సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 03:38:21

ప్రజాగాయకుడు నిస్సార్‌ మృతి

ప్రజాగాయకుడు నిస్సార్‌ మృతి

  • కరోనాను ధిక్కరించి అదే వైరస్‌కు బలైన గళం
  • స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక ధూంధాంల నిర్వహణ
  • మంత్రి హరీశ్‌తోపాటు పలువురు ప్రజాసంఘాల నేతల సంతాపం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/గుండాల : కలంతో, గళంతో కరోనాను ధిక్కరించారు.. మహమ్మారిని నమ్మొద్దంటూ జనాన్ని చైతన్యపరిచారు.. ముదనష్టపు కాలమిది అంటూ జాగ్రత్తలు చెప్పారు.. కానీ, చివరికి ఆ వైరస్‌ బారిన పడి ప్రముఖ కవి, గాయకుడు, ప్రజా నాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిస్సార్‌ మహమ్మద్‌ (56) మృతిచెందారు. తెలంగాణ గుండెచప్పుళ్లను తన పాటలతో నలుదిశలా చాటిన ఆయన సికింద్రాబాద్‌ గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. కరోనా నుంచి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సామాజిక దూరం, మాస్కులు ధరించే విషయాలపై ఇటీవల పాటలురాసి కళాప్రదర్శనలు ఇచ్చారు.

నిస్సార్‌ స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల. తొలుత లారీ డ్రైవర్‌గా పనిచేసిన ఆయన.. ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం మియాపూర్‌ ఆర్టీసీ డిపోలో కంట్రోలర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ధూంధాంలు నిర్వహించారు. 20 రోజుల క్రితం తన స్వగ్రామం సుద్దాలపై, గీత కార్మికుల కష్టాలపై షార్ట్‌ ఫిల్మ్‌ కూడా తీశారు. నిస్సార్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఆయన మృతి సాంస్కృతికరంగానికి, తెలంగాణ సమాజానికి తీరనిలోటని పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, కళాకారులు పేర్కొన్నారు. నిస్సార్‌ తెలంగాణ జానపద సాంస్కృతిక రూపాలను తలపోసిన వాగ్గేయకారుడని సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ అన్నారు. నిస్సార్‌ కుటుంబీకులకు సానుభూతి తెలియజేశారు.

తెలంగాణ ఉద్యమ జ్వాల.. నిస్సార్‌

తెలంగాణ పాటను నలుదిశలాచాటిన కళాకారుడు నిస్సార్‌. తన పాటల ప్రయాణాన్ని అర్ధాంతరంగా ఆపేసిండు. నల్లగొండ జిల్లా ఉద్యమ చైతన్యాన్ని అవగాహన చేసుకొన్నవాడు. పేద ముస్లిం కుటుంబంలో పుట్టిన నిస్సార్‌.. అనేక ఉద్యమాలకు పాటల ప్రాణవాయువునిచ్చాడు. పండు వెన్నెల్లోన పాడేటి పాటలేమాయే.. అనే గేయం తెలంగాణ ధూంధాం సభల్లో పెద్ద ఆకర్షణ. తెలంగాణ ఉద్యమ జ్వాలా గీతమైనవాడు. నిస్సార్‌కు కన్నీటి నివాళి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.

-ట్విట్టర్‌లో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు


logo