ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 19:07:20

సాగర్‌ డ్యాం భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

సాగర్‌ డ్యాం భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

నల్లగొండ : నాగార్జున సాగర్‌ డ్యాం భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. నది పరివాహక ప్రాంతాలతోపాటు డ్యాం స్పిల్‌ వే, ఎర్త్‌ డ్యాం, ప్రధాన డ్యాం భద్రత పర్యవేక్షణకు భద్రతా దళాలతోపాటు సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటోంది. నదిలోనూ పెట్రోలింగ్‌ నిర్వహణకు రూ.17 లక్షలు వెచ్చించి అధునాతన స్పీడ్‌ బోట్లను కొనుగోలు చేసింది.

ఈ బోట్లలో ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది నదిలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే రూ.2కోట్ల వ్యయంతో సోలార్‌‌ పవర్‌ ఫినిషింగ్‌ సిస్టమ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ఎర్త్‌ డ్యాం, ప్రధాన డ్యాంపై 62 అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానించి డ్యాం పరిసరాల్లో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో పోలీసులు తెలుసుకోకున్నారు. సీసీ కెమెరాలను అనుసంధానించేందుకు ప్రధాన డ్యాం వద్ద కంట్రోల్‌ రూం నిర్మిస్తున్నారు. పదిరోజుల్లో నిర్మాణం పూర్తవుతుందని, వెంటనే సీసీ కెమెరాలను అనుసంధానిస్తామని పోలీసులు వర్గాలు తెలిపాయి.

భద్రతాదళాలకు ఉపయుక్తంగా వాకీటాకీలు, అండర్‌ వెహికల్స్‌ మిర్రర్లు, ఎక్స్‌రే ప్యాకెట్‌ స్కానర్లు, డోర్‌ ఫ్రేమ్‌లు, హ్యాండ్‌ ఫ్రేమ్‌లు, మెటల్‌ డిటెక్టర్లు, సెర్చ్‌లైట్లు, డ్యాగ్‌స్కాడ్‌ రూమ్‌ల నిర్మాణం పూర్తిచేశారు. గత ప్రభుత్వాల హయాంలో సాగర్‌ డ్యాం భద్రతపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. సాగర్‌ జలాశయంలో పర్యాటక లాంచీల్లో సైతం విహరిస్తున్న నేపథ్యంలో భద్రత దృష్ట్యా స్పీడ్‌ బోట్లు మరింత ఉపయుక్తం కానున్నాయి. బుధవారం సాగర్‌ డ్యాం డీఈ సల్మాన్‌ రాజ్‌ ఆధ్వర్యంలో స్పీడ్‌ బోట్లను ట్రయల్‌ నిర్వహించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.