గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Feb 16, 2020 , 02:25:29

పల్లెప్రగతిలో మరింత వేగం

పల్లెప్రగతిలో మరింత వేగం
  • తీర్మానించిన పనులు పదిరోజుల్లో పూర్తికి కృషి
  • ఈ నెలాఖరున సీఎం కేసీఆర్‌ గ్రామాల తనిఖీ
  • పంచాయతీ సమ్మేళనాలతో పల్లెలకు అధికారులు
  • ఊపందుకున్న శ్మశానవాటికలు, నర్సరీలు, డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులు
  • గ్రామపంచాయతీలకు చేరుతున్న ట్రాక్టర్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతమైంది. పల్లెప్రగతి కార్యక్రమం నిరంతరం కొనసాగించాలనే లక్ష్యంతో గ్రామసభల్లో చేసిన తీర్మానాలను యథావిధిగా నిర్వహించేందుకు తపన మొదలైంది. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ పల్లెప్రగతిపై దిశానిర్దేశంచేశారు. పల్లెప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ క్రమంలో గ్రామాల అభివృద్ధిని స్వయంగా పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రగతిపనుల్లో మరింత వేగం పెరిగింది. ఈ నెల 25వ తేదీవరకు పంచాయతీ సమ్మేళనాలను నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ఈలోగా పనులన్నీ పూర్తిచేసి సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. పంచాయతీ సమ్మేళనాలు, పల్లెప్రగతిని పర్యవేక్షించే బాధ్యతలు జిల్లాకో మంత్రికి అప్పగించడంతో వారు ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు. పల్లెప్రగతి నివేదికల ప్రకారం గ్రామాల్లో పనులను అంచనా వేసి చేపడుతున్నారు. ఇందులో భాగంగా పనులపై మంత్రులు, జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. అన్ని పంచాయతీలకు ట్రాక్టర్లు ఉండాలన్న ఆదేశాలతో ఏడువేలకుపైగా గ్రామాలకు ట్రాక్టర్లను అందించారు. మిగిలినవాటిని కొనుగోలుచేశారు. వాటిని విడుతలవారీగా పంచాయతీలకు అందజేస్తున్నారు.  


తుదిదశకు నిర్మాణాలు

గ్రామాల్లో ప్రధానమైన నర్సరీలు, శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయి. పల్లెప్రగతి సందర్భంగా 11,024 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటుచేయాల్సి ఉండగా.. 10,938 గ్రామాల్లో పూర్తయ్యాయి. మిగిలిన గ్రామాల్లో భూమి కొరత ఉండటంతో భూసేకరణ పూర్తిచేశారు. ప్రస్తుత నివేదికల ప్రకారం మొత్తం గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటుచేస్తున్నారు. ఈనర్సరీల్లో మొ త్తం 21.34 కోట్ల మొక్కలను పెంచాల్సి ఉం డగా.. ప్రస్తుతం 12.86 కోట్ల మొక్కలు పెరుగుతున్నాయి. మిగిలిన మొక్కలను కూడా సేకరిస్తున్నారు. మొత్తం 18,592 గ్రామీణ రహదారులుండగా.. 66,947 కిలోమీటర్ల పరిధిలో రోడ్లకు ఇరువైపులా 82.65లక్షల మొక్క లు నాటారు. వీటిలో 76.04 లక్షల మొక్కలు బతికాయి. వాటిని నిరంతరం సంరక్షిస్తున్నా రు. మొత్తం 12,289 కమ్యూనిటీ ప్లాంటేషన్స్‌ ఉండగా 2.19కోట్ల మొక్కలునాటారు. వీటి లో 1.97 కోట్ల మొక్కలు పెరిగాయి. మొత్తం 11,666 సంస్థల్లో 16.89 లక్షల మొక్కలునాటగా, 15.33 లక్షల మొక్కలు బతికాయి. 


