సోమవారం 13 జూలై 2020
Telangana - Apr 16, 2020 , 02:33:30

ముసలవ్వ మురిపెం

ముసలవ్వ మురిపెం

  • లాక్‌డౌన్‌ వేళ నిరుపేదకు తెలంగాణ సర్కారు అండ
  • నిత్యావసరాల కోసం రూ.1,500 ఖాతాల్లో జమ
  • ఇప్పటికే 12 కిలోల చొప్పున రేషన్‌ బియ్యం పంపిణీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆపత్కా లంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలిచింది. లాక్‌డౌన్‌ విధించి చేతులుదులుపుకోకుండా.. పేదలంతా పప్పన్నం తిని ఇం ట్లోనే పైలంగా ఉండేలా చర్యలు తీసుకున్నది. రేషన్‌కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికీ 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేపట్టింది. నిత్యావసరాల కొనుగోలుకు రూ.1,500 వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు ఈ పైసలను తీసుకొని తమకు కావాల్సిన కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేసుకుంటూ నిబ్బరంగా ఉన్నారు.

సర్కారుకు పేదల దీవెనలు

లాక్‌డౌన్‌తో ఎక్కడి పనులు అక్కడే ఆగాయి. ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు. దీంతో నిరుపేద కుటుంబాల్లో ఒకిం త భయం నెలకొన్నది. కానీ ఇలాంటి పరిస్థితులను ముందే గ్రహించిన సీఎం కేసీఆర్‌ ఒక్కో పేద కుటుంబానికి రూ.1,500 చొప్పు న నగదు, ఒక్కొక్కరికీ 12 కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే బియ్యం పంపిణీచేశారు. నిత్యావసర సరుకుల కోసం ఇస్తామన్న రూ.1,500లకు సంబంధించిన నిధులను విడుదలచేశారు. రేషన్‌కార్డుదారుల ఆధార్‌ నంబర్‌ ఆధారంగా వారి బ్యాంకుఖాతాల్లో ఆ మొత్తాన్ని జమచేస్తున్నారు. సోమవారం నుంచే ఈ ప్రక్రియ మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల్లో సాంకేతిక సమస్యలు, సెలవుల కారణంగా కొన్నిచోట్ల లబ్ధిదారులు నగదు తీసుకోవడం లో ఆలస్యమైంది. దీంతో బుధవారం నుంచి బ్యాంకుల నుంచి నగదును డ్రా చేసుకున్నారు. ఈ కష్టకాలంలో పైసలిచ్చి ఆదుకుంటున్న సర్కారును పేదలు దీవిస్తున్నారు. 

పప్పు, ఉప్పులకే సొమ్ము..

పేదలకు రూ.1,500 చొప్పున బ్యాంకు ల్లో జమ కావడం, వాటిని డ్రా చేసుకున్న లబ్ధిదారులు నిత్యావసరాలను కొంటున్నారు. రోజువారీ కూలీలు, తినడానికి ఇబ్బంది పడేవారికి బియ్యంతోపాటు సర్కారు నగదు ఇవ్వడంతో పప్పు, ఉప్పు, నూనె వంటివి కొనుగోలుచేసి ఇండ్లకు తీసుకెళ్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చేతిలో చిల్లిగవ్వ లేక తిప్పలు పడుతున్న లక్షల మందికి సర్కారు సొమ్ముతో మేలు జరిగింది. దాదాపు 74 లక్షల మందికి సర్కారు సొమ్ము అందింది.

కేసీఆర్‌ సార్‌ది పెద్ద మనసు

కేసీఆర్‌ సారుది పెద్ద మనసు. మా అసొంటి పేదోళ్లంటే ప్రేమ. కష్టమొచ్చినప్పుడల్ల ఆదుకుంటుండు. నా కొడుకు కాయకష్టం చేసుకొని బతుకుతుండె. శానా దినాల నుంచి ఇంటికాడే ఉంటుండు. చేతుల పైసల్లేక నొప్పుల గోలీలు కొనెతందుకు కూడా కష్టమాయె. గీరోజు బ్యాంక్‌ ఖాతాల సర్కారు 1500 ఏసినంక ధైర్యమొచ్చింది. ఈ పైసలతోటి మందులు గొనుక్కుంట. ఇంట్ల సామాన్లు కూడా నిండుకుండె. ఆపద్కాలంల కేసీఆర్‌ సార్‌ ఇచ్చిన పైసలు శానా ఆసరయినయ్‌.

- రమావత్‌ జిజ, జోగ్యతండా, కొండమల్లేపల్లి మండలం, నల్లగొండ జిల్లా 

సీఎం కేసీఆర్‌ సారు సల్లంగుండాలె

నేను ఇంటి పట్టునే ఉం టాను. ప్రభుత్వం ఆసరా పిం ఛన్‌ ఇస్తున్నది. ఎదో మాయదారి రోగమొచ్చిందని ఇంట్ల నుంచి బయటకు వస్తలేం. నా కొడుకు డ్రైవర్‌ పనికి పోదామన్నా పోనిస్తలేరు. బయటకు పోతే రోగమొస్తదని ఆఫీసర్లు, డాక్టర్లు చెప్తున్నరు. ఎట్ట బతకాలే. సీఎం కేసీఆర్‌ ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం ఇచ్చిండు. ఇంటి ఖర్చులకు పదిహేను వందలు బ్యాంకుల ఏసిండు. సీఎం కేసీఆర్‌ సారు సల్లంగుండాలె. సీఎం సారు చెప్పినన్ని దినాలు బయటకు పోం. సీఎం సారు సాయం మరువం.

- నారాయణమ్మ, అయిజ, జోగుళాంబగద్వాల

ఇల్లు ఎట్ల గడువాలనే రంది ఉండె

నాకు ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు. నా చిన్న బిడ్డ సరస్వతి నిండు గర్భిణి. ఏ సమయంలో పురుడు పోసుకుంటుందో తెలువదు. కరోనాకు ముందు నా భర్తతో కలిసి ఆంధ్రాలో మిరమ తోటల్లో పనిచేస్తే వచ్చిన పైసలతోటి ఇప్పటిదాకా ఇల్లు గడిచింది. కరోనాతోటి అందరం ఇంటికాన్నే ఉంటున్నం. చేతిల పైసలేదు. గ్రామంలో దాతలు ఇస్తున్న కూరగాయలు, కేసీఆర్‌ సార్‌ ఇస్తున్న రేషన్‌ బియ్యంతో సర్దుకొని ఎల్లదీస్తున్నం.రేషన్‌కార్డు ఉన్నోళ్లకు ప్రభుత్వం రూ.1,500 బ్యాంకుల ఏసింది. నా బిడ్డ పురుడుకు వాడుకుంట. ఆపద్కాలంలో కేసీఆర్‌ సారు ఆదుకున్న దేవుడు. రంది లేకుంట చేసిండు.

-బచ్చలకూర వెంకటమ్మ, అనంతారం, పెన్‌పహాడ్‌ మండలం, సూర్యాపేట జిల్లా 


logo