బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 02:16:05

ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు

ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు

  • లాక్‌డౌన్‌ అమలుకు కఠిన నిబంధనలు
  • రాత్రి 7నుంచి ఉదయం 6 గంటల వరకు సర్వం బంద్‌
  • అనవసరంగా బయటకు రావొద్దు
  • రూల్స్‌ అతిక్రమిస్తే వాహనాలు సీజ్‌
  • సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఎపిడమిక్‌ యాక్టు 1897 ప్రకారం విధించిన లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేయనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ప్రకటించారు. ముఖ్యంగా రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటలవరకు సంపూర్ణంగా కర్ఫ్యూ అమలులో ఉంటుందని, ఆ సమయంలో బయట ఎవరు తిరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలుచేసేందుకు మరిన్ని నిబంధనలను విధిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు సీఎస్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటలవరకు నిత్యావసర వస్తువులు, అత్యవసర పనులు వంటి వాటికి మాత్రమే పరిమితంగా బయటకు అనుమతిస్తామని స్పష్టంచేశారు. 

అత్యవసర సర్వీసులు మినహా మిగిలిన అన్ని సేవలూ ఈ నెల 31వ తేదీవరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు చేపట్టిన చర్యలపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి మీడియాకు వివరించారు. రాత్రి సచివాలయంనుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎస్‌.. లాక్‌డౌన్‌ పటిష్ఠంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలు పెంచినా, బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో వ్యవసాయం, పాల సరఫరా, మెడికల్‌ షాపులకు మినహాయింపు ఇచ్చినట్టు తెలిపారు. ఉపాధి హామీ పథకం పనులకు కూడా మినహాయింపు ఉన్నదని, గుంపులుగా కాకుండా పరిమిత సంఖ్యలో, వ్యక్తిగత దూరాన్ని కొనసాగిస్తూ పనులు చేపట్టవచ్చని చెప్పారు. విదేశాలనుంచి వచ్చినవారు క్యారంటైన్‌లో ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని స్పష్టంచేశారు. లేనిపక్షంలో పాస్‌పోర్టుపై న్యాయపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్‌డౌన్‌లో భాగంగా ఏపీతోపాటు అంతర్రాష్ట్ర సరిహద్దులన్నీ మూసివేసినట్టు తెలిపారు. 

ఆర్టీసీ, ప్రైవేట్‌ వాహనాలన్నీ బంద్‌

ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌ సర్వీసులన్నింటినీ బంద్‌చేశామని సీఎస్‌ చెప్పారు. ఐదుగురికంటే ఎక్కువమంది గుమిగూడరాదని, జీవో నంబర్‌ 45లోని ప్రతి అంశాన్నీ కచ్చితంగా అమలుచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్నిరకాల పరీక్షలు వాయిదావేస్తున్నామన్నారు. రోడ్డుపై ఎటువంటి వాహనాలు నడుపడానికి వీలులేదని స్పష్టచేశారు. అత్యవసరసేవలకు అంతరాయం ఏర్పడకుండా ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటుచేసిందని, పౌరసరఫరాలు, వ్యవసాయ పనులు, ఇతర సేవలను కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. 87 లక్షల తెలుపురంగు రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా బియ్యం సరఫరా చేయడంతోపాటు రూ.1,500 త్వరలోనే అందజేస్తామని, ఆ దిశగా కమిటీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఐటీ కంపెనీలు ఇప్పటికే వర్క్‌ ఫ్రం హోం విధానాన్ని అమలుచేస్తున్నాయని, అత్యవసరమనుకుంటే కొన్నిరకాల ఐటీ సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నామని వివరించారు. 

సచివాలయంలో ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు రాహుల్‌ బొజ్జా, అనిల్‌కుమార్‌తో కంట్రోల్‌ రూం ఏర్పాటుచేశామని జిల్లా కలెక్టర్లకు చెప్పారు. వీరు ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇస్తారన్నారు. ఇదే తరహాలో జిల్లాల్లో కూడా కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్కో జిల్లాలో కనీసం రెండు క్వారంటైన్‌ సెంటర్లు ఉండేలా చూడాలని ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన, హోం క్వారంటైన్‌లో ఉన్నవారి వివరాలు సేకరించడానికి ఇంటర్‌ డిసిప్లీనరీ టీంలు ఏర్పాటు చేయాలని తెలిపారు. రోజువారీ నివేదికలు కంట్రోల్‌ రూంకు పంపాలన్నారు. జిల్లాల్లో క్వారంటైన్‌ యాక్టివిటీని పర్యవేక్షించడానికి యాప్‌ను రూపొందించామని చెప్పారు. రైతులు గుమిగూడకుండా గ్రామస్థాయిలో ఎక్కువ సంఖ్యలో ధాన్యం సేకరణ కేంద్రాలను పెంచాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, కార్యదర్శులు రాహుల్‌ బొజ్జా, జనార్దన్‌రెడ్డి, రిజ్వీ, సందీప్‌కుమార్‌ సుల్తానియా, సంజయ్‌ జాజు, రోనాల్డ్‌ రోస్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

