శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 27, 2020 , 03:04:18

సిద్ధమవుతున్న డయాగ్నస్టిక్‌ హబ్‌లు

సిద్ధమవుతున్న డయాగ్నస్టిక్‌ హబ్‌లు
  • ఇరవై జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి
  • మార్చినుంచి అందుబాటులోకి
  • ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:విద్య, వైద్యం ప్రజలందరికీ అందుబాటులో ఉంటేనే రాష్ట్రం సౌభాగ్యవంతమవుతుందన్న దూరదృష్టితో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా పేద ప్రజలకు కార్పొరేట్‌ వైద్యాన్ని ప్రభుత్వ దవాఖానల్లో అందించేందుకు వీలుగా అన్ని జిల్లాల్లోనూ దవాఖానలను అప్‌గ్రేడ్‌చేయడమే కాకుండా వ్యాధినిర్ధారణ పరీక్షలు సైతం నిర్వహించేందుకు సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు. రాజధాని హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి డయాగ్నస్టిక్‌ హబ్‌ను ప్రారంభించిన ప్రభుత్వం.. జిల్లాలకు సైతం ఈ సేవలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రస్తుతానికి 20 చోట్ల డయాగ్నస్టిక్‌ హబ్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా దవాఖానలు, జిల్లాస్థాయి హాస్పిటళ్లలో వీటిని ఏర్పాటుచేసేందుకు వైద్యశాఖాధికారులు సన్నాహాలుచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమకు దగ్గర్లో ఉన్న దవాఖానలో వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయించుకొంటే.


 వాటి శాంపిళ్లను సంబంధిత డయాగ్నస్టిక్‌ హబ్‌కు పంపించి సత్వరమే ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకొంటున్నారు. దీంతో పల్లె ప్రజలు పట్టణాలకు వచ్చే శ్రమ తగ్గిపోతుంది. ఈ డయాగ్నస్టిక్‌హబ్‌లలో మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ వంటి  సీజనల్‌ వ్యాధులతోపాటు వీడీఆర్‌ఎల్‌, హెమటాలజీ, బ్లడ్‌గ్రూపింగ్‌, ప్లేట్‌లెట్స్‌, హార్మోన్‌ స్టడీస్‌, మేజర్‌, మైనర్‌ సర్జికల్‌ ప్రొఫైల్‌, హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఐజీ, హెచ్‌సీవీ, విటమిన్‌ బీ 12, డీ విటమిన్‌, షుగర్‌, కిడ్నీ, లివర్‌ సంబంధిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు,  థైరాయిడ్‌, ఫీవర్‌, టీబీ, క్యాల్షియం వంటి అనేక పరీక్షలను నిర్వహిస్తారు.


రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ

ప్రస్తుతానికి 20చోట్ల డయాగ్నస్టిక్‌ హబ్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, ఏరియా, జిల్లాస్థాయి దవాఖానలను అనుసంధానిస్తూ వీటిని నిర్వహిస్తారు. ఇందుకోసం కరీంనగర్‌, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, జోగుళాంబ గద్వాల, వికారాబాద్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, ములుగు, మహబూబాబాద్‌, ఖమ్మం, కొత్తగూడెం, జగిత్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్స్‌ హబ్‌లను దశలవారీగా అందుబాటులోకి తెచ్చేందుకు వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.


తెలంగాణ విధానాలపై కేంద్రం అధ్యయనం

తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలను కేంద్ర ప్రభుత్వం అధ్యయనంచేస్తున్నది. తెలంగాణ సలహాలు, సూచనలతో మెరుగైన పద్ధతులను కేంద్రం అనుసరించబోతున్నది. ప్రధానంగా బోధన వైద్యశాలల్లో అడ్వాన్స్‌డ్‌ డయాగ్నస్టిక్స్‌ కేంద్రాల ఏర్పాటు, వాటి పనితీరుపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నది. పలు రాష్ర్టాలు కూడా తెలంగాణను అనుసరించడానికి ఆసక్తిచూపుతున్నాయి.



logo