గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 00:47:29

సైబర్‌ నేరాలు తెలుసుకోండిలా..

సైబర్‌ నేరాలు తెలుసుకోండిలా..

  • అవగాహన కోసం సైబ్‌హర్‌ ప్రోగ్రాం
  • వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణలో డీజీపీ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా లాక్‌డౌన్‌తో ఇంటర్నెట్‌ వినియోగంతోపాటు సైబర్‌ నేరాలు కూడా గణనీయంగా పెరిగాయని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి చెప్పారు. ప్రతి అవసరానికి ఇంటర్నెట్‌ను విచ్చలవిడిగా ఉపయోగిస్తుండటంతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా భద్రతావిభాగం ఆధ్వర్యంలో పలు ఎన్జీవోలను కలుపుకొని నెలపాటు సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ www.cybeher.com తోపాటు వాల్‌పోస్టర్‌ను బుధవారం డీజీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌లో ప్రతినెలా 70 శాతంమేర పెరుగుతున్న సైబర్‌ నేరాల బారిన పడకుండా మహిళలు, చిన్నారులను అప్రమత్తం చేసేందుకే సైబ్‌హర్‌ పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అడిషనల్‌ డీజీ, ఉమెన్‌సేఫ్టీ వింగ్‌ ఇంచార్జి స్వాతిలక్రా మాట్లాడుతూ.. సైబర్‌ నేరాల పట్ల మహిళలు, చిన్నారులకు అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. నెలపాటు రోజుకో అంశంపై క్విజ్‌లు, ఆన్‌లైన్‌ చర్చలు, సైబర్‌ నిపుణులతో సలహాలు సూచనలు తదితర కార్యక్రమాలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్ట్రాగ్రాం, ట్విట్టర్‌, యూ ట్యూబ్‌, రేడియో, టీవీ మాధ్యమాల ద్వారా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఐజీ సుమతి, ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు, నటుడు నాని, టీవీ యాంకర్‌ సుమ, సింబయోసిస్‌ హైదరాబాద్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.logo