శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 02:28:24

మన బంధం పటిష్ఠం

మన బంధం పటిష్ఠం
  • అమెరికా, భారత్‌ మైత్రి ప్రపంచానికి మేలు
  • హైదరాబాద్‌లో కాన్సులేట్‌ భవనం రాష్ర్టానికి గర్వకారణం
  • టాపింగ్‌ ఔట్‌లో మంత్రి కేటీఆర్‌
  • గొప్పగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు
  • భారత్‌లో అమెరికా రాయబారి జస్టర్‌ ప్రశంస
  • నానక్‌రాంగూడలో నిర్మాణంలో ఉన్నకాన్సులేట్‌ పరిశీలన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యూఎస్‌ కాన్సులేట్‌ భవనం హైదరాబాద్‌లో ఏర్పాటుకావడం రాష్ట్రానికే గర్వకారణమని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ నిర్మాణం భారత్‌, అమెరికా మధ్య ఉన్న పటిష్ఠ బంధానికి అద్దంపట్టేలా నిలుస్తున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నానక్‌రాంగూడలో నిర్మిస్తున్న అమెరికా కాన్సులేట్‌ భవనాన్ని భారత్‌లో అమెరికా రాయబారి కెన్నత్‌ జస్టర్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ మంగళవారం సందర్శించారు. టాపింగ్‌ ఔట్‌ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్‌.. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన ప్రజాస్వామ్యం గల అమెరికా, అతిపెద్ద ప్రజాస్వామ్యం గల భారత్‌ మంచి సంబంధాలు కలిగి ఉండటం ప్రపంచానికి మంచి చేస్తుందని చెప్పారు. రెండుదేశాల మధ్య సత్సంబంధాల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్రమోదీ కృషిచేస్తున్నారని గుర్తుచేశారు. భవన నిర్మాణం అద్భుతంగా ఉన్నదని ప్రశంసించారు. దక్కన్‌ నిర్మాణ శైలికి దగ్గరగా ఉండేలా రూపొందించినందుకు అమెరికా ప్రభుత్వానికి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌లో అమెరికా రాయబారిగా జస్టర్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కే వచ్చారని గుర్తుచేసిన కేటీఆర్‌.. నాటినుంచి తెలంగాణకు ఒక మంచి స్నేహితుడిగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. అంతకుముందు కెన్నత్‌ జస్టర్‌.. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలు గొప్పగా ఉన్నాయని ప్రశంసలు కురిపించారు. టీఎస్‌ఐపాస్‌ వంటివి తెలంగాణ ఖ్యాతిని రెట్టింపు చేశాయని కొనియాడారు. హైదరాబాద్‌ అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. ఇలాంటి నగరంలో యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయం రావటం ఇక్కడి పౌరులకేగాక ఇతర రాష్ట్రాల వారికి సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో అమెరికా- తెలంగాణ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 2021లో నూతన భవనం అందుబాటులోకి రానుందని జస్టర్‌ తెలిపారు.


రూ.2500 కోట్లతో 12 ఎకరాల్లో నిర్మాణం

మల్టీ బిల్డింగ్‌ కాన్సులేట్‌ కాంప్లెక్స్‌ను ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని నానక్‌రాంగూడలో 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. రిచర్డ్‌ కెనడీ ఆర్కిటెక్ట్‌ బాధ్యతలు చూడగా.. క్యాడెల్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ భవనాన్ని నిర్మిస్తున్నది. నిర్మాణం కోసం దాదాపు రూ.2,500 కోట్లు (350.5 మిలియన్‌ డాలర్లు) ఖర్చు చేస్తున్నారు. నిర్మాణంలో అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నారు. భారత్‌, అమెరికా సంస్కృతులు ప్రతిబింబించేలా చూసుకుంటున్నారు.logo