మంగళవారం 26 మే 2020
Telangana - May 03, 2020 , 14:53:44

జీవో 3 పై రివ్యూ పిటిషన్ వేస్తాం

జీవో 3 పై రివ్యూ పిటిషన్ వేస్తాం

మహబూబాబాద్  : గిరిజన ఏజన్సీ ప్రాంతాల్లోని  ఉద్యోగాలను వందశాతం గిరిజనులతోనే భర్తీ చేయాలని జారీ చేసిన జీవో 3ని సుప్రీం కోర్టు కొట్టివేయడంపై తెలుగు గిరిజనుల్లో ఆందోళన ఉంది. ఈ జీవోని కొనసాగించే విధంగా రివ్యూ పిటిషన్ వేసి గిరిజన హక్కులను కాపాడుతామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ చెప్పారు. స్వయంగా ఢిల్లీ వెళ్లి సుప్రీం కోర్టు న్యాయమూర్తులను, న్యాయ సలహాదారులతో మాట్లాడి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలోఈ జీవో 3ని కొనసాగించేందుకు రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు.  మహబూబాబాద్ లో నేడు ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, హరిప్రియ నాయక్ తదితరులతో కలిసి నందన గార్డెన్స్ లో శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు.

 ఈ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ....‘‘ జీవో 3పై గిరిజనులకు అనుకూలమైన తీర్పు వచ్చేవరకు ముఖ్యమంత్రి కేసీఆర్  మార్గదర్శనంలో పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి సూచనల మేరకు తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి రివ్యూ పిటిషన్ వేయబోతున్నాం. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులను పెట్టుకుని, న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఈ జీవోను కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తున్నామని హామీ ఇస్తున్నాను. గిరిజనులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేంద్ర మంత్రి తో మాట్లాడినప్పుడు జీవో నెంబర్ 3ని కొట్టివేయడంపై రివ్యూ పిటిషన్ వేస్తున్నాం సహకరించాలని కోరడం జరిగింది.. కరోనా బారిన పడకుండా ఉండాలని, ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు నష్టం వస్తున్నా లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. ప్రజలకు అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువులు అందిస్తూ, రైతు పండించిన పంట దళారుల చేతికి వెళ్లకుండా కొనుగోలు చేస్తూ వారిని ఆదుకుంటున్నాం.

మన రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది వలస కూలీలున్నారు. వీరిని వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో ఉన్న మన తెలంగాణ వాసులను ఇక్కడకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ’’ అని చెప్పారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న మానుకోట వాసులను తీసుకురావాలి. అనంతరం మహబూబాబాద్ కలెక్టర్ , అధికారులతో వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపడంపై మంత్రి  సత్యవతిరాథోడ్ సమీక్ష చేశారు. మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 10వేల మంది వలస కూలీలున్నారని, వీరందరిని వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మండలాల వారిగా వివరాలు సేకరించి, బస్సులు, ఇతర వాహనాలు పెట్టాలన్నారు.  ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ వారిని రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మహబూబాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలలో ఉన్న వారిని గుర్తించి, వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. 


logo