శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 03:13:15

అటూ ఇటూ తిరుగుతూ ఆగం కావొద్దు

అటూ ఇటూ తిరుగుతూ ఆగం కావొద్దు

 • కరోనా రోగులకు కావాల్సినన్ని బెడ్లు
 • ప్రభుత్వ దవాఖానల్లో పూర్తిస్థాయి చికిత్స
 • ప్రైవేటుకు దీటుగా వైద్యసేవలు, సౌకర్యాలు
 • ఎక్కడైనా అవే మందులు, అదే చికిత్స
 • అనేక మంది ఆరోగ్యంగా బయటపడ్డారు
 • 92% సర్కారు దవాఖానల్లో  ఖాళీగా ఉన్న బెడ్లు
 • 104 కొవిడ్‌ వివరాలకు డయల్‌ చేయండి

కరోనా అనగానే కంగారు పుడుతుంది.. ఆ కంగారులో దవాఖాన గుర్తుకొస్తుంది. సర్కారు దవాఖానకు వెళ్తే బాగా చూసుకుంటారో, లేదో అన్న అనుమానం..  డబ్బు పోయినా ఫరవాలేదు, ప్రాణాలు కాపాడుకుందాం.. అని కొందరు ప్రైవేటు దవాఖానలకు వెళ్తున్నారు. కానీ, అక్కడ పట్టించుకోక అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి సర్కారు దవాఖానలే దిక్కని వస్తున్నారు. ఈలోగా రోగం ఎక్కువై ప్రాణాలు కోల్పోతున్నారు. వద్దు.. ఆగమాగం కావొద్దు. సర్కారు దవాఖానల్లో కావాల్సినన్ని బెడ్లు ఉన్నాయి. దేవుళ్లలాంటి వైద్యులున్నారు. అమ్మలా చూసుకొనే  నర్సులున్నారు. పైసా ఖర్చు లేకుండా ప్రాణాన్ని కాపాడే వసతులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమూ మనకు అండగా ఉన్నది. రోగం ఎక్కువుంటేనే దవాఖానకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉంటే ఇంట్లోనే జాగ్రత్తలు పాటిస్తూ మన ప్రాణాలను కాపాడుకోవచ్చు.

దగ్గితే దడ.. తుమ్మితే భయం.. జ్వరం వస్తే జంకు.. కరోనా వైరస్‌ సోకిందేమోనన్న అనుమానం. ఆ వెంటనే గుండెల్లో దడ. శరీరమంతా వణుకు. పైసలు పోతేపోనీ జల్ది దవాఖానలో చేరుదామని ప్రైవేటు దవాఖానకు పరుగు పెడుతున్నారా? అటు ఇటు తిరుగుతూ జేబులు గుల్ల చేసుకుంటున్నారా? పరేషాన్‌ అయ్యి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఆగం కాకండి. అండగా నిలిచేందుకు సర్కారు ఉన్నది. అక్కున చేర్చుకునేందుకు ప్రభుత్వ దవాఖానలున్నాయి. 


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ సిటీ బ్యూరో : వైరస్‌ సోకిందన్న అనుమానం ఉన్నా, లక్షణాలు బయటపడినా తగు జాగ్రత్తలతో మనల్ని మనం కాపాడుకోవచ్చు. వాస్తవానికి వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత లక్షణాలు బయటపడ్డానికి ఐదు రోజుల నుంచి 14 రోజుల సమయం పడుతున్నది. వైరస్‌ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు కనిపించడం లేదు. మరికొందరిలో స్వల్ప లక్షణాలు బయటపడుతున్నాయి. కేవలం 5 శాతం మందిలో తీవ్ర లక్షణాలుంటున్నాయి. అయితే, చాలామంది ప్రైవేటు దవాఖానల చుట్టూ తిరిగి, వాళ్లు చేర్చుకోకపోతే ప్రభుత్వ దవాఖానలకు వస్తున్నారు. ఈ క్రమంలో విలువైన సమయాన్ని వృథా చేసుకుంటూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.  వైరస్‌ పరీక్షల నుంచి చికిత్స వరకు అవగాహన లేకపోవడం వల్ల శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు వైరస్‌ లక్షణాలు, ప్రభుత్వం అందిస్తున్న చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో చేయాల్సిన పనుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి గురించి శాస్త్రీయమైన అవగాహన పెంచుకోవాలని, తద్వారా వైరస్‌పై పైచేయి సాధించవచ్చని చెప్తున్నారు.

లక్షణాలున్నా కరోనా సోకినట్టు కాదు..

