శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 02:48:31

ఈ నెల ఉద్యోగులకు పూర్తి వేతనం

ఈ నెల ఉద్యోగులకు పూర్తి వేతనం

  • ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన
  • ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల హర్షం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెల పూర్తి జీతం చెల్లించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్ర ఆదాయ పరిస్థితి కొద్దిగా మెరుగుపడినందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ విధించడంతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. కేంద్రం నుంచి సహాయం అందలేదు. ఉన్న కొద్దిపాటి వనరులతోనే కొవిడ్‌ నివారణ చర్యలు చేపట్టడం, వలస కూలీలను ఆదుకోవడం, పేద ప్రజలకు ఉచిత బియ్యం, నగదు పంపిణీ చేయడం వంటివి చేపట్టాల్సి వచ్చింది. 

అదే సమయంలో రాష్ట్ర రైతాంగానికి అండగా నిలువాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొంత కష్టమైనప్పటికీ ఉద్యోగుల వేతనాలలో కొంతమొత్తం చెల్లించకుండా వాయిదావేశారు. పరిస్థితులు కుదుట పడిన తరువాత ఇస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతించారు. ముఖ్యమంత్రి మాటపై నమ్మకం ఉంచారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మార్చి, ఏప్రిల్‌, మే నెల వేతనంలో కొంత మేరక కోత విధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయం కొద్దిగా పెరుగుతున్నది. దీంతో జూన్‌ నెల వేతనం పూర్తిగా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం నిర్ణయంపై ఉపాధ్యాయ ఎమ్సెలీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి హర్షం వ్యక్తంచేశారు.

సీఎంకు ధన్యవాదాలు తెలిపిన టీఎన్జీవో

జూన్‌ నెల జీతం పూర్తిగా చెల్లించాలని నిర్ణయించడంపై ఉద్యోగుల జేఏసీ పక్షాన కారం రవీందర్‌రెడ్డి, మమత, మామిళ్ల రాజేందర్‌, సత్యనారాయణ, జ్ఞానేశ్వర్‌, వంగ రవీందర్‌రెడ్డి, ఏ పద్మాచారి, మధుసూధన్‌రెడ్డి, మణిపాల్‌రెడ్డి, మల్లారెడ్డి, సతీశ్‌, హనుమంత్‌నాయక్‌.. సీఎం కేసీఆర్‌కు ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. కోత విధించిన జీతాలను కూడా త్వరలో చెల్లించాలని కోరారు.

మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌కు కృతజ్ఞతలు

ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇవ్వాలని, పదవీ విరమణ వయ స్సు 61 ఏండ్లకు పెంచాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిశామని ఉద్యోగుల జేఏసీ నేతలు తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఉద్యోగుల పక్షాన మంత్రి కేటీఆర్‌ ఫోన్‌లో తమ సమస్యలను వివరించారని చె ప్పారు. వాటిపై కేటీఆర్‌ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

సీఎంకు సచివాలయ సంఘం ధన్యవాదాలు

ఇచ్చిన మాట ప్రకారం లాక్‌డౌన్‌ పూర్తికాగానే పూర్తి వేతనాలు చెల్లిస్తున్న సీఎం కేసీఆర్‌కు సచివాలయ ఉద్యోగుల సంఘం  అధ్యక్షుడు నరేందర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. పెన్షన్లు కూడా పూర్తి గా చెల్లించాలని నిర్ణయించినందుకు ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ పక్షాన ఐకాస చైర్మన్‌ కే లక్ష్మయ్య ధన్యవాదాలు తెలిపారు. సీఎం నిర్ణయంపై పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం అధ్య క్ష, ప్రధానకార్యదర్శులు జీ శ్రీనివాసరావు, ఏపాల సత్యనారాయణరెడ్డి, పీఆర్టీయూటీఎస్‌ అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, పీఆర్టీయూ నాయకులు మారెడ్డి అంజిరెడ్డి, చెన్నయ్య, యూటీఎఫ్‌ నాయకులు జంగయ్య, చావ రవి, ఎస్టీయూ నాయకులు పర్వతరెడ్డి, సదానందంగౌడ్‌  హర్షం ప్రకటించారు.


logo