శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 02:56:57

అన్నింటికీ సన్నద్ధం

అన్నింటికీ సన్నద్ధం

  • కరోనా కట్టడిలో రాజీలేదు  
  • జిల్లాల్లోనూ క్వారంటైన్‌ సెంటర్లు
  • సెలవులిచ్చింది విహారాల కోసం కాదు  
  • ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష  
  • రాష్ట్రంలో తాజాగా ఎనిమిది కేసులు 
  • అందరూ విదేశాల నుంచి వచ్చినవారే  

హైదరాబాద్‌,  నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 వ్యాప్తిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో కృషిచేస్తున్నదని, ఇప్పటివరకు విదేశాలనుంచి వచ్చినవారికి తప్ప.. తెలంగాణ గడ్డమీద ఏ ఒక్కరికీ వైరస్‌ సోకలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్నివిధాలా సన్నద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. తాజాగా స్కాట్లాం డ్‌ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. ఇతను ఈ నెల 16న స్కాట్లాండ్‌ నుంచి వచ్చాడని తెలిపారు. కాగా, ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు చేరుకొన్న ఏడుగురు ఇండోనేషియా దేశస్థులకు కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ బుధవారం రాత్రి బులెటిన్‌ విడుదలచేసింది.

వీరు భారత్‌కు చెందినవారు కాదని.. మత కార్యక్రమం కోసం ఇండోనేషియా నుంచి తెలంగాణకు వచ్చినట్టు స్పష్టంచేసింది. వీరిని ఐసొలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నది. అంతకుముందు కుటుంబ సంక్షేమశాఖ సమావేశమందిరంలో మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కరోనాకు సంబంధించి ఎక్కడా రాజీపడకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. వివిధ పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో వారితో సన్నిహితంగా ఉన్నవారిని ట్రాకింగ్‌చేసి నిర్ధారణ పరీక్షలుచేయగా అందరికీ నెగెటివ్‌ వచ్చిందనిపేర్కొన్నారు. 

కర్ణాటకలో కరోనా కారణంగా మరణించిన వృద్ధుడి అంత్యక్రియలకు వెళ్లివచ్చిన టోలీచౌకి ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కూడా నెగెటివ్‌ వచ్చిందన్నారు. భారత్‌లో ఎక్కడా నేరుగా కరోనా రాలేదని ఐసీఎమ్మార్‌ నివేదికలో విడుదలచేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సూచనలమేరకు కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలనుంచి వస్తున్నవారికి తప్పకుండా స్క్రీనింగ్‌చేస్తూ.. వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన క్వారంటైన్‌ సెంటర్లలో పర్యవేక్షణలో ఉంచుతున్నట్లు తెలిపారు. జిల్లాల్లోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాట్లుచేశామని చెప్పారు. విదేశాల నుంచి 20 వేలమంది వచ్చినా క్వారంటైన్‌లో ఉం చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నిమ్స్‌, ఫీవర్‌, ఐపీఎం, ఉస్మానియా దవాఖానల్లో వ్యాధి నిర్ధారణ పరీక్ష ల్యాబ్‌ల ఏర్పాటు పూర్తయిందన్నారు.

విహారం కోసం కాదు 

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగానే ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిందన్న విషయాన్ని అందరూ గుర్తించాలని, ఈ పేరుతో విహారయాత్రలు పోవడం మంచిదికాదని మంత్రి ఈటల సూచించారు. భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలను రద్దుచేసినట్లు వెల్లడించారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల కార్యాలయాలకు అత్యవసర పనిఉంటే తప్ప.. ప్రజలు రావద్దన్నా రు. అప్రమత్త చర్యల్లో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖలోని వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సెలవులను రద్దుచేసినట్లు వివరించారు. సమావేశంలో ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ జీ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ఐపీఎం డైరెక్టర్‌ శంకర్‌ పాల్గొన్నారు.

అధికారులతో సమీక్ష

రాష్ట్రంలో నివసించే వ్యక్తులకు కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, చికిత్సపై బుధవారం బీఆర్‌కే భవన్‌లో  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ కలిసి సమీక్షాసమావేశం నిర్వహించారు. ఇందులో డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

విమానాలు రద్దుచేయండి

విదేశాల నుంచి వచ్చినవారిలోనే వైరస్‌ ఉన్నదని, ఇక్కడ ఉన్నవారికి సోకకుండా తెలంగాణ ప్రభు త్వం చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు మంత్రి ఈటల తెలిపారు. బుధవా రం కేంద్రమంత్రితో రాష్ట్ర పరిస్థితులు, కొవిడ్‌-19 నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఆయన చర్చించారు. ఇది కొనసాగించాలంటే విదేశీ విమానాలను పూర్తిగా రద్దుచేయాలని కోరారు.

వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ వివరాలు


వివరాలు 
మంగళవారం ఒక్కరోజు
ఇప్పటివరకు మొత్తం 
విమానాశ్రయంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు 
1683
70,545
పర్యవేక్షణలో 28రోజులు పూర్తయిన వారు 
03306
ఇండ్లలో, ఇతరచోట్ల  క్వారంటైన్‌లో ఉన్నవారు
1683
70,545
వ్యాధినిర్ధారణ పరీక్షలు
31447
పాజిటివ్‌గా నిర్ధారణ
813
కోలుకుని డిశ్చార్జ్‌
01
నెగెటివ్‌గా నిర్ధారణ
2412
పాజిటివ్‌ వ్యక్తుల కాంటాక్ట్‌ ట్రాకింగ్‌
4

331


నలుగురిపై కేసు నమోదు

కరోనా వైరస్‌పై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారంచేసిన ముగ్గురిపై సంగారెడ్డి జిల్లాలో  కేసు నమోదైంది. అందోల్‌ మండ లం తాలెల్మకు చెందిన ఎండీ ఖలీల్‌, బీ సురేశ్‌, ఎర్పుల లింగంపై కేసు నమోదు చేసినట్టు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. వైరస్‌పై వాట్సప్‌ గ్రూపులో తప్పుడు సమాచారం పోస్టుచేయడంతో ఆ గ్రూపు అడ్మిన్‌, 38వ వార్డు కౌన్సిలర్‌ గూడూరి భాస్కర్‌పై సిరిసిల్ల పోలీసులు కేసు నమోదుచేశారు. 

మంథని మున్సిపల్‌ కమిషనర్‌పై వేటు

రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ఉన్నా ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే సెలవుపై వెళ్లిన పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్‌ కమిషనర్‌ గుట్టల మల్లికార్జునస్వామి సస్పెంన్షన్‌కు గురయ్యారు.

 సీడ్‌ ఆఫీసర్స్‌ రాతపరీక్ష వాయిదా

తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థలో ఒప్పంద ప్రాతిపదికన సీడ్‌ ఆఫీసర్స్‌ నియామక రాతపరీక్ష వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను అనుసరించి ఈ నెల 29న నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేసినట్టు విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేశవులు తెలిపారు. రాతపరీక్ష నిర్వహణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

ఈశా యోగా నిలిపివేత

ప్రపంచవ్యాప్తంగా ఈశా యోగా సెంటర్లలో జరిగే కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఈశా యోగా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురుతో సహా అందరూ వెంటనే ప్రయాణాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. 

బృందాలుగా భోజనాలు వద్దు

పురపాలకశాఖ అధికారులు, సిబ్బంది వ్యక్తి గత శుభ్రత పాటించాలని ఆ శాఖ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. సదస్సులు, సమావేశాల్లో పాల్గొనకూడదని, బృందాలుగా భోజనాలు చేయకూడదని కోరారు.

చిలుకూరు ఆలయం మూసివేత

రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ అర్చకుడు సీఎల్‌ రంగరాజన్‌ ప్రకటించారు. ఆలయాన్ని గురువారం నుంచి 25వ తేదీవరకు మూసి వేస్తున్నట్టు చెప్పారు. స్వామివారికి నిత్యం ఆరాదన, అర్చన, పూజా కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.

తిరుమలలో ఆర్జిత సేవలు బంద్‌

తిరుమల శ్రీవారి ఆలయంలో పలు సేవలు తాత్కాలికంగా రద్దు చేశారు. ఉత్సవ మూర్తులకు నిర్వహించే అన్నిరకాల ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు టీటీడీ ప్రకటించింది. కల్యాణోత్సవాన్ని మాత్రం స్వామివారికి ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆర్జిన సేవా టికెట్లు ఉన్న భక్తులు తమ తిరుమల ప్రయాణాలను రద్దు చేసుకోవాలని లేదా వాయిదా వేసుకోవాలని, తప్పనిసరిగా వచ్చే భక్తులకు మాత్రం వీఐపీ బ్రేక్‌లో అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. శ్రీవారి పుష్కరిణిని మూసివేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అర్చనలు బంద్‌చేశారు.

లోకాయుక్తలో కేసులు వాయిదా

తమ పరిధిలోని కేసులను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర లోకాయుక్త కార్యాలయం తెలిపింది. లోకాయుక్త, ఉపలోకాయుక్త వద్ద పెండింగ్‌లో ఉన్న కేసుల్లో అధికారులెవరూ ఈ నెల 31వ తేదీవరకు హాజరుకానవసరం లేదని పేర్కొన్నది. లోకాయుక్త రిజిస్ట్రార్‌ ఫిర్యాదులను స్వీకరిస్తారు. అత్యవసర కేసులను సోమ, శుక్రవారాల్లో విచారణకు స్వీకరిస్తారు.

హెచ్చార్సీలో అత్యవసర కేసులే..

మానవహక్కుల కమిషన్‌లో అత్యవసర కేసులను మాత్రమే చేపట్టనున్నట్టు కమిషన్‌ సెక్రటరీ పేర్కొన్నారు. మంగళ, గురువారాల్లో ఛాంబర్లలో విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. సాధారణ కేసులను ఏప్రిల్‌ 9వ తేదీవరకు వాయిదా వేస్తున్నామని చెప్పారు. 

ఎయిమ్స్‌లో ఐసొలేషన్‌ కేంద్రం

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజుల్లో 200 బెడ్లతో ఐసొలేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించేలా పనులను ముమ్మరంచేశారు.

ఎస్సీ విద్యార్థులకు 35.97 లక్షలు 

కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఎస్సీ విద్యార్థుల సంక్షేమ హాస్టళ్లలో  జాగ్రత్త చర్యలకు ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేకంగా నిధులను విడుదల చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం క్రూషియల్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ నుంచి రూ.35.97 లక్షలు విడుదలచేసినట్టు ఆ శాఖ కమిషనర్‌ తెలిపారు. నిధుల నుంచి పదో తరగతి, ఇతర పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా కిట్లను అందజేస్తామని చెప్పారు.
logo