అసలే వానకాలం. సీజనల్‌ వ్యాధులు సహజమే. అయితే, కరోనా లక్షణాలు, సీజనల్‌ వ్యాధుల లక్షణాలు ఒకటే కావడంతో వైరస్‌ సోకిందేమోనని ప్రజలు భయపడుతున్నారు. సాధారణంగా  జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆయాసం, ఊపిరి బిగపట్టినట్టు కావడం, వాసన, రుచి తెలియకపోవడం, ఛాతిలో నొప్పి, వాంతులు, విరేచనాలు, కళ్లు ఎర్రగా మారటం వంటి లక్షణాలుంటే కరోనా పరీక్షలు చేయించుకోవచ్చు. అందులో చాలా వరకు సీజనల్‌గా వచ్చే ఫ్లూ సంబంధించినవని అన్న విషయం మర్చిపోవద్దు. 

అనుమానితులు

కరోనా సోకిన వారిని కలిసినా, వారితో నేరుగా సంబంధం కలిగిన వారిని కలిసినా కరోనా పరీక్షలు చేయించుకోవచ్చు. వైరస్‌ సోకినట్టు అనుమానం కలిగితే ఆందోళన చెందకుండా, ఇంట్లోనే ప్రత్యేక గదిలో పది రోజుల పాటు వేరుగా ఉండాలి. స్వల్ప లక్షణాలు బయటపడితే పరీక్ష చేయించుకునేందుకు సిద్ధం కావాలి. 

పాజిటివ్‌ అని తేలితే..

 •  వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయితే వెంటనే వైద్యాధికారులు ఫోన్‌ చేసి అప్రమత్తం చేస్తారు.
 •  ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటారు. 
 • తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు.
 • నెగెటివ్‌ రిపోర్టులో నెగెటివ్‌ వస్తే సమస్య లేదు


లక్షణాలు తీవ్రంగా ఉంటే..

తీవ్ర లక్షణాలుంటే వైద్య సిబ్బందే స్వయంగా ఇంటికి వచ్చి రోగులను గాంధీ, కింగ్‌ కోఠి, ఎర్రగడ్డ ఛాతి దవాఖానలకు తరలిస్తారు. ఒకవేళ పరీక్షలు చేయించుకోకున్నా లక్షణాలు తీవ్రంగా ఉంటే పైన తెలిపిన దవాఖానలతో పాటు నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్‌, ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌కు నేరుగా వెళ్లవచ్చు. రోగికి వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాలు వచ్చే వరకు ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తారు.

--: పరీక్ష ఇలా చేసుకోవాలి :--

అనుమానితుడు ప్రభుత్వ కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్ష కేంద్రాలకు వెళ్లాలి. ఆధార్‌ కార్డు నంబరు, ఫోన్‌ నంబరుతో పేరు నమోదు చేయించుకోవాలి. అక్కడ వైరస్‌ నిర్ధారణకు రూ.2వేల విలువ చేసే ఆర్టీపీసీఆర్‌ పరీక్షను ఉచితంగా చేస్తారు. పరీక్ష చేయించుకున్న 24 గంటల నుంచి 48 గంటల్లోపు పరీక్ష 

ఫలితాలను మెసేజ్‌ లేదా ఫోన్‌ ద్వారా తెలియజేస్తారు. ప్రధాన కేంద్రాల్లో అయితే రిపోర్టు నేరుగా వెళ్లి తీసుకోవచ్చు. 

ఇంట్లోనే చికిత్స ప్రత్యేక వసతిలో లక్షణాలు స్వల్పంగా ఉంటే..

 • ఆరోగ్య సమస్యలు పెద్దగా లేనివారిని హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచిస్తారు. అత్యవసర సమయాల్లో చేయాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు.
 • ప్రతి రోజు ఫోన్‌ చేసి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుంటారు. స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్లు ఇంట్లోనే ఉండి చికిత్స పొందవచ్చు. వారికి ఎలాంటి ఇన్‌స్టిట్యూషనల్‌ ట్రీట్‌మెంట్‌ అవసరం లేదు.
 • ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆశావర్కర్ల ద్వారా ఇంటికే మందులను పంపిస్తారు. ఇండ్లలో ప్రత్యేక గదులు లేనివారికి ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. 
 • అమీర్‌పేటలోని ప్రకృతి చికిత్సాలయం, ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద దవాఖానలో క్వారంటైన్‌ సదుపాయం ఉంది. ఇక్కడ వైద్యుల పర్యవేక్షణ, మందులు, వ్యాయామం, యోగా సదుపాయాలు కల్పిస్తారు.

