బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 01:18:44

ఔటర్‌కు నలువైపులా.. టౌన్‌షిప్‌లు

ఔటర్‌కు నలువైపులా.. టౌన్‌షిప్‌లు

  • కార్యరూపంలోకి రానున్న ‘ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ-2020’ 
  • యువత ఆలోచనలకు అనుగుణంగా ‘వాక్‌-టు-వర్క్‌' కాన్సెప్ట్‌  

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలను ఒక్కొక్కటిగా ఆచరణలోకి తీసుకొస్తున్నది. ఈ మేరకు విస్తరిస్తున్న గ్రేటర్‌ జనాభాను దృష్టిలో ఉంచుకొని నగరాభివృద్ధిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తున్నది. ప్రస్తుతం నగర జనాభా కోటికి చేరడం, అభివృద్ధి, జనాభా ఒకే చోట కేంద్రీకృతం అవడం వల్ల భవిష్యత్తులో అనేక అవాంతరా లు తలెత్తనున్నాయని భావించిన హెచ్‌ఎండీఏ ఔట ర్‌ లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఔటర్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో నగరానికి నలుదిశలా రవాణా సౌ కర్యం మెరుగైంది. దీంతో మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యంగా కొత్తగా ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లను ఏర్పాటుచేయాలని భావించి ప్రతిపాదనలను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతున్నది. 

ముంబై, ఢిల్లీ వంటి మెట్రో పట్టణాలతో పోటీపడుతున్న హైదరాబాద్‌ జనాభా మరింత పెరిగితే సమస్యలు ఎదురవుతాయని భావించి ప్రత్యామ్నాయంగా ‘ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ-2020’ విధానంపై క్యాబినెట్‌ చర్చించింది. దేశంలో ఇప్పటి వరకు కేవలం మహారాష్ట్ర, గుజరాత్‌ రెండు రాష్ర్టాల్లోనే ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ ప్రక్రియ అమలులో ఉంది.ఈ క్రమంలోనే ఔటర్‌ రింగు రోడ్డు పరిసరాల్లో, రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లో శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు వీలుగా కసరత్తు చేస్తున్నది. త్వరలో ‘ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ-2020’  కార్యరూపంలోకి రానుంది.

 ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ల ఆవశ్యకత 

జంట నగరాల పరిధిలో నివాస, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు నిండిపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే  యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కాలం విలువను గుర్తిస్తూ తక్కువ ప్రయాణ సమయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము నివసించే ప్రాంతానికి వర్క్‌ ప్లేస్‌ దగ్గరలో ఉండాలని ఆశిస్తున్నారు. ఇదే విషయాన్ని  క్రెడాయ్‌, ట్రెడా వంటి సంస్థలతో పాటు తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (టీడీఏ), ఇతర రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ల ఆవశ్యకతపై పలుమార్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ఇందులో భాగంగానే  ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీకి రూపకల్పన చేశారు. 

యువత ఆలోచనలకు అనుగుణంగా ‘వాక్‌-టు-వర్క్‌' కాన్సెప్ట్‌' యువత అవసరాలను తీర్చే విధంగా ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ ఉండనుంది. నగరానికి ఉత్తర దిక్కున మేడ్చల్‌-శామీర్‌పేట, తూర్పున పోచారం- ఘట్‌కేసర్‌, దక్షిణాన కొత్తూరు-షాద్‌నగర్‌, పడమర దిక్కున సంగారెడ్డి-శంకర్‌పల్లి ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ల ఏర్పాటు కానున్నాయి.  ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ హైదరాబాద్‌ శివారు ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతుంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని కనీసం 100 ఎకరాలు, ఔటర్‌ రింగు రోడ్డుకు సమీప సరిహద్దు నుంచి కనీసం ఐదు కిలోమీటర్ల దూరంలో టౌన్‌షిప్‌లు రానున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లలో 40శాతం ఏరియా మౌలిక సదుపాయాల (10శాతం గ్రీనరీ , రోడ్లు, ఎస్టీపీలు, విద్యుత్‌ సబ్‌స్టేషను తదితర)లకు కేటాయించనున్నారు.

ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లు అంటే..? 

నివాస ప్రాంతాలు, వ్యాపార వాణిజ్య ప్రాంతాలు, కార్యాలయాలు అందుబాటులో ఉండటం, ఆయా ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, మురుగునీటి పారుదల, విద్యుత్‌, విద్య, వైద్య సదుపాయాలు, కమ్యూనిటీ హాల్స్‌ వంటి మౌలిక సౌకర్యాల కల్పనతో మెరుగైన వసతులు ఏర్పడనున్నాయి. ఎక్కువ ఓపెన్‌  స్థలాలు, వాటిలో పచ్చదనం, తక్కువ ట్రాఫిక్‌ సమస్యలు ఉండేట్టుగా ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీ ఉండనున్నది. 

ప్రయోజనాలు 

పట్టణ ప్రాంతాలు, నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించడం, ఉద్యోగులు, ప్రజలు తమ అవసరాల కోసం టౌన్‌షిప్‌ను దాటి బయట దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.


logo