మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 03:38:19

కాగితాలుండవు.. కలవాల్సిన పనిలేదు

కాగితాలుండవు.. కలవాల్సిన పనిలేదు

  • 13 నుంచి ఈ ఆఫీస్‌.. ఆన్‌లైన్‌లోనే ప్రభుత్వం!
  • మండలాఫీసు నుంచి సచివాలయం దాకా కార్యకలాపాలన్నీ ఇక కంప్యూటర్లలోనే
  • ఉద్యోగులకు కొనసాగుతున్న శిక్షణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాగితం వినియోగాన్ని ఆపండి.. చెట్లను రక్షించండి.. పర్యావరణాన్ని కాపాడండి అంటూ పర్యావరణ ప్రేమికులు ఎప్పటినుంచో కోరుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అటువంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం అవకాశాన్ని ఇవ్వడం ద్వారా ఆన్‌లైన్‌లోనే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.  ఈ కష్టకాలంలోనూ విధులు నిర్వర్తించి ప్రజలకు ఏవిధంగా సేవలు అందించాలన్నదానిపై తెలంగాణ సర్కారు సైతం దృష్టి సారించింది. ఉద్యోగులు, అధికారులు  ఆన్‌లైన్‌లోనే విధులు నిర్వర్తించి ప్రజలకు సేవలు అందించాలని నిర్ణయించింది.

ఇందుకోసం ఐటీ శాఖ సహకారంతో ఈ-ఆఫీస్‌ నిర్వహణకు పూనుకొన్నది. సోమవారం నుంచి అమలులోకి రానున్న ఈ-ఆఫీస్‌ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని విభాగాలలో నోడల్‌ అధికారులను, టెక్నికల్‌ అసిస్టెంట్లను నియమించారు. ఆన్‌లైన్‌లో ఫైళ్ల నిర్వహణకు సంబంధించిన శిక్షణ కూడా మొదలుపెట్టారు.  ఈ- ఆఫీస్‌ పని విధానంలో కాగితంతో పని ఉండదు. ఉద్యోగులు, అధికారులు తమ మధ్య ఫైళ్ల బదలాయింపు కోసమో లేక చర్చించడం కోసం ప్రత్యేకంగా భేటీ కావాల్సిన అవసరం ఉండదు. కంప్యూటర్‌ స్క్రీన్‌పై ఫైల్‌ చూసుకొంటూ ఇంటర్‌కమ్‌ ఫోన్‌లో మాట్లాడి సందేహాలు తీర్చుకోవచ్చు. జటిలమైన సమస్య వచ్చి చట్టం వెలుగులో చర్చించి విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు డిస్కస్‌ అని ప్రత్యేకంగా సెక్రటరీలు రాసి పంపిస్తే, నిర్దిష్ట సమయంలో వెళ్లి మాట్లాడటానికి ఆస్కారం ఉంటుంది.  

ఈ- ఆఫీస్‌ పని విధానం ఇలా..

ఈ-ఆఫీస్‌  విధానంలో మొదట పిటిషన్లు ఇన్‌వార్డ్‌ సెక్షన్‌కు వస్తాయి. అక్కడ రికార్డు అసిస్టెంట్‌ వాటిని స్కానింగ్‌చేస్తారు. స్కానింగ్‌ చేసిన పిటిషన్‌కు నంబర్‌ ఇచ్చి సంబంధిత సర్క్యులేషన్‌ ఆఫీసర్‌కు ఆన్‌లైన్‌లోనే పంపుతారు. సర్క్యులేషన్‌ ఆఫీసర్‌ దానిని సంబంధిత సెక్షన్‌ ఆఫీసర్‌కు పంపుతారు. సెక్షన్‌ ఆఫీసర్‌ ఆ ఫైల్‌లోని అంశాన్ని చూసే అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌కు అసైన్‌ చేస్తారు. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఆ పిటిషన్‌ను సెక్రటేరియట్‌ మాన్యువల్‌ ప్రకారం చట్టం వెలుగులో పరిశీలించి, నోట్‌ఫైల్‌ రాసి, తిరిగి సెక్షన్‌ ఆఫీసర్‌కు పంపుతారు. సెక్షన్‌ ఆఫీసర్‌ నోట్‌ఫైల్‌ను పరిశీలించి అంతా సవ్యంగా ఉంటే పై అధికారి అసిస్టెంట్‌ సెక్రటరీకి పంపిస్తారు. లేదా ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వెనక్కు పంపించి మళ్లీ ఆన్‌లైన్‌లోనే సరిచేయిస్తారు. అసిస్టెంట్‌ సెక్రెటరీ ఆ ఫైలును డిప్యూటీ సెక్రటరీకి గానీ, అడిషనల్‌ సెక్రటరీ కానీ ఆ శాఖలో ఎవరుంటే వారికి పంపిస్తారు.

వాళ్లు చూసిన తరువాత ఫైనల్‌గా శాఖాధిపతి అయిన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వద్దకు ఆ ఫైలు చేరుతుంది. వీళ్లు ఫైల్‌ను అప్రూవల్‌ చేస్తే జీవో వస్తుంది. లేదా సర్క్యులర్‌ జారీ అవుతుంది.  తుది ఉత్తర్వులు కార్యదర్శి పేరున విడుదలచేసే అధికారి దగ్గరకు వెళుతుంది. సదరు అధికారి కార్యదర్శి పేరున ఉత్తర్వులు జారీచేస్తారు. ఒక్కోసారి సమస్య తీవ్రతను బట్టి ఫైల్‌ సీఎస్‌ వరకు, సీఎస్‌ నుంచి సీఎం వరకు వెళుతుంది. కొన్ని ఫైళ్లు సచివాలయంలో రెండు, మూడు శాఖలతో సంబంధం కలిగి ఉంటాయి. ఆయాశాఖల మధ్య ఫైల్‌ సర్క్యులేషన్‌ కావాల్సి ఉంటుంది. దీనికి ఆయా సెక్షన్‌ అధికారుల ద్వారా ఆన్‌లైన్‌లో ఫైళ్లను ఆయా శాఖలకు పంపుతారు. వాటిని ఆయా శాఖల కార్యదర్శులు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకొని దానిని వెనుకకు పంపుతారు. 

ప్రతి ఉద్యోగికి ప్రత్యేక ఐడీ, పాస్‌వర్డ్‌

ఈ- ఆఫీస్‌ విధానంలో ప్రతి ఉద్యోగికి ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తారు. అవి సదరు ఉద్యోగి, అధికారి మాస్టర్‌ డాటాకు లింక్‌ అయి ఉంటాయి. దీంతో ఎక్కడా ఆ ఫైల్‌ను దారి తప్పించడానికి ఎవ్వరికీ ఆస్కారం ఉండదు. అలాగే సదరు ఉద్యోగికి నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు ఇంటి వద్ద నుంచైనా పనిచేయవచ్చు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఈ తరుణంలో జూలై 31వ తేదీ వరకు సచివాలయంతోపాటు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులను 50 శాతం మాత్రమే రొటేషన్‌ పద్ధతితో హాజరుకావాలని ఆదేశించారు. మిగిలిన వారికి ఇంటి వద్ద నుంచి పనిచేసేందుకు ఈ-ఆఫీస్‌ విధానం ఉపయోగంగా ఉంటుంది. ఆఫీస్‌కు వచ్చిన ఉద్యోగులు కూడా భౌతికదూరం పాటించేందుకు ఈ పద్ధతి దోహదపడుతుందని అధికారులు అంటున్నారు. 

జిల్లాల్లో కూడా ఇదే విధానం

జిల్లాల్లో వచ్చిన పిటిషన్‌ కూడా స్కాన్‌ చేసిన తరువాత తాసిల్దార్‌ నుంచి ఆర్డీవో, అడిషనల్‌ కలెక్టర్‌, కలెక్టర్‌ వరకు వెళ్తుంది. వివిధ శాఖలకు చెందిన పిటిషన్లు ఆయా శాఖల అధికారుల ద్వారా కలెక్టర్‌ వరకు చేరుతాయి. కొన్ని నేరుగా కలెక్టర్‌ కార్యాలయానికే వస్తాయి. అక్కడ ఇన్‌వార్డ్‌ సెక్షన్‌లో స్కానింగ్‌ చేసి సంబంధిత ఆఫీస్‌ సూపరింటెండెంట్‌కు ఫైల్‌ను పంపిస్తారు. సూపరింటెండెంట్‌ సెక్షన్‌ క్లర్క్‌కు పంపించి ఫైల్‌ను పుటప్‌ చేయిస్తారు. ఆ ఫైల్‌ సెక్షన్‌ క్లర్క్‌ నుంచి సూపరింటెండెంట్‌కు అక్కడి నుంచి అడిషనల్‌ కలెక్టర్‌కు, ఆపై కలెక్టర్‌కు చేరుతుంది. ఇదంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.  

ఫైళ్లను ఎక్కడి నుంచైనా తనిఖీ చేయవచ్చు

ఆన్‌లైన్‌ విధానంలో ఫైళ్ల స్థితిగతులను పైఅధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవచ్చు. వారు తమ మొబైల్‌ ఫోన్‌లోనే ఫైల్‌ను ట్రాక్‌ చేయవ చ్చు. ఎక్కడైనా ఫైల్‌ ఆలస్యమైతే అందుకుగల కారణాలపై ఉన్నతాధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఫైల్‌ వేగంగా కదులుతుందని ఒక సీనియర్‌ అధికారి చెప్పారు. అత్యవసరమనుకున్న ఫైల్‌ను అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారి నుంచి కార్యదర్శి వరకు అరగంటలో మూవ్‌ చేయవచ్చునని, అంతవేగంగా ఫైళ్లను క్లియర్‌చేసే అవకాశం ఈ-ఆఫీస్‌ విధానంలో ఉంటుంది.  


logo