ఉచిత పరీక్ష కేంద్రాలివే

 • కింగ్‌కోఠి హాస్పిటల్‌, కోఠి
 • ఫీవర్‌ హాస్పిటల్‌, నల్లకుంట
 • చెస్ట్‌ హాస్పిటల్‌, ఎర్రగడ్డ
 • నేచర్‌ క్యూరో హాస్పిటల్‌, అమీర్‌పేట
 • సరోజినీదేవి కంటి దవాఖాన, మెహిదీపట్నం
 • ఆయుర్వేద దవాఖాన, ఎర్రగడ్డ
 • హోమియో దవాఖాన, రామంతాపూర్‌
 • నిజామియా హాస్పిటల్‌, చార్మినార్‌
 • ఏరియా హాస్పిటల్‌, కొండాపూర్‌
 • ఏరియా హాస్పిటల్‌, వనస్థలిపురం ఈఎస్‌ఐ దవాఖాన, నాచారం

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలివీ..

బెడ్స్
సామర్థ్యం
భర్తీ అయినవి
 ఖాళీగా ఉన్నవి
ఐసొలేషన్‌
11,928
944
10,984
ఆక్సిజన్‌ బెడ్స్‌
3,537
4233,114
ఐసీయూ
1,616185
1,431
మొత్తం
17,081
1,552
15,529


హైదరాబాద్‌లో కరోనా  దవాఖానలు

దవాఖాన
మొత్తం పడకలు
భర్తీ  అయినవి
ఖాళీగా  ఉన్నవి
గాంధీ
1890832
1058
కింగ్‌ కోఠి
350111239
చెస్ట్‌ దవాఖాన
1219625
ఫీవర్‌ హాస్పిటల్
140122
18
మొత్తం
2501
1161
1340


గ్రేటర్‌ పరిధిలో 11 ప్రధాన కేంద్రాలు, 

13 ప్రత్యేక శిబిరాల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ర్యాపిడ్‌ పరీక్షలు కూడా చేస్తున్నారు. మొత్తం 90 కేంద్రాల్లో కొవిడ్‌-యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిద్వారా అరగంటలోనే ఫలితాలు తెలుస్తాయి. దీనికి తోడు 17 ప్రైవేటు ల్యాబ్‌లలో ఫీజులు తీసుకుంటూ పరీక్షలు చేస్తున్నారు.

కొవిడ్‌ కిట్‌లో ఉండే మందులివే..

 • హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు
 • జింక్‌ మాత్రలు
 • బి-కాంప్లెక్స్‌ మాత్రలు
 • సి-విటమిన్‌ మాత్రలు
 • శానిటైజర్‌
 • మాస్కులు
 • గ్లౌజులు
 • హెల్ప్‌లైన్‌ నంబరు.. 104

గాంధీలో కార్పొరేట్‌ను మించిన చికిత్స


గాంధీ, ఎర్రగడ్డ ఛాతి దవాఖానల్లో కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. గాంధీ దవాఖానలో ప్రస్తుతం మధ్యస్త, తీవ్ర లక్షణాలున్న వారికి మాత్రమే చికిత్స అందిస్తున్నారు. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న వారిని హోమ్‌ ఐసొలేషన్‌కు తరలిస్తున్నారు. గాంధీలో గర్భిణులు, చిన్నపిల్లలు, సాధారణ కొవిడ్‌ రోగులకు వేర్వేరుగా ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉంచారు. ఇక్కడ ఇప్పటి వరకు సుమారు పదికి పైగా పాజిటివ్‌ గర్భిణులకు విజయవంతంగా ప్రసవాలు జరిగాయి. పుట్టిన పిల్లలకు కరోనా సోకకుండా మెరుగైన వైద్యం అందించడంతో తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా కోలుకుని ఇంటిబాట పట్టారు. అప్పుడే పుట్టిన నవజాత శిశువు నుంచి 94 ఏండ్ల పండు ముసలవ్వ దాకా కరోనాను జయించి పునర్జన్మ పొందారు. ఈ దవాఖానలో  మొత్తం 2వేల పడకలు, 400 వెంటిలేటర్లు, వెయ్యికిపైగా పడకలకు ఆక్సిజన్‌ సదుపాయం ఉంది. ప్రస్తుతం 800 నుంచి 900లోపే కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. అంటే సుమారు 1100 పడకలు ఖాళీగానే ఉన్నాయి.

ప్రైవేటులో పడకల కృత్రిమ కొరత


15 నుంచి 20శాతం మందికి మాత్రమే దవాఖాన చికిత్స అవసరమని, అందులో 5నుంచి 8శాతం మందికి మాత్రమే ఐసీయూలో వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ అవసరమవుతున్నదని ఐసీఎంఆర్‌ తేల్చి చెప్పింది. కానీ కొంతమంది అనవసర భయంతో, అవగాహన లోపంతో లక్షణాలు లేకున్నా, స్వల్ప లక్షణాలున్నా చికిత్స కోసం ప్రైవేటు బాