బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 06, 2020 , 04:05:49

‘రాయలసీమ’పై న్యాయపోరాటం

‘రాయలసీమ’పై న్యాయపోరాటం

 • ఏపీ ఎత్తిపోతలపై సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ  
 • ఏపీ పునర్విభజనచట్టాన్ని పట్టించుకోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం
 • జల్‌శక్తి, కృష్ణాబోర్డు ఆదేశాలూ బేఖాతర్‌ 
 • ట్రిబ్యునల్‌లో విచారణ కొనసాగుతుండగానే జీవోజారీ
 • చెన్నైకి తాగునీటిమాటున వందల టీఎంసీలు చెర
 • అత్యవసరంగా నిలిపివేత ఉత్తర్వులివ్వాలంటూ ఎస్సెల్పీ దాఖలు

ఏపీ అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీచేసిన జీవోలు 203, 388పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లకుండా అత్యవసర ప్రాతిపదిక ఆదేశాలివ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. చట్టాలు పట్టకుండా.. కేంద్రం, కృష్ణా బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా టెండర్లతో ముందుకుపోతున్న తీరును వివరిస్తూ బుధవారం ఈ-ఫైలింగ్‌ ద్వారా స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌ను దాఖలుచేసింది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కృష్ణా, గోదావరి జలాల్లో మనహక్కు, వాటాను కాపాడుకొని తీరాలి.. చుక్కనీటినీ వదులుకొనే ప్రసక్తేలేదు అంటూ ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్‌ సూచించిన మేరకు తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతున్నది. కృష్ణా జలాలను అక్రమతరలించేందుకు సిద్ధమైన ఏపీని నిలువరించాలంటూ సుప్రీంకోర్టు తలుపుతట్టింది. చెన్నైకి తాగునీటి మాటున పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీల కృష్ణాజలాలను ఇతర బేసిన్లకు తరలిస్తున్నదని, ఏపీ చేపడుతున్న అక్రమప్రాజెక్టులతో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నదని ఉన్నత న్యాయస్థానానికి విన్నవించింది. వీటిని ఆధారాలతోసహా 101 పేజీల్లో పొందుపరుస్తూ తెలంగాణ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌(ఎస్సెల్పీ)ను దాఖలుచేశారు. శ్రీశైలంలో 797 అడుగుల నీటిమట్టం అంటే జలాశయ అడుగుభాగంలో నుంచి నీటిని తోడుకునేలా ప్రాజెక్టును చేపడుతున్నదని, తద్వారా తెలంగాణ పరిధిలో బేసిన్‌లోని ప్రాజెక్టులతోపాటు హైదరాబాద్‌ తాగునీరు అందని పరిస్థితులు ఉత్పన్నమవుతాయని పిటిషన్‌లో తెలిపారు. ఏపీ చేపట్టిన టెండర్లప్రక్రియను నిలిపివేసి, ప్రాజెక్టుపై ముందుకుపోకుండా ఉత్తర్వులు జారీచేయాలని అభ్యర్థించారు. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తుది ఉత్తర్వులు నిలిపివేయాలంటూ గతంలో సుప్రీంకోర్టులో ఏపీ పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దానికి అనుబంధంగా తాజా పిటిషన్‌ను దాఖలుచేసింది. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తుది ఉత్తర్వులను నిలిపివేయాలంటూ ఉమ్మడి ఏపీ గతంలో సుప్రీంలో పిటిషన్‌ వేసింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇదేఅంశంపై 2014లో (నెం.33671/2014) స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రస్తుతం అది సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున దానికి అనుబంధంగా తాజా పిటిషన్‌ను దాఖలుచేసింది. అందుకే ఈ పిటిషన్‌లో ముందుగా కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత ఏపీని, చివరగా కేంద్రప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నది. కృష్ణాజలాల పంపిణీకి సంబంధించి బచావత్‌, బ్రిజేష్‌ ట్రిబ్యునల్స్‌ కేటాయింపులు.. తదుపరి పరిణామాలను తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో సమగ్రంగా పొందుపరిచింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టుగానే శ్రీశైలం

శ్రీశైలం జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు మాత్రమే. ఆవిరినష్టాలు తప్ప జలాశయంలోని నీటిని ఇతర అవసరాలకు మళ్లించవద్దు. ఇందుకోసం శ్రీశైలం ఎడమగట్టున 900 మెగావాట్లు, కుడిగట్టున 770 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్రాన్సిస్‌ టర్బయిన్లతో కూడిన విద్యుత్‌ ఉత్పత్తికేంద్రాలను ఏర్పాటుచేశారు. కరెంటు ఉత్పత్తిద్వారా విడుదలయిన నీటిని నాగార్జునసాగర్‌కు తరలించి అక్కడ ముందుగా తాగునీటి అవసరాలు, తర్వాత ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించాలి.

చెన్నై మాటున జల దోపిడీ

చెన్నైకి తాగునీటినందించేందుకు బచావత్‌ అవార్డులో 15 టీఎంసీలను కేటాయించారు. 1976-77 జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకు శ్రీశైలం నుంచి 1,500 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో లైనింగ్‌ చేసిన కాలువను మాత్రమే నిర్మించాలి. ఏడాదిలో జూలై నుంచి అక్టోబర్‌ వరకే ఈ నీటిని తరలించాలి. కానీ, ఏనాడూ చెన్నైకి 15 టీఎంసీలు అందలేదు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వమే స్వయంగా బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌కు ఇచ్చిన నివేదికలో స్పష్టంచేసింది. దీంతోపాటు శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్సార్బీసీ)కు 19 టీఎంసీలను ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పునఃకేటాయింపులు చేసింది. వీటినికూడా జూలై-అక్టోబర్‌ వరకే తరలించాల్సి ఉన్నది. రెండింటికి కలిపి 34 టీఎంసీలను తరలించాల్సి ఉండగా.. వీటిమాటున పెన్నాబేసిన్‌కు ఏపీ వందల టీఎంసీలను మళ్లిస్తున్నది. ఉమ్మడిరాష్ట్రంలోనే 11,150 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో లైనింగ్‌ చేయని కాలువను నిర్మించి రాయలసీమలోని పెన్నాబేసిన్‌కు కృష్ణాజలాల్ని తరలించడం మొదలుపెట్టారు. దీనిపై ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదుచేశాయి. ఈ అంశం ఒకవైపు ట్రిబ్యునల్‌లో విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఉమ్మడి ఏపీ పాలకులు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. దీనికి అదనంగా కరెంటు ఉత్పత్తి ద్వారా దిగువకు 5వేల క్యూసెక్కుల జలాలను విడుదలచేసే పవర్‌ చానెల్‌ కూడా ఉన్నది. అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకు 1500 క్యూసెక్కుల లైనింగ్‌ కాలువను నిర్మించాల్సి ఉండగా.. 60,150 క్యూసెక్కుల (11,500+44,000+5000) లైనింగ్‌ చేయని కాలువను నిర్మించారు. గతంలో సుప్రీంలో వేసిన ఎస్సెల్పీలో ఈ అంశాన్ని కూడా సవాల్‌ చేశారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం చెపుతున్నదిదీ

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్‌-85 ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు కొత్తప్రాజెక్టును చేపట్టాల్సివస్తే ముందుగా కృష్ణా బోర్డు సాంకేతిక అనుమతి తీసుకోవాలి. ట్రిబ్యునల్‌ కేటాయింపుల ఉల్లంఘన, ఇతరరాష్ర్టాల ప్రాజెక్టులకు నష్టం జరుగునంత వరకే బోర్డు కూడా అనుమతి ఇస్తుంది. సెక్షన్‌-85 ప్రకారం బోర్డు సిఫారసు మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రి నేతృత్వంలో రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కూడిన అపెక్స్‌ కౌన్సిల్‌ సంతృప్తి చెందితేనే కొత్తప్రాజెక్టుకు అనుమతి వస్తుంది. కానీ, కృష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకోకుండానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు మూడు టీఎంసీలను ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల, 80 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు విస్తరణ పనులకు రూ.6,829.15 కోట్లతో మే5న పాలనా అనుమతులు జారీచేసింది. ముఖ్యంగా కృష్ణాతో ఎలాంటి సంబంధంలేని పెన్నాబేసిన్‌కు కృష్ణాజలాల్ని తరలించనున్నారు. అదేవిదంగా 15.7.2020న పెన్నాబేసిన్‌లో కాలువల సామర్థ్య పెంపు పనులను రూ.1,415 కోట్లతో చేపట్టేందుకు జీవో 388 ద్వారా పాలనా అనుమతులు కూడా ఇచ్చింది. 

ఆది నుంచి అన్నీ సాకులే..

చెన్నై తాగునీటి సాకుతో పెన్నా బేసిన్‌కు వందల టీఎంసీల కొద్దీ కృష్ణాజలాల్ని ఏపీ మళ్లిస్తున్నదంటూ తెలంగాణకు చెందిన జీ శ్రీనివాస్‌ గతంలోనే జాతీయ హరిత ట్రిబ్యునల్‌, చెన్నై ధర్మాసనంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై పిటిషన్‌వేశారు. దీనిపై ఎన్జీటీ స్టేటస్‌ కో ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలుచేశాక జరిగిన విచారణలో ఎస్టీజీ తీర్పులో సవరణ చేసింది. అయితే ఏపీప్రభుత్వం ఎన్జీటీలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో చెన్నై తాగునీటి సరఫరాను సాకుగా చూపి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సమర్ధించుకున్నది.