నియంత్రిస్తే మరిన్ని ఆంక్షలు: డీజీపీ

ప్రజలు స్వీయ నిర్బంధంలోనే ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. ప్రజాశ్రేయస్సు కోసం ఈ నెల 31వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని స్పష్టంచేశారు. రోజూవారీ నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మెడికల్‌, అత్యవసరశాఖల, మీడియా వాహనాలకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. నివాసాలకు సమీపంలోని రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దుకాణాలనుంచి నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి మాత్రమే వ్యక్తిగత వాహనాలను ఉపయోగించాలని సూచించారు. ఇందుకోసం బైక్‌లపై ఒకరు, కార్లలో డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టంచేశారు. రోడ్లపై ఒకేచోట ఐదుగురి కంటే ఎక్కువ మంది కనిపిస్తే చర్యలు తీసుకొంటామని, ప్రజలు నియంత్రణ పాటించకపోతే పగటిపూట కూడా బయటకు వెళ్లే సమయంపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 31వరకు క్రమశిక్షణతో ఉండాలని విజ్ఞప్తిచేశారు. లాక్‌డౌన్‌ను ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల రాకపోకలను నివారించేందుకు ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చెక్‌పోస్టు ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. సరైన కారణం లేకుండా బయటకు వచ్చినట్టు గుర్తిస్తే ఈ నెల 31వరకు వాహనాన్ని సీజ్‌చేస్తామని హెచ్చరించారు. చట్టా న్ని కఠినంగా అమలుచేయాలని ఐజీలు, డీఐజీలు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్‌ కేసులు నమోదుచేస్తామని, 1897 చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు పూర్తి అధికారాలున్నాయని చెప్పారు. సమావేశంలో అదనపు డీజీపీ జితేందర్‌ కూడా పాల్గొన్నారు. 

నిత్యావసర సరుకుల పర్యవేక్షణకు కమిటీ

ప్రజలకు నిత్యావసర సరుకులకు ఇబ్బంది కలుగకుండా సరఫరాచేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటుచేసింది. వ్యవసాయశాఖ కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో పౌరసరఫరాల, రవాణాశాఖ కమిషనర్లు, ఐజీ ఆఫ్‌ పోలీస్‌, డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌, ఉద్యానశాఖ డైరెక్టర్‌, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌, లీగల్‌ మెట్రాలజీ కంట్రోలర్‌, డెయిరీ డెవలప్‌మెంట్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఎండీ సభ్యులుగా ఉన్నారు.

ఆటోలు బంద్‌ పాటించాలి: బీఎంఎస్‌ పిలుపు 

కరోనా వైరస్‌ బారి నుంచి ప్రజలను కాపాడాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణంగా సహకరిస్తామని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ తెలంగాణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. జనతా కర్ఫ్యూను విజయవంతంచేసిన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్‌ పిలుపును కూడా పాటించాలని కోరింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి ప్రజారవాణా బంద్‌ కావాలన్న సీఎం కేసీఆర్‌ సూచనకు కట్టుబడి ఉండాలని ఆటో డ్రైవర్లకు విజ్ఞప్తిచేసింది. ఆటో డ్రైవర్లకు రూ.3 వేల జీవనభృతి చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది.

లాక్‌డౌన్‌కు సహకరించాలి

ప్రజలు స్వీయ క్రమశిక్షణ పాటించాలి

హోంమంత్రి మహమూద్‌ అలీ


లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని, కరోనా వైరస్‌ పూర్తిగా అంతమయ్యేవరకు ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణ పాటించాలని హోంమంత్రి మహమూద్‌ అలీ కోరారు. సోమవారం నార్త్‌జోన్‌ డీసీపీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన.. లాక్‌డౌన్‌ పరిస్థితి వివరాలను డీసీపీ కల్మేశ్వర్‌ సింగనవార్‌, ఇతర పోలీస్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర సరిహద్దులు అన్నీ మూసివేశామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించామని వివరించారు. కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్న పలువురిని పోలీసులు దవాఖానలకు తరలించారని తెలిపారు. స్థానికంగా ఎవరైనా విదేశీయులు ఉంటే, పరిసర ప్రాంతాల్లో సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఉగాది పండుగను కూడా ఎవరి ఇండ్లల్లో వారు చేసుకొంటే బాగుంటుందని చెప్పారు. సికింద్రాబాద్‌లో భిక్షాటన చేస్తూ ఫుట్‌పాత్‌లపై నివాసం ఉంటున్న వారికి ఆహారం విషయమై త్వరలో ప్రిన్సిపల్‌ సెక్రటరీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. అవసరమైతే ఆయా ప్రాంతా ల్లో రూ.5 భోజనం ఏర్పాటుచేస్తామన్నారు.


logo
>>>>>>