బుధవారం 24 ఫిబ్రవరి 2021
Telangana - Jan 23, 2021 , 12:51:21

వ్యవసాయానికి ఏటా రూ.35 వేల కోట్లు: మంత్రి హరీశ్‌

వ్యవసాయానికి ఏటా రూ.35 వేల కోట్లు: మంత్రి హరీశ్‌

సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంపై ఏటా రూ.35 వేల కోట్లు వెచ్చిస్తున్నదని, దేశంలో ఇంత‌ ఖర్చు ‌చేస్తున్న రాష్ట్రం‌ తెలంగాణ మాత్రమేనని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డెబ్భై ఏండ్లు దాటినా రైతుల పరిస్థితి మారలేదన్నారు. అందరికీ సంఘాలున్నప్పటికీ రైతులకు మాత్రం లేవని చెప్పారు. రైతులను సంఘటితం చేయాలన్నది సీఎం ఆకాంక్ష అని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం నందిగామలో రైతువేదిక, షాపింగ్‌ కాంప్లెక్స్‌ను మంత్రి ప్రారంభించారు. 


ఎన్నికల‌ సమయంలో అన్ని పార్టీల నాయకులు రైతుల గురించి మాట్లాడుతారని, అనంతరం పట్టించుకోరని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల్లోనే కరెంటు సమస్యను పరిష్కరించామని చెప్పారు. ప్రాజెక్టులు నిర్మించడంతో ఇప్పుడు కరెంటు ఉన్నా లేకున్నా రెండు పంటలు పండించే పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చారని చెప్పారు. 


అనంతరం పఠాన్‌చెరు టౌన్‌లో గాంధీ థీమ్ పార్కుకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.1.6 కోట్లతో పార్కును నిర్మిస్తున్నామని చెప్పారు. కార్పోరేషన్ ఎన్నికల్లో ఇచ్చిన హమీని ‌నిలబెట్టుకునేందుకు తొలి అడుగు వేశామన్నారు. ఈ పార్కును సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ స్థాయి దవాఖానను నిర్మిస్తామని చెప్పారు. 

VIDEOS

logo