మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 01:56:44

ఉపాధిలో దూకుడు

ఉపాధిలో దూకుడు

  • పనిదినాలలో పరుగెత్తుతున్న తెలంగాణ
  • జూన్‌ నెలాఖరుకు లక్ష్యం 7.73 కోట్ల పనిదినాలు
  • 20 రోజుల ముందే దాటిన త్రైమాసిక లక్ష్యం
  • మే15న 25 లక్షల మంది కూలీలు హాజరు
  • రెండునెలల్లో 8.06 కోట్ల పనిదినాల కల్పన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉపాధి హామీ పనుల్లో తెలంగాణ దూసుకుపోతున్నది. పనిదినాల కల్పనలో పరుగెత్తుతున్నది. ఆర్థిక ఏడాది మొదలైన రెండునెలల్లోనే గ్రామీణ ఉపాధి హామీపనుల్లో నిర్దేశించిన లక్ష్యాన్ని దాటిపోయింది. ఏప్రిల్‌, మే, జూన్‌ మూడు నెలలు (తొలి త్రైమాసికం) ముగిసేనాటికి 7.73 కోట్ల పనిదినాలు కల్పించాలనేది లక్ష్యం కాగా.. ఇరవై రోజులు మిగిలి ఉండగానే 8.06 కోట్ల పనిదినాలు కల్పించి లక్ష్యాన్ని మించిపోయింది. ఈ ఏడాది తెలంగాణకు మొత్తం 13.66 కోట్ల పనిదినాలను కేటాయించారు. కాగా, మొదటి త్రైమాసికంలోనే వార్షిక లక్ష్యంలో తెలంగాణ సగానికిపైగా పూర్తిచేసింది. 

రికార్డు స్థాయి హాజరు

ఉపాధి హామీ పనుల్లో తెలంగాణ దూసుకుపోతున్నది. పనిదినాల కల్పనలో పరుగెత్తుతున్నది.ఈ ఏడాది ఉపాధి హామీ పథకంలో కూలీల హాజరు రికార్డుస్థాయిలో 25లక్షలకు చేరింది. గత నెల 15వ తేదీన అత్యధికంగా 25.24 లక్షల మంది కూలీల హాజరు నమోదయింది. ఈనెల మొదటివారం నుంచి వర్షాలు కురవడం, వ్యవసాయపనులు మొదలవడంతో ఉపాధి పనులకు వచ్చే వారిసంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. సోమవారం 17,86,104 లక్షల మంది రిపోర్టు చేశారు. వ్యవసాయ పనులు పెరిగేకొద్ది కూలీల సంఖ్య తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు. గతేడాది 13.92 కోట్ల పనిదినాలు కల్పించాలనేది లక్ష్యం కాగా, 9.75 కోట్లు మాత్రమే జరిగాయి. గత ఐదేండ్లతో పోల్చితే అతితక్కువ పనిదినాలు 2019-20లోనే నమోదయ్యాయి. పనిదినాల కల్పనలో కామారెడ్డి అన్ని జిల్లాలకంటే ముందున్నది. వికారాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాల ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి, వరంగల్‌ అర్బన్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల తక్కువ పనిదినాలు కల్పించిన జిల్లాల జాబితాలో ఉన్నాయి.

మూడో తేదీ నుంచి తగ్గుముఖం

ఈ ఏడాది బాగా ఎండలున్న సమయంలోనూ 25 లక్షల మందికిపైగా కూలీలు ఉపాధి పనులకు వచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా చిన్న, చిన్న పనులు, ఉద్యోగాలు చేసుకొనేవారంతా ఉపాధి పనులకు వచ్చేందుకు మొగ్గుచూపారు. దీంతో ఎక్కువ టార్కెట్‌ను చేరుకోగలిగాం. లాక్‌డౌన్‌ సడలింపులు, వ్యవసాయ పనులు మొదలుకావడంతో ఈ నెల మూడోతేదీ నుంచి ఉపాధి పనులకు వచ్చే వారిసంఖ్య తగ్గుతున్నది.

- కృష్ణమూర్తి, ఎస్పీఎం, ఉపాధి హామీ పథకంlogo