మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 01:22:55

గొర్రెలతో సంపద..6 వేల కోట్లు

గొర్రెలతో సంపద..6 వేల కోట్లు

  • మాంసం ఉత్పత్తి, గొర్రెల సంపదలో దేశంలోనే ఫస్ట్‌
  • ఫలితమిచ్చిన ప్రభుత్వ గొర్రెల పంపిణీ కార్యక్రమం
  • రాష్ట్రంలో  లక్షల కుటుంబాలకు ఉపాధి

తెలంగాణ సరికొత్త ఘనతను సాధిస్తున్నది. గొర్రెల పంపిణీతో రూ. రూ.6,169 కోట్ల సంపదను సృష్టిస్తున్నది. మాంసం ఉత్పత్తి, గొల్ల కురుమల ఆర్థిక బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం 2017 జూన్‌లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుత ఫలాలను అందిస్తున్నది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది. మాంసం ఉత్పత్తి, గొర్రెల సంఖ్య పెరుగుదలలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచింది. గొర్రెల దిగుమతిని సగానికి పైగా తగ్గించింది. తాజాగా మరో 28,335 మందికి రూ.360 కోట్ల ఖర్చుతో 5.95 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్‌, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పింక్‌ విప్లవం (మాంస ఉత్పత్తుల పెరుగుదల) కొనసాగుతున్నది. 2012లో రాష్ట్రంలో 1.10 కోట్ల గొర్రెలు ఉన్నాయని జాతీయ పశుగణన లెక్కల్లో వెల్లడైంది. 2019లో రాష్ట్రంలో గొర్రెల సంఖ్య 1.91 కోట్లకు పెరిగినట్టు తేలింది. ప్రస్తుత లెక్కలను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో గొర్రెల సంపద 2 కోట్లు దాటింది. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల ద్వారా రాష్ట్రంలో 1.37 కోట్ల గొర్రె పిల్లలు పుట్టాయి. 48.51 శాతం గొర్రెల సంఖ్య పెరుగుదలతో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఏపీలో 30 శాతం, కర్ణాటకలో 15.31 శాతం పెరుగుదల నమోదైంది. 

మాంసం ఉత్పత్తిలోనూ మేటి

ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. జాతీయ పశుగణన లెక్కల ప్రకారం.. మాంసం ఉత్పత్తి వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. దేశ సగటు వృద్ధిరేటు 6 శాతంగా ఉంటే.. తెలంగాణ వృద్ధిరేటు 16.9 శాతంగా నమోదైంది. ఐదేండ్లలోనే 2.49 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి పెరిగింది. గొర్రె మాంసం విషయానికొస్తే 2017-18లో 1.58 లక్షల టన్నుల గొర్రె మాంసం ఉత్పత్తి కాగా 2018-19లో 2.36 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి అయింది. ఏడాదిలోనే 78 వేల టన్నుల గొర్రె మాంసం ఉత్పత్తి పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 90 శాతం మంది మాంసాహారులే. దేశంలో ప్రతి వ్యక్తి ఏడాదికి సగటున 4 కేజీల మాంసం తింటే.. తెలంగాణలో ఒక వ్యక్తి సగటున 9 కేజీల మాంసం తింటున్నారు. దీంతో తెలంగాణలో మాంసానికి భారీగా డిమాండ్‌ ఉన్నది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు నుంచి ప్రతి వారం 400-500 లారీల గొర్రెలు రాష్ర్టానికి వచ్చేవి. ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం చేపట్టిన తర్వాత దిగుమతి సగానికి సగం తగ్గిపోయింది. ఇప్పుడు 100-200 లారీల గొర్రెలే వస్తున్నాయి. 

ఆత్మగౌరవంతో బతుకుతున్నాం

వ్యవసాయం కుంటుపడి.. పనిలేక కూలీ చేసుకొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఎం కేసీఆర్‌ సార్‌ గొర్లు ఇవ్వడంతో ఉపాధి దొరికింది. ఇప్పుడు గొర్లమందతో ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. గొల్లకుర్మలకు మంచి చేసేందుకు పెద్ద సార్‌ మంచి ఆలోచన చేసిండు. మా అందరికీ బతుకుబాట చూపిండు. 

- నూనె ఓజయ్యయాదవ్‌, దుద్దెడ, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా

ఉపాధి కల్పించిండు

సీఎం కేసీఆర్‌ సార్‌ ఇచ్చిన గొర్లతో బతుకు భరోసా దొరికింది. పని కోసం వెతుకులాడే పరిస్థితి పోయి మాకు మేముగా బతికే ఆసరా లభించింది. యాదవుల కులవృత్తిని గౌరవిస్తూ సీఎం కేసీఆర్‌ గొర్లు ఇచ్చి ఆదుకున్నారు. ఒకప్పుడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉండేవి. కానీ ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలతో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. 

-బట్ట యాదగిరి, బందారం గ్రామం, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా

తెలంగాణలో మాసం ఉత్పత్తి (లక్షల టన్నుల్లో)

2014-15 
5.05 
2015-16 
5.42
2016-17 
5.91
2017-18 
6.45
2018-19
7.54

గొర్రెల పంపిణీ పథకం విశేషాలు logo