మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:49:28

ఉస్మానియాకు దుష్టశక్తులే అడ్డు

ఉస్మానియాకు దుష్టశక్తులే అడ్డు

  • యూజీసీ పేస్కేల్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌, మంత్రి ఈటల చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న ప్రభుత్వ వైద్యులు; ఈటలను కలిసి ధన్యవాదాలు తెలుపుతున్న వైద్యులు
  • ప్రభుత్వం కొత్త భవనం నిర్మించాలని ప్రభుత్వ వైద్యులసంఘం, జేఏసీ వినతి
  • యూజీసీ పేస్కేల్‌ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉస్మానియా దవాఖానను 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందర్శించి, కొత్తభవనం కట్టాలని ప్రతిపాదిస్తే దుష్టశక్తులు అడ్డుపడ్డాయని తెలంగాణ ప్రభుత్వ వైద్యులసంఘం, మెడికల్‌ జేఏసీ నేతలు ఆరోపించారు. దీంతో ఘనచరిత్ర కలిగిన దవాఖాన నేడు రోగులకు చికిత్స అందించే స్థితిలో లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌, మెడికల్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌ జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ రమేశ్‌ కోఠిలోని కరోనా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మీడియాతో మాట్లాడారు. నిజాంకాలంలో నిర్మించిన ఉస్మానియా దవాఖాన ఇప్పటి అవసరాలకు సరిపోవడం లేదని, శిథిలావస్థకు చేరి ప్రాణాపాయంగా మారిందని పేర్కొన్నారు. హెరిటేజ్‌ భవనం పేరుతో ప్రజల ప్రాణాలు కోల్పోతుంటే చూస్తూ ఊరుకోలేమని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మళ్లీ చొరువ తీసుకుని ప్రస్తుత జనాభా అవసరాలకు అనుగుణంగా, అధునాతన సదుపాయాలతో కొత్తభవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. పదేండ్లుగా ఎదురుచూస్తున్న యూజీసీ పేస్కేల్‌ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు వైద్యులు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌, మంత్రి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. బోధనా దవాఖానల్లో పనిచేస్తున్న వైద్యులకు నాలుగేండ్లుగా పెండింగ్‌లోఉన్న పీఆర్సీ పెంపుపై సీఎం కేసీఆర్‌, వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలంగాణ మెడికల్‌ అండ పబ్లిక్‌ హెల్త్‌ జాక్‌ చైర్మన్‌ డాక్టర్‌ రవి శంకర్‌ హర్షం వ్యక్తంచేశారు.logo