శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 01:32:12

పంజాబ్‌ మండీల్లోకి పొరుగు ధాన్యం

పంజాబ్‌ మండీల్లోకి పొరుగు ధాన్యం

  • కేసీఆర్‌ చెప్పిందే జరుగుతున్నది
  • కేంద్ర చట్టంతో దగా పడుతున్న రైతన్న
  • దండెత్తుతున్న దళారులు..అన్నదాతల విలవిల
  • కొత్త వ్యవసాయ చట్టాలతో  కానరాని మద్దతు ధర 
  • ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లోనూ కర్షకులకు అరిగోసే
  • ముందే హెచ్చరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • తెలంగాణ రైతు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం

కొత్త వ్యవసాయ చట్టాలు తేనె పూసిన కత్తిలాంటివి. వీటితో దేశవ్యాప్తంగా దళారులు విస్తరిస్తారు. అంతటా బ్లాక్‌మార్కెట్‌ పెరిగిపోతుంది. ఇవి రైతులకు ఉపయోగపడే చట్టాలు కావు. వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరుకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడేవి. కార్పొరేట్‌ గద్దలు దేశమంతటా విస్తరించేందుకు, ప్రైవేటు వ్యాపారులకు దారులు బార్లా తెరవడానికి అవకాశం కల్పిస్తాయి. వీటివల్ల రైతులకు మద్దతు ధర రాకపోగా, పెట్టిన పెట్టుబడి కూడా దక్కదు.. ఇవీ.. వ్యవసాయ చట్టాలను కేంద్రం తీసుకొచ్చినపుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలు. 

ఇప్పుడామాటలే నిజమవుతున్నాయి. కొత్త చట్టాలతో దేశంలో దళారులు దండెత్తుతారని, బ్లాక్‌ మార్కెట్‌ విస్తరిస్తుందని చేసిన హెచ్చరికలు నిరూపితమవుతున్నాయి. దేశమంతటా రైతులు మద్దతు ధరను కోల్పోతున్న దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. పంజాబ్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ర్టాల్లో అన్నదాతల వెతలే ఇందుకు నిదర్శనం.

‘ఉపేందర్‌ కుమార్‌ శర్మ.. బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన రైతు. తనకున్న ఎకరా పొలంలో నాణ్యమైన ధాన్యాన్ని పండించాడు. కేంద్రం చెప్పినట్టు మద్దతు ధర రూ.1,868 వస్తుందని ఆశపడ్డాడు. స్థానిక వ్యాపారి వద్దకు తీసుకెళ్లగా రూ.1,100 మాత్రమే ఇస్తానని చెప్పడంతో ఉపేందర్‌ నోట మాట పెగల్లేదు. కష్టపడి పంటను వేరే రాష్ర్టానికి తీసుకెళ్లి అమ్ముకొనే స్థోమత లేక ఎంత వస్తే అంతే తీసుకొని నిరాశతో వెనుదిరిగాడు’. బీహార్‌లోనే కాదు.. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లోనూ రైతులకు ఇదే దుస్థితి ఎదురవుతున్నది. చట్టాలు తీసుకొస్తున్నప్పుడు రైతులకు మద్దతు ధర దక్కుతుందని, అంతకంటే ఎక్కువకు అమ్ముకొనే వీలు కలుగుతుందని కేంద్రం చెప్పుకొచ్చింది. వాస్తవంలో మాత్రం పెట్టిన పెట్టుబడి కూడా దక్కక, దిక్కుతోచని స్థితిలో రైతన్న బిక్కముఖం వేస్తున్నాడు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ర్టాల్లోని రైతులు పండించిన పంటకు మద్దతు ధర దక్కక, వేరే చోటుకు వెళ్లి అమ్ముకొనే స్థోమత లేక నిట్టూరుస్తున్నారు. ఉదాహరణకు బీహార్‌ను తీసుకొంటే.. ఆ రాష్ట్రంలో రైతు పండించిన పంటను సేకరించే వ్యవస్థ సరిగా లేదు. దీంతో స్థానిక వ్యాపారులు, దళారులకు తక్కువ రేటుకే తమ పంటను అమ్ముకొంటున్నారు. వ్యాపారులు తమ లాభం, మధ్యవర్తుల లాభం, రవాణా ఖర్చులు పోగా, మిగిలింది రైతుకు చెల్లిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతంలోనూ ఇదే దుస్థితి. ఇక్కడ తక్కువ రేటుకు కొన్న పంటను.. దళారులు పంజాబ్‌కు తరలించి సొమ్ము చేసుకొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండకపోవటంతో విచ్చలవిడిగా రైతులను దోచుకుంటున్నారు.

ఈ కథ ఇక్కడితో అయిపోలేదు..

వేరే రాష్ర్టాల నుంచి తక్కువ రేటుకే పంట దిగుమతి అవుతుండటంతో పంజాబ్‌ రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. వాస్తవానికి పంజాబ్‌లో మార్కెటింగ్‌ వ్యవస్థ పటిష్ఠంగా ఉంటుంది. ఇక్కడ పంట సేకరణ, రైతులకు మద్దతు ధర చెల్లింపు పారదర్శకం గా సాగుతుంది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతున్నది. ఇతర రాష్ర్టాల నుంచి తక్కువ ధరకే పం ట వస్తుండటంతో వ్యాపారులు, దళారులు ఆ రాష్ట్రంలోని రైతుల వంకే చూడట్లేదు. బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో తక్కువ రేటుకే పంట దొరుకుతుంటే పంజాబ్‌ వ్యాపారులు తమ రాష్ట్రంలోని రైతులకు మద్దతు ధర ఇచ్చి ఎందుకు కొంటారు? దాంతో ఆ పంట అమ్ముడుపోదు. ఫలితంగా తక్కువ రేటుకైనా సరేనని పంజాబ్‌ రైతులు ధాన్యాన్ని అమ్ముకొంటున్నారు.


పంజాబ్‌ రైతుల పరిస్థితి దారుణం..

కొత్త చట్టాలతో కనీస మద్దతు ధర దక్కదన్నదే రైతుల ప్రధాన ఆందోళన. పంజాబ్‌ వ్యవసాయ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 12 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) కోటాలో పంజాబ్‌ వాటా 30 శాతం. రాష్ట్రంలో మొత్తం 170 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తిని అంచనా వేయ గా, అక్కడ ఇప్పటికే 153 లక్షల టన్నులు సేకరించారు. ఇందులోనూ ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకొన్నదే అధి కం. కోటా నిండితే ఆ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పంటను కొనదు. అప్పుడు పంజాబ్‌ రైతులు ఎక్కడికి వెళ్లి తమ పంటను అమ్ముకోవాలి? ఈ భయం అక్కడి రైతులను వెంటాడుతున్నది.

తెలంగాణకూ పొంచి ఉన్న ప్రమాదం?

దేశంలో రైతు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్న కొన్ని రాష్ర్టాల్లో తెలంగాణ తొలిస్థానంలో ఉన్నది. ఇక్కడ పటిష్ఠమైన మార్కెటింగ్‌ వ్యవస్థ ఉన్నది. రైతుకు మద్దతు ధర ఇచ్చి మరీ పంటను ప్రభుత్వమే కొంటున్నది. అయితే, కొత్త వ్యవసాయ చట్టం వల్ల చెక్‌ పాయింట్లు లేకపోవటంతో ఇతర రాష్ర్టాల రైతులు తమ పంట ను ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారు. రాష్ట్ర ప్రభుత్వం కొనే వా టా పూర్తయితే ఇక్కడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నది. కోటా నిండితే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనలేక చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు రాష్ట్ర రైతులు తక్కువ రేటుకైనా వ్యాపారులకు అమ్ముకొనే దుస్థితి వస్తుంది.  

ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం

మెట్‌పల్లి: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని పాత బస్టాండ్‌ వద్ద ఆదివారం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టం రైతులకు వ్యతిరేకంగా ఉన్నదని, కార్పొరేట్‌కు మేలు చేసేలా రూపొందించారని ఆరోపించారు. వెంటనే ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

వ్యవసాయ చట్టం చెప్తున్నదిదీ (వ్యాపార, వాణిజ్య చట్టం)..

రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్ముకోవచ్చు. ఇందుకు రైతుల నుంచి ఎలాంటి పన్ను వసూలు చేయరు. మార్కెట్లలో రిజిస్టర్‌ చేసుకున్న వ్యాపారులే కాకుండా పాన్‌కార్డు ఉన్న వారెవరైనా కొనవచ్చు.

కేంద్రం చెప్పిందిదీ..

రైతులకు మద్దతు ధర దక్కుతుంది. మద్దతు ధర కంటే ఎక్కువగా ఎక్కడ వస్తే అక్కడికే వెళ్లి అమ్ముకోవచ్చు. దేశంలో ఏ మూలకైనా వెళ్లి అమ్ముకొనే వెసులుబాటు దక్కుతుంది.

జరుగుతున్నది ఇదీ..

దళారులు దండెత్తుతున్నారు. బ్లాక్‌మార్కెట్‌ విస్తరిస్తున్నది. అందుకు ఉదాహరణే.. పంజాబ్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌. ఈ రాష్ర్టాల్లో రైతులకు మద్దతు ధర అటుం చి..కనీసం పెట్టుబడి కూడా చేతికొస్తలేదు. దళారులు, వ్యాపారుల దోపిడీతో తక్కువ ధరకే పంటను ముట్టజెప్పుతున్నారు.

18 రాష్ర్టాలకు పాకిన రైతు నిరసనలు

అన్నదాతల జీవితాలను కార్పొరేట్‌ చేతుల్లో పెట్టేలా ఉన్న కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్షకులు ఏకమవుతున్నారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ గురువారం దేశంలోని 18 రాష్ర్టాల్లో రైతులు రోడ్ల మీదకు వచ్చి నిరసన చేపట్టారు. వ్యవసాయ చట్టాలకు తోడుగా విద్యుత్‌ బిల్లు తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది రైతులు 2,500లకుపైగా ప్రాంతాల్లో ఆందోళనకు దిగినట్టు ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) తెలిపింది. ఇది ఆరంభమేనని ఈ నెల 26 లేదా 27న దేశ రాజధాని ఢిల్లీని ముట్టడిస్తామని పేర్కొన్నది. రైతు సంఘటితమైతే ఆ దెబ్బ ఎలా ఉంటుందో కేంద్రానికి రుచి చూపిస్తామని వెల్లడించింది. ఢిల్లీ ముట్టడి సందర్భంగా రైతులను అడ్డుకుంటే ఎక్కడికక్కడ బైఠాయిస్తామని హెచ్చరించింది. 

రైతుకు ఎందుకీ సమస్యలు..

ముందుచూపు లేని కేంద్రం వైఖరే ఈ పరిస్థితికి కారణం. అన్ని రాష్ర్టాల్లో సరైన మార్కెటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయకుండానే కొత్త చట్టాలు తీసుకురావడం దళారులకు కలిసివస్తున్నది. దేశవ్యాప్తంగా మొత్తం 42వేల మార్కెట్లు అవసర ముండగా, ప్రస్తుతం 7వేల మార్కెట్లున్నాయి. దీంతో ఎక్కడ తమ పంటను అమ్ముకోవాలో తెలియక మధ్యవర్తులకు తక్కువ రేటుకే అమ్ముకొని రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు.

ఉత్తరాది రైతుకు మోసం జరుగుతున్నదిలా..

వరికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధర (క్వింటాలుకు) :రూ.1,868

అందులో వ్యాపారుల లాభం (క్వింటాలుకు) :రూ.200- రూ.300

రవాణా ఖర్చు (క్వింటాలుకు) :రూ.150- రూ.200

పంజాబ్‌లో ఉన్న మధ్యవర్తులకు కమీషన్‌ :రూ.200- రూ.300

రైతు చేతికి వస్తున్న మొత్తం(క్వింటాలుకు) :రూ.1,000- రూ.1,100