చారిత్రకంగా అన్యాయమే

తెలంగాణకు దశాబ్దాలుగా కృష్ణాజలాల్లో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో స్పష్టంచేసింది. ‘వాస్తవంగా బేసిన్‌లోని అన్నిరాష్ర్టాలు కలిపి బచావత్‌ ట్రిబ్యునల్‌ ముందు 4,146 టీఎంసీలు, బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ముందు 4,800 టీఎంసీ మేర ప్రతిపాదనలు ఉంచాయి. ఈ క్రమంలో 75 శాతం డిపెండబులిటీ ప్రాతిపదికన బచావత్‌ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను కేటాయించగా... ఇందులో 331 టీఎంసీలను ఇతర బేసిన్‌కు తరలించేలా ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది. బేసిన్‌లో 330 టీఎంసీల మిగులుజలాలు (2390-2060=330) ఉన్నట్లు బచావత్‌ ట్రిబ్యునల్‌ లెక్కించగా.. ఉమ్మడి ఏపీలో 150.50 టీఎంసీల మేర పెన్నాబేసిన్‌లో, 225.40 టీఎంసీల సామర్థ్యంతో తెలంగాణ పరిధిలో ప్రాజెక్టులు చేపట్టారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జీవోల ద్వారా 299 టీఎంసీల మేర కేటాయింపులు చేశారు. వాస్తవంగా 75 శాతం డిపెండబులిటీపై తెలంగాణకు కనీసం 575 టీఎంసీలు కేటాయించాలి. దీనిపై తెలంగాణప్రభుత్వం న్యాయపోరాటం చేస్తున్న క్రమంలో ప్రస్తుతం బ్రిజేష్‌ట్రిబ్యునల్‌ ముందు విచారణ కొనసాగుతున్నది. ఈ సమయంలో ఏపీ కొత్త ప్రాజెక్టు చేపట్టడం అన్యాయం, అక్రమం. కేంద్రప్రభుత్వం ట్రిబ్యునల్‌లో ఏర్పడిన ఖాళీని భర్తీచేయకపోవడంతో ఏడాది కాలంగా బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ విచారణ కూడా కొనసాగడం లేదు’అని పేర్కొన్నది.

మిగులుజలాల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులు

ఏపీ పరిధి: తెలుగుగంగ-29.00, వెలిగొండ-43.50, హంద్రీనీవా-40.00, గాలేరు నగరి-38.00 కలిపి మొత్తం 150.50 టీఎంసీలు. తెలంగాణ పరిధి: ఏఎమ్మార్‌-ఎస్సెల్బీసీ-40.00, కల్వకుర్తి-40.00, నెట్టెంపాడు-25.40, పాలమూరు రంగారెడ్డి-90.00, డిండి-30.00 కలిపి మొత్తం 225.40 టీఎంసీలు. 

ఫిర్యాదులన్నీ బుట్టదాఖలు

 • పాలనా అనుమతుల కంటే ముందుగానే అసెంబ్లీలో కొత్త ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం పలు పత్రికల్లో ప్రచురితమైంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం 29.01.2020న కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.
 • తెలంగాణ ఫిర్యాదు మేరకు కొత్త ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించాలని బోర్డు ఏపీ జలవనరులశాఖకు 5.2.2020న లేఖ రాసింది.
 • ఏపీ ప్రభుత్వం జీవో 203 ద్వారా ఇచ్చిన పాలనా అనుమతులపై తెలంగాణ 15.07.2020న కృష్ణాబోర్డు, కేంద్ర జల్‌శక్తికి ఫిర్యాదు చేసింది. దీంతో కొత్త ప్రాజెక్టుపై ముందుకుపోవద్దంటూ ఏపీకి కేంద్ర జల్‌శక్తి ఆదేశాలు జారీ చేసింది. 
 • బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు తీసుకోవాలని, ఆలోగా డీపీఆర్‌ సమర్పించాలని జూన్‌ 4న సమావేశంలోకృష్ణాబోర్డు చైర్మన్‌ ఆంధ్రప్రదేశ్‌ను ఆదేశించారు. 
 • జల్‌శక్తి, బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం 15.7.2020న రాయలసీమ ఎత్తిపోతలకు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై తెలంగాణ జలవనరుల శాఖ ఈఎన్సీ 25.7.2020న మరోసారి కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన బోర్డు.. టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలంటూ 29.7.2020న ఏపీ జలవనరుల శాఖకు లేఖ రాసింది. 


logo