గురువారం 09 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 19:50:00

స్వచ్ఛ గ్రామాల దిశగా అడుగులు వేద్దాం..ఆదర్శంగా నిలుద్దాం!

స్వచ్ఛ గ్రామాల దిశగా అడుగులు వేద్దాం..ఆదర్శంగా నిలుద్దాం!

సిద్ధిపేట: గ్రామాలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉన్నప్పుడే స్వచ్ఛ గ్రామాలుగా మారుతాయని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.  జిల్లాలో ప్రతీ గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛ గ్రామాలుగా తయారు చేసుకున్నామని చెప్పారు. మరింత స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలంటే.. ప్రతీ గ్రామంలో డంప్ యార్డులు, గ్రేవ్ యార్డులు నిర్మాణాలు పూర్తి చేసి ఆదర్శ గ్రామాలుగా చేసుకుందామని ప్రజాప్రతినిధులకు  మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. 

సిద్ధిపేట సుడా కార్యాలయంలో  ఆదివారం సిద్ధిపేట అర్బన్, సిద్ధిపేట రూరల్, నారాయణరావు పేట మండలాల ఏంపీపీలు, జెడ్పీటీసీలు, గ్రామాల సర్పంచ్ లు, ఏంపీటీసీలు, ఏంపీడీఓ, తహశీల్దార్, పంచాయతీ రాజ్ శాఖ, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

జూలై నెలాఖారులోపు మండలాల్లోని ప్రతీ గ్రామంలో డంప్ యార్డు, గ్రేవ్ యార్డు, రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులను, అధికారులను ఆదేశించారు.   ప్రతి రోజూ గ్రామ సర్పంచ్, ఏంపీటీసీలు గ్రామంలో డంప్, గ్రేవ్ యార్డు జరిగే నిర్మాణ పనులు పర్యవేక్షణ తప్పనిసరిగా చేయాలని, కాంట్రాక్టర్లు పనులు సవ్యంగా జరపకపోతే.. అధికారులు, స్థానిక మండల ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలన్నారు. అవసరమైతే కాంట్రాక్టర్లను మార్చాలని సూచించారు. 

జూలై నెల 15వ తేదీలోపు నారాయణరావుపేట మండలంలోని 10 గ్రామాలలో డంప్ యార్డుల నిర్మాణం పూర్తి చేసి వర్మీ కంపోస్టు తయారు చేయించేలా వినియోగంలోకి తేవాలని సూచించారు.  విద్యుత్, రెవెన్యూ భూ సమస్యలు ఏవైనా ఉంటే.. సంబంధిత శాఖ అధికారులను సంప్రదించి పరిష్కారం దిశగా కృషి చేయాలని ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు.

గ్రామాల వారీగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, ఇతర అభివృద్ధి పనుల పురోగతి పై సమీక్షించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామ ప్రగతి, అభివృద్ధి నిర్మాణాలు, పనుల పురోగతి, అన్నీ గ్రామాలకు తాగునీటి సరఫరా, హరిత హారం, ఉపాధి హామీలో పశువులకు షెడ్ల నిర్మాణం, గ్రామాల్లో కల్లాల నిర్మాణాలు, వానా కాలం పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు గ్రామానికి వచ్చాయా లేదా తదితర అంశాలతో పాటు గ్రామ అభివృద్ధి పనుల పురోగతి, ప్రగతి అంశాలపై  మంత్రి సమీక్షించారు. 

 హరిత హారంలో భాగంగా ప్రతీ గ్రామంలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసే దిశగా ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. ఈ సంవత్సరం గ్రామ యాక్షన్ ప్లాన్ ఏమిటీ, గ్రామంలో ఎన్ని మొక్కలు ప్లాంటేషన్ చేయాలని, ఎన్ని నాటాలని నిర్ణయించారని, ఇందు కోసం ఇప్పటి దాకా ఎన్ని గుంతలు తీశారని గ్రామం వారీగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులను మంత్రి ఆరా తీశారు.  హరిత హారంలో భాగంగా ఈ సారి ప్రతీ గ్రామంలో కాలువ గట్ల వద్ద భారీగా చెట్లు నాటాలని ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి ఆదేశించారు. 


logo