సోమవారం 25 మే 2020
Telangana - Apr 09, 2020 , 01:31:39

బహిరంగప్రదేశాల్లో ఉమ్మడం నిషేధం

బహిరంగప్రదేశాల్లో ఉమ్మడం నిషేధం

  • ఉత్తర్వులు జారీ.. తక్షణం అమల్లోకి
  • అంటువ్యాధుల అడ్డుకట్టకు నిర్ణయం
  • కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు
  • సింగపూర్‌ తరహాలో అమలు..

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి కట్టడికి రాష్ట్రప్రభుత్వం మ రింత కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నది. అంటువ్యాధుల ముప్పును సమర్థంగా అడ్డుకొనేందుకు అన్నిమార్గాలనూ అన్వేషిస్తున్న ది. ఇందులోభాగంగా సింగపూర్‌ తరహాలో.. బహిరంగప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు. బహిరంగప్రదేశాలు, కార్యాలయాలు, రహదారులు.. వంటి ప్రజలు తిరిగేప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులు, పాన్‌, గుట్కాలతోపాటు దగ్గు, జలుబు ద్వారా వచ్చే కఫం ఉమ్మివేయకూడదని ఆదేశాలు జారీచేశారు. 

బహిరంగప్రదేశాల్లో ఉమ్మివేయడం ద్వారా అంటువ్యాధులు వ్యాపించే తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజలు తిరిగే ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రహదారుల మీద ఉమ్మివేసే వాహనదారులను ఆటోమెటిక్‌ వెహికిల్‌ రికగ్నిషన్‌ సిస్టం (ఏవీఆర్‌ఎస్‌) ద్వారా గుర్తించి.. వారిపై చర్యలు తీసుకొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠినంగా వ్యవహరించనున్నారు.


logo