మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 14, 2020 , 02:07:16

కరోనా రోగి ఇంటికి

కరోనా రోగి ఇంటికి
  • వ్యాధిని నయంచేసి పంపిన గాంధీ దవాఖాన వైద్యులు
  • పూర్తిగా నయంచేసి పంపిన గాంధీ వైద్యులు
  • మంత్రి ఈటల రాజేందర్‌ హర్షం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: రాష్ట్రంలో నమోదైన తొలి కరోనా కేసును ఎదుర్కోవడంలో తెలంగాణ వైద్యులు విజయవంతమయ్యారు. రెండువారాలుగా గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న యువకుడు పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం డిశ్చార్జ్‌ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఈ యువకుడు బెంగళూరులోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆఫీసు పనిమీద దుబాయ్‌ వెళ్లగా.. కరోనా వైరస్‌ సోకింది. ఆ యువకుడు పూర్తిగా కోలుకోవడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తంచేశారు. వైరస్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలను అభినందించారు. కరోనా సోకిన యువకుడికి వైద్యసేవలు అందించి, సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి చేయడం పట్ల రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హర్షం వ్యక్తంచేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఒకరికి కూడా కరోనా లేదని చెప్పారు.


26 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు

గాంధీ, ఉస్మానియా దవాఖానల్లో శుక్రవారం 26 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో ముగ్గురికి నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చినట్టు వైద్య, ఆరోగ్యశాఖ బులెటిన్‌ వెల్లడించింది. ఇప్పటివరకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 57,214 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలుచేశారు. కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో కూడా శుక్రవారం నుంచి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ప్రారంభించినట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ శశికళారెడ్డి పేర్కొన్నారు.  


ఖమ్మం, జగిత్యాలలో ఇద్దరు  అనుమానితులు

ఇటీవల దుబాయ్‌ నుంచి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగాపూర్‌ గ్రామానికి వచ్చిన యువకుడు ఎండీ రఫీ కొద్దిరోజులుగా దగ్గు, జ్వరం, ఛాతినొప్పితో బాధపడుతుండటంతో కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం శుక్రవారం గాంధీ దవాఖానకు తరలించారు. రఫీని తొలుత జగిత్యాల ఏరియా దవాఖానలో పరీక్షించారు. అయితే, ఎవరికీ చెప్పకుండా దవాఖాన నుంచి వెళ్లిపోవడంతో, అప్రమత్తమైన వైద్యులు పోలీసుల సహకారంతో అతనిని వెదికి పట్టుకొని, గాంధీకి తరలించారు. అమెరికాలోని డెట్రాయిట్‌లో ఓ హాస్పిటల్‌లో హౌస్‌సర్జన్‌గా పనిచేస్తూ, ఇటీవల ఖమ్మం వచ్చిన ఓ యువ డాక్టర్‌ దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుండటంతో గాంధీ దవాఖానకు తరలించారు.  


వికారాబాద్‌లో క్వారంటైన్‌ కేంద్రం

వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న చైనా, ఇటలీ, దక్షిణకొరియా, ఇరాన్‌, హాంకాంగ్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ నుంచి వచ్చే వారిని 14రోజులపాటు క్వారెంటైన్‌లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు వికారాబాద్‌లోని హరిత రిసార్ట్‌లో ఏర్పాట్లు చేశారు. మరోవైపు అన్ని జిల్లా కేంద్ర దవాఖానల్లో, బోధన దవాఖానల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటుచేశారు.

కరోనాపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ 104కు అధిక సంఖ్యలో కాల్స్‌ వస్తున్నాయి.


నో కరోనా సర్టిఫికెట్ల కోసం గాంధీకి క్యూ

తాము విదేశాలకు వెళ్లడానికి వీలుగా నో కరోనా సర్టిఫికెట్‌ ఇవ్వాలని గాంధీ దవాఖానను పలువురు ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు. శుక్రవారం గాంధీకి వచ్చిన 15 మంది ప్రయాణికులు వైద్యాధికారులతో, సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో దవాఖాన సూపరింటెండెంట్‌ వారికి నచ్చజెప్పారు. అనారోగ్య సమస్యలు లేనివారికి కరోనా పరీక్షలు నిర్వహించబోమని, అలాంటివారికి సర్టిఫికెట్లు ఇవ్వడం సాధ్యంకాదని స్పష్టంచేశారు.


logo
>>>>>>