ ఒకరు. కొత్త సచివాలయం కట్టాలన్న ఆయన నిర్ణయం పట్ల తెలంగాణవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘తెలంగాణ ఎలా ఉండాలో కేసీఆర్‌కు ఒక కల ఉన్నది. ఒక కల్పన ఉన్నది. గొప్పగా చేసుకోవాలనే తపన ఉన్నది. తెలంగాణ అవసరాల గురించి లోతైన అవగాహన ఉన్నది. దేశంలో 29 రాష్ర్టాలకు రాజధానులున్నాయి. కానీ మహా నగరాలు ఆరే. అందులో దేశ రాజధాని ఢిల్లీని మినహాయిస్తే మిగిలినవి కోల్‌కతా, ముంబాయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌. మరి దక్కన్‌ వారసత్వ ప్రతీక అయిన హైదరాబాద్‌ స్థాయికి, హోదాకు దీటైన రీతిలో అధునాతన హంగులతో సచివాలయం కట్టుకుంటే నష్టమేమున్నది?’ అని 70 ఏళ్ల సీనియర్‌ జర్నలిస్టు ఒకరు ప్రశ్నించారు.

కీలక నగరంగా మారుతాం

కరోనా ఉత్పాతం తర్వాత ప్రపంచ సమీకరణాలు మారిపోయే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. రాజకీయ, వాణిజ్య రంగాల్లో దేశ ప్రాముఖ్యత బాగా పెరగనున్నది. ఇందులో హైదరాబాద్‌ కీలక పాత్ర పోషించనున్నది. ‘ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రముఖ నగరాలన్నింటిలో అద్భుతమైన నిర్మాణాలున్నాయి. మన దురదృష్టమేమిటంటే హైదరాబాద్‌ గురించిన అంచనా ఎవరికీ లేదు. కొన్నేండ్ల తర్వాతి హైదరాబాద్‌ ఇప్పటిలా ఉండదు. పలు రంగాల్లో ప్రపంచంలోనే కీలకమైన నగరంగా ఎదుగుతుంది. అందుకు అవసరమైన సన్నాహాలను ఇప్పటి నుంచే చేసుకోవడం తెలివైన పని. 

బ్యాంకర్లో, విదేశీయులో, వ్యాపార ప్రతినిధులో హైదరాబాద్‌ వస్తే.. వారిని అబ్బురపరిచేలా, ఆకట్టుకునేలా నగరం ఉండాలి. హైదరాబాద్‌లో దిగిన వాళ్లకు మన మోతెబరి తెలవాలి కదా! కేసీఆర్‌ చేస్తున్నది ఇదే’ అని ప్రముఖ కంపెనీ యజమాని ఒకరు విశ్లేషించారు. ‘మలేసియాకు చెందిన సీనియర్‌ మంత్రి వేలుస్వామి ఒకసారి హైదరాబాద్‌ వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిశారు. కొత్త రాష్ట్రం తెచ్చుకున్నారు కదా.. కొత్త సెక్రెటేరియట్‌ కట్టుకోవచ్చు కదా అన్నారు. మరో దేశానికి చెందిన నేత కలిసినప్పుడు.. సీఎం చాంబర్‌కు వెళ్తే.. గుహలోకి వెళ్లినట్టుందని కేసీఆర్‌తోనే వ్యాఖ్యానించారు. ఇదీ మన సచివాలయం పరిస్థితి. పద్ధతీ పాడూ లేకుండా ఇష్టమొచ్చినట్టు దాన్ని ఎక్స్‌టెండ్‌ చేసుకుంటూ పోయారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి దానిమీద దృష్టిపెట్టారు. సంతోషం’ అని విశ్లేషించారు ఏళ్ల తరబడి అందులో విధులు నిర్వహించిన ఐఏఎస్‌ ఒకరు. 

మార్పును వ్యతిరేకించేవారు ఎప్పుడూ ఉంటారని, అయితే దార్శనికులు మాత్రమే ఆ వ్యతిరేకతను ధిక్కరించి, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టితో మార్పును ఆచరిస్తారని, ఆహ్వానిస్తారని ఆయన వివరించారు. ఈ తరహా వ్యక్తుల్లో తానూ ఒకరినని కేసీఆర్‌ ఇప్పటికే అనేకమార్లు నిరూపించుకున్నారంటూ పరిపాలన సంస్కరణలను, కాళేశ్వరాన్ని ఆయన ప్రస్తావించారు. మొత్తానికి కొత్త సచివాలయ నిర్మాణంతో తెలంగాణ స్వపరిపాలన శకంలో కొత్త అధ్యాయం మొదలుకానున్నది. రాజధాని, సచివాలయం అనేవి కాంక్రీటు నిర్మాణాలు కావు. అవి ఆత్మగౌరవ బింబాలు. నిత్య శంకితులు, నిత్య శోకితులు ఎప్పుడూ ఉంటారు. వారి ఏడుపును పక్కనబెడితే తెలంగాణ వైభవ చరిత్ర మరోసారి పునరుజ్జీవం పొందనున్నది. దీనంగా, దింపుడు కళ్లం ఆశలతో బతికే రోజులు పోయాయి. ఇప్పుడు తెలంగాణ సగర్వంగా తలెత్తుకుని, తనకు కావాల్సింది సాధించుకుంటుంది. అందుకు కొత్త సచివాలయమే ప్రతీక!

వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేనచ వకార పంచకేనైవ

నరః ప్రాప్రోతి గౌరవంమనిషికి గౌరవం కల్పించే వాటిలో మొట్ట   మొదటిది అతడు ధరించే బట్టలు. అలాగే రాష్ర్టానికి గౌరవం కల్పించే వాటిలో మొట్టమొదటిది రాజధాని, అక్కడి నిర్మాణాలు!

ఎప్పుడో ఒకప్పుడు చేయాల్సిందే

సచివాలయంలో ఇప్పుడున్న భవనాలు ఒక్కొక్కటి ఒక్కోసారి కట్టినవి. ఒకటి పాతదైందని కూల్చి కొత్తది కట్టేసరికి మరొకటి పాతదవుతుంది. ఈ అతుకుల బొంత సంసారం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. ఎన్నటికైనా కొత్త సచివాలయం కట్టుకోక తప్పదు. ఇప్పుడు కట్టుకునే అవసరమున్నది. అవకాశమూ ఉంది. ‘వలస పాలకులు హైదరాబాద్‌ను కేవలం రియల్‌ఎస్టేట్‌ వ్యాపార కోణంలోనే చూశారు. ఆ మేరకే ప్రాజెక్టులు చేపట్టి వారు ఎలా లాభపడ్డారో ప్రజలకు తెలియనిది కాదు. పాత సచివాలయం ఉన్నచోటే కేసీఆర్‌ కొత్తది కడుతున్నారు. ఇందులో ఆయన వ్యక్తిగతంగా బావుకునేది ఏమున్నది? మన ఇల్లు శిథిలావస్థకు చేరితే కూల్చేసి కొత్తది కట్టుకుంటామా లేదా? పాత సచివాలయం ఎలా ఉంటుందో నాకన్నా బాగా తెలిసిన వారెవరూ లేరు’ అని సచివాలయంలో ఏండ్ల్ల తరబడి బీట్‌ రిపోర్టర్‌గా పనిచేసిన ఒక జర్నలిస్టు వ్యాఖ్యానించారు.

భవన నిర్మాణ నిబంధనలకు, రక్షణ సౌకర్యాలకు పాత సచివాలయ భవనాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. వాటిని కూల్చి కొత్త భవనం కట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంలో తప్పేమీ లేదని హైకోర్టు కూడా స్పష్టంచేసింది. నిజానికి ప్రభుత్వ మౌలిక సదుపాయాల కల్పన పరంగా హైదరాబాద్‌లో కేసీఆర్‌ ప్రతిపాదించినవి మూడే మూడు. ఒకటి అధునాతన సౌకర్యాలతో సచివాల యం. అందమైన శాసన సభాభవనం. మూ డు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నెలవుగా ఉండేలా అఖిల భారత స్థాయి ఆడిటోరియం కళాభారతి నిర్మాణం. పరిపాలన యంత్రాంగానికి, శాసన వ్యవస్థకు, సాంస్కృతిక రంగానికి ప్రాతినిధ్యం వహించే మూడు భవనాలతో హైదరాబాద్‌ ఔన్నత్యాన్ని రెట్టింపు చేయాలన్నది సీఎం ఆలోచన. ‘వలస పాలకులకు తెలంగాణ ఆత్మ తెలియదు. వారిలో తెలంగాణ హృదయం లేదు. వారు హైదరాబాద్‌ను మాది అనుకోలేదు. మమేకం కాలే దు. 

ఈ నేల మా తల్లి, మా జనని, మా ధరిత్రి, దీన్ని అందంగా అలంకరించుకోవాలనే సంక ల్పం వారికి లేదు. వారి దృష్టిలో హైదరాబాద్‌ అంటే ఆస్తులు సంపాదించి పెట్టే ఒక వ్యాపార కూడలి. అందుకే హైదరాబాద్‌ను ఈ దుస్థితికి దిగజార్చారు. చిన్నప్పుడు హైదరాబాద్‌లోనే చదువుకున్న నేను.. బాగ్‌లింగంపల్లి మామిడితోటలో మామిడి పండ్లు తీసుకొని, వాటిని తింటూ హుస్సేన్‌సాగర్‌దాకా వచ్చి, అందులో మంచినీళ్లు తాగి, అక్కణ్నుంచి సీతారాంబాగ్‌ పాఠశాలకు వెళ్లేవాడిని. అలాంటి హుస్సేన్‌సాగర్‌ ఇప్పుడెలా కాలుష్య కాసారమైందో చూ స్తున్నాం. వలస పాలన దుష్పరిణామమిది. ఇన్నాళ్లకు మనకోసం మనం మన ఆలోచనతో పనిచేసుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు’ అని విశ్లేషించారు ఒక రిటైర్డ్‌ తెలుగు పండితుడు. ‘ఒకప్పుడు తెలంగాణ వైభవంగా బతికింది. వలస పాలనలో అది ఛిద్రమైంది. పూర్వ వైభవం తెచ్చేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి అందులో కీలకం. విదేశాల్లో కట్టే భవనాలను మనం అబ్బురపడి చూస్తాం. కంప్యూటర్లలో వాల్‌పేపర్లుగా పెట్టుకుంటాం. భూత్‌ బంగ్లాల్లా మారి న సచివాలయ భవనాలను కూల్చేస్తే మాత్రం, అదేదో హైదరాబాద్‌ మొత్తాన్నీ కూల్చేస్తున్నట్టు యాగీచేస్తాం. ఇది ఎంతమాత్రం సరికాదు’ అని మాదాపూర్‌లో పనిచేస్తున్న కరీంనగర్‌ టెకీ ఒకరు చెప్పారు.  


logo