గురువారం 28 మే 2020
Telangana - May 22, 2020 , 06:37:27

వలస కార్మికులకు అండగా ప్రభుత్వం

వలస కార్మికులకు అండగా ప్రభుత్వం

మల్కాజిగిరి : వలస కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నది. కార్మికులు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో గుర్తించిన వలస కార్మికులకు నగదుతోపాటు బియ్యం పంపిణీ చేశారు. వసతి సౌకర్యం లేనివారికి షెల్టర్‌ను సైతం ఏర్పాటు చేసి చేరదీశారు. షెల్టర్‌లో వసతి పొందుతున్న కార్మికులకు ఆహారం అందిస్తూ ఆకలిని తీర్చుతున్నారు. ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. శానిటైజర్లు, సబ్బులను జీహెచ్‌ంఎసీ అధికారులు అందుబాటులో ఉంచి వారు అంటువ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

స్వస్థలాలకు వెళ్లేందుకు పేర్లు నమోదు

అయితే లాక్‌డౌన్‌ సడలింపుతో సొంతూర్లకు వెళ్లే కార్మికులు పోలీస్‌స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకుని వెళ్లేందుకు వేచిచూస్తున్నారు. జాబితా రాగానే కేంద్ర ప్రభుత్వం ఏర్పా టు చేసిన రైళ్లలో వారి స్వస్థలాలకు వెళుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై వలస కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


మల్కాజిగిరి, అల్వాల్‌ సర్కిళ్లలో 6376 మంది

మల్కాజిగిరి నియోజకవర్గంలోని మల్కాజిగిరి, అల్వాల్‌ సర్కిళ్లలో 6376 మంది వలస కార్మికులను గుర్తించిన విషయం విధితమే. వలస కార్మికులకు రూ.500నగదు చొప్పున రూ.31,8800లను ఇప్పటి వరకు అందించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా మొత్తం 765 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం షెల్టర్‌లో 30 మంది వలస కార్మికులు ఉన్నట్లు మల్కాజిగిరి సర్కిల్‌ ప్రాజెక్ట్‌ అధికారి అశోక్‌కుమార్‌ తెలిపారు. వారిని ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. 

నగదు, బియ్యం పంపిణీ పూర్తి: గీత, మల్కాజిగిరి తహసీల్దార్‌

వలస కార్మికులందరికీ నగదు, బియ్యం పంపిణీ చేశాం. ప్రభుత్వ  ఆదేశాల మేరకు నివేదిక ఇచ్చాం. నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. కార్మికులకు ఇబ్బందులు లేకుండా రూ.500 నగదుతోపాటు 12కిలోల బియ్యం అందజేశాం. షెల్టర్లలో ఉన్న వారికి వైద్య పరీక్షలను ప్రతిరోజూ నిర్వహిస్తున్నాం. వలస కార్మికులు కొందరు రైళ్ల ద్వారా స్వస్థలాలకు వెళ్తున్నారు.    ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo