గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Feb 22, 2020 , 01:32:06

కంపా నిధుల వినియోగంలో అగ్రస్థానం

కంపా నిధుల వినియోగంలో అగ్రస్థానం
  • కంపా కింద ఈసారి రూ.600 కోట్లకు అనుమతివ్వండి
  • కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన తెలంగాణ అటవీశాఖ
  • సరాసరి 98.82 శాతం ఖర్చుతో రెండేండ్లుగా ముందు వరుసలో తెలంగాణ

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ (కంపా) నిధుల వినియోగంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2014-19 మధ్య రాష్ర్టానికి అందిన రూ.645 కోట్లలో సరాసరి 99.82 శాతం ఖర్చుచేసి రెండేండ్లుగా అగ్రపథాన నిలుస్తూ వస్తున్నది. గత ఏడాదిలో రూ.501 కోట్లను వివిధ కార్యక్రమాల కింద వాడుకోవడానికి కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతించిన నేపథ్యంలో ఈ ఏడాదికి రూ.600 కోట్ల కంపా నిధులు వినియోగించుకొనేందుకు అనుమతివ్వాలంటూ రాష్ట్ర అటవీశాఖ కేంద్రానికి ఇప్పటికే నివేదిక ఇచ్చింది. 


2019-20లో కేంద్రం అనుమతించిన రూ.501 కోట్లను ఏయే కార్యక్రమాల కింద ఎంత ఖర్చు చేశారో వివరించింది. కంపా నిధులను సద్వినియోగం చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రభాగంలో ఉన్నట్టు కేంద్రం నియమించిన థర్డ్‌ పార్టీ సర్వేలో తేలింది. ప్రత్యామ్నాయ అడవుల సృష్టి, జీవవైవిధ్యం కాపాడటం, అడవుల పునర్జీవం బాగుందని ఈ సర్వే తెలంగాణకు కితాబిచ్చింది. దేశంలోని అత్యధిక రాష్ర్టాలు కంపా నిధులను 70 శాతంలోపు మాత్రమే ఖర్చు చేస్తుండగా.. తెలంగాణ మొదటి నుంచి 90 నుంచి 100 శాతం నిధులను వినియోగించుకొంటున్నదని తేలింది. 


కొత్త చట్టంతో ప్రత్యేక అకౌంట్‌కు జమ

ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలు, ఇతర అవసరాలకు అటవీ భూములను సేకరిస్తే కంపా కింద భారీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎలాంటి మినహాయింపు లేదు. క్షీణించిన అడవుల్లో హెక్టార్‌కు రూ.6లక్షలు, రిజర్వ్‌ ఫారెస్ట్‌కు రూ.8లక్షలు, దట్టమైన అడవుల్లో హెక్టారుకు రూ.10 లక్షల చొప్పున నెట్‌ ప్రాఫిట్‌ వ్యాల్యూ కింద చెల్లించాల్సి ఉంటుంది. చెట్లకు కూడా ఖరీదు కడుతారు. 


ఇలా వసూలైన మొత్తాన్ని ఢిల్లీలోని కంపా అడ్‌హాక్‌ అకౌంట్‌ కింద ఆయా రాష్ర్టాల ఖాతాల్లో జమచేస్తారు. ఈ మొత్తంలో 10 శాతం మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అటవీ అభివృద్ధి కోసం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. గత ఏడాది మార్పుచేసిన కంపా చట్టం ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాల్లో 90 శాతం నిధులను సంబంధిత రాష్ర్టాల ఖజానాకు తరలించి ప్రత్యేక అకౌంట్‌ కింద జమచేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ అకౌంట్‌ కింద జమైన రూ.3,110 కోట్ల డిపాజిట్‌ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం బదలాయించిన విషయం తెలిసిందే. ఆయా రాష్ర్టాలు సమర్పించే అభివృద్ధి పనుల కార్యచరణ నివేదికను కేంద్రం అనుమతించిన తర్వాతనే ఈ నిధులను వినియోగించుకొనే వెసులుబాటు రాష్ర్టాలకు ఉంటుంది.


రికార్డుస్థాయిలో వినియోగం 

ఉమ్మడి రాష్ట్రం హయాంలో కేంద్రం నుంచి అతి తక్కువ మొత్తంలో కంపా నిధులు అందా యి. 2013-14లో తెలంగాణకు రూ.49 కోట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణలో ప్రాజెక్టులు ఊపందుకోవడంతో కంపా నిధుల జమ, అదే స్థాయిలో వినియోగమూ పెరిగింది. 2014-19 వరకు ఐదేండ్ల కాలంలో రూ.645 కోట్ల నిధులకు అనుమతి లభించగా.. ఈ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించడంతో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. నిధుల్లో సరాసరి 99.82 శాతం ఖర్చుచేసి రెండేండ్లుగా ముందు వరుసలో నిలుస్తున్నది. ఫలితంగా గత ఏడాది రాష్ర్టానికి భారీ మొత్తంలో నిధులు అందాయి. ఈసారి కూడా రూ.600 కోట్ల మేర నిధులు వాడుకొనేందుకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతి ఇస్తుందనే పూర్తి విశ్వాసంతో ఉన్నందున.. 2021-22 బడ్జెట్‌లో కంపా నిధులను రూ.600 కోట్లుగా చూపనున్నట్టు తెలుస్తున్నది.


logo
>>>>>>