శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 01:04:06

హైదరాబాద్‌లో ‘వాన’ సెలవులు

హైదరాబాద్‌లో ‘వాన’ సెలవులు

  • నేడు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కోర్టులు బంద్‌ ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దు పరీక్షలు, ఇంటర్వ్యూలు వాయిదా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు బుధ, గురువారాలు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం నగరంలో వరద పరిస్థితిని సమీక్షించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదని సూచించారు. అదే సమయంలో వరద సహాయ చర్యల్లో పాల్గొనే అత్యవసర సేవల విభాగాలు మాత్రమే తమ కార్యకలాపాల్లో పాలుపంచుకోవాలని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, జిల్లా కలెక్టర్లు సహాయ శిబిరాలు ఏర్పాటుచేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎస్‌ సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉస్మానియా యూనివర్సిటీకి బుధ, గురువారాలను సెలవులుగా ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలు, విభాగాలు, కార్యాలయాలు, కేంద్రాలు మూసి ఉంటాయని తెలిపారు.

ఆపత్కాలంలో అండగా


ఎక్కడ చూసినా జోరు వాన.. ఎటువెళ్లినా భారీ వరద.. రోడ్లు, నాలాలు, వీధులు, ఇండ్లు.. ఏవైపు చూసినా నీళ్లే. విరిగిపడిన చెట్లే. ట్రాఫిక్‌ ఇబ్బందులే. 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న జీహెచ్‌ఎంసీలో అణువణువునూ వాన, వరద ఆక్రమించేశాయి. అధికారులు, సిబ్బంది ఒకచోట సహాయ చర్యలు చేపడితే, మరోచోట మరో సమస్య ఏర్పడింది. ఈ పరిస్థితిని గమనించిన యువకులు తామున్నామంటూ రంగంలోకి దూకారు. విపత్కర పరిస్థితుల్లో అధికారులకు తోడుగా, అండగా నిలిచారు. ప్రభుత్వ సహాయ చర్యలకు తమవంతు సహాయాన్ని అందించారు. వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షిస్తూ, నీట మునిగిన కాలనీల్లో ఆహారప్యాకెట్లు పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలిచారు. నగరంలోని ఆయా కాలనీల యూత్‌ సభ్యులు అంతా ఒక్కటై రిస్క్‌ ఆపరేషన్లలో పాల్గొన్నారు. కాలనీల్లో నెలకొన్న వరద సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకొచ్చి అలర్ట్‌ చేశారు. చాంద్రాయణగుట్టలోని పలు ప్రాంతాలు నీట మునగటంతో స్థానిక యువత బాధితులకు పాలపాకెట్లు, ఆహారపాకెట్లు, వాటర్‌ బాటిళ్లను అందించారు. ఉప్పల్‌ నల్లచెరువు తెగి వాహనాలు నిలిచిపోవటంతో యువకులు రోడ్డు దాటించేందుకు సహాయపడ్డారు.

కర్మన్‌ఘాట్‌, అంబర్‌పేట 6 నంబర్‌ చౌరస్తా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవటంతో యువకులు ట్రాఫిక్‌ పోలీసుల అవతారం ఎత్తారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని పలు కాలనీల్లో రోడ్లపై విరిగిన చెట్లను తొలగించారు. ముసారంబాగ్‌ బ్రిడ్జి మునగడంతో స్థానిక యూత్‌.. వాహనదారులకు గైడ్‌ చేస్తూ కనిపించారు. మీర్‌పేట, బాలాపూర్‌లో ముంపు ప్రాంతాల కాలనీవాసులకు లోకల్‌ యువకులు నిత్యావసర సరుకులను అందించారు. అఫ్జల్‌గంజ్‌, మలక్‌పేట ప్రాంతాల్లో వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోతుంటే వాహనదారులకు యూత్‌ అండగా నిలిచి కాపాడే ప్రయత్నం చేసింది. మూసీ వరదల్లో కొట్టుకొచ్చిన మొసలి అంబర్‌పేటలో ప్రత్యక్షమవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. యువకులు ఆ మొసలిని పట్టుకుని అధికారులకు సమాచారమిచ్చారు. జూపార్క్‌కు తరలించడంలో సహాయం చేశారు. ఇలా తమవంతు సహాయాన్ని అందించి యువకులు తమ శక్తి ఏపాటితో నిరూపించారు.

కాళోజీ వర్సిటీ పరీక్షలు వాయిదా...

కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 14, 15 తేదీల్లో జరుగనున్న అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. శుక్రవారం నుంచి జరుగాల్సిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. గురువారం ఎంపీహెచ్‌ ఫస్ట్‌ ఇయర్‌, ఎమ్మెస్సీ ఐప్లెడ్‌ న్యూట్రిషన్‌ ఫస్ట్‌ ఇయర్‌, బీఎన్‌వైఎస్‌ సెకండ్‌ ఇయర్‌ పార్ట్‌-1, బీయూఎంఎస్‌ ఫస్ట్‌, థర్డ్‌ ఇయర్‌, బీహెచ్‌ఎంఎస్‌ ఫస్ట్‌, థర్డ్‌ ఇయర్‌, బీఏఎంఎస్‌ ఫస్ట్‌, థర్డ్‌ ఇయర్‌ పరీక్షలు జరుగాల్సి ఉన్నదని, అవి వాయిదా పడ్డాయని పేర్కొన్నారు.

యూజీ, పీజీ పరీక్షలు వాయిదా...

ఈ నెల 14, 15 తేదీలలో జరుగాల్సిన పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం జేఎన్‌టీయూహెచ్‌లో కొనసాగుతున్న పీజీ పరీక్షలు వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్‌ ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న యూజీ పరీక్షలను వాయిదా వేశామని ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ తెలిపారు. అయితే ఓయూ పరిధిలో ఈ నెల 19 నుంచి 23 వరకు ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్‌ నాలుగో సెమిస్టర్‌ వంటి అన్ని రకాల పీజీ పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూల్‌ విడుదల చేశారు. ఆ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని ఓయూ అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రంలో మిగిలిన యూనివర్సిటీలలో కొనసాగుతున్న యూజీ, పీజీ పరీక్షలు కూడా వాయిదా వేశామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఆ వివరాలను యూనివర్సిటీల వారీగా అధికారులు వెల్లడిస్తారన్నారు.

నేడు హైకోర్టు, దిగువ కోర్టులకు సెలవు

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఈ నెల 15న హైకోర్టుకు సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా, దిగువ కోర్టులకు కూడా సెలవు వర్తిస్తుందని రిజిస్ట్రార్‌ జనరల్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ హైకోర్టు పరిధిలో పనిచేసే ఇతర సంస్థలకు సెలవు ప్రకటించారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి కూడా రెండు రోజులు సెలవు ప్రకటించారు. ఈ నెల 14, 15 తేదీల్లో హెచ్చార్సీ కార్యాలయం పనిచేయదని సర్క్యులర్‌ జారీచేశారు.

‘అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌' ఇంటర్వ్యూలు వాయిదా

వైద్యారోగ్యశాఖలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి ఈ నెల 15, 16వ తేదీల్లో జరుగాల్సిన ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ బుధవారం ప్రకటించింది. తిరిగి ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. logo