5487 గ్రామాల్లో శ్మశానవాటికలు పూర్తి

రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామాల్లో శ్మశానవాటికలు ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు. చాలా గ్రామాల్లో మొన్నటివరకు ఎవరైనా చనిపోతే చెరువుగట్లు, ఖాళీ స్థలాల్లోనే దహనం, ఖననం చేసేవారు. కానీ గ్రామానికి కచ్చితంగా శ్మశానవాటిక ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రహరీ, స్నానాలు, బట్టలు మార్చుకునేందుకు గదులు ఉండేలా నిర్మాణాలుచేపట్టారు. ఇందులో భాగంగా 5,487 గ్రామాల్లో శ్మశానవాటికల నిర్మాణాలు పూర్తిచేశారు. మిగిలిన 4,837 గ్రామాల్లో నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. 3,256 గ్రామాల్లో పునాదులు తీసి నిర్మాణాలుచేపట్టారు. మరో 1,200 గ్రామాల్లో గోడలు దాదాపు పూర్తిచేశారు. రూఫ్‌ లెవల్‌లో 262, చివరిదశలో 101 ఉండగా, 18 గ్రామాల్లో రెండురోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.


డంపింగ్‌యార్డుల్లో మంచి ప్రగతి

గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అంశంలో తొలి ప్రయోగం విజయవంతంగా సాగుతున్నది. 12,751 గ్రామాల్లో 7,482 గ్రామాల్లో డంపింగ్‌యార్డులు ఏర్పాటయ్యాయి. మరో 1,030 గ్రామాల్లో దాదాపు తుదిదశకు చేరాయి. 4,239 గ్రామాల్లో నిర్మాణంలో ఉన్నాయి. 


ఈ నెల 25 టార్గెట్‌

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతతోపాటు పనులన్నీ ఈ నెల 25వ తేదీలోగా పూర్తిచేయాలని లక్ష్యంగా విధించుకున్నారు. ఈ నెల 25లోగా పనులు పూర్తిచేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించారు. మంత్రులు రోజువారీగా ప్రగతిని పరిశీలిస్తున్నారు. నిధులు కూడా అందుబాటులో ఉండటంతో పనులను పూర్తిచేస్తున్నారు. ఈ నెలాఖరులో సీఎం కేసీఆర్‌ ఏదైనా గ్రామంలో ఆకస్మిక పర్యటన చేస్తారనే సమాచారంతో అధికారులు ప్రగతిపనులను వేగంగా చేయిస్తున్నారు.


డ్రైనేజీ నిర్వహణలో మంచి ఫలితాలు

మరోవైపు రెండోవిడుత పల్లెప్రగతిలో ప్రధానంగా తీసుకున్న పారిశుద్ధ్య నిర్వహణ గ్రామాల్లో ఆశించిన ఫలితాలను ఇస్తున్నది. దాదాపు గ్రామాలు, వీధుల్లో మురికికాల్వలు శుభ్రంగా మారాయి. బ్లీచింగ్‌ చల్లుతున్నారు. ఈ వారం రోజుల్లో 1.09 లక్షల వీధుల్లో బ్లీచింగ్‌ చల్లినట్టు నివేదికల్లో పేర్కొన్నారు. 94.02 శాతం మురికికాల్వలు శుభ్రంగా మారాయి.


నిరంతరం కొనసాగాలనే..

గ్రామాల్లో పల్లెప్రగతి ప్రణాళిక అనేది నిరంతరం కొనసాగించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం ఆదేశాల ప్రకారం దీనిపై ప్రత్యేక దృష్టి పె ట్టాం. పంచాయతీ సమ్మేళనాల్లో కూడా ఇ దే అంశాలపై నిర్ణయం తీసుకుంటున్నాం. త్వరలో సీఎం కేసీఆర్‌ ఆకస్మిక పర్యటనలు ఉంటాయని ప్రకటించారు. దానికి అనుగుణంగా పనులను పూర్తిచేస్తున్నాం. 

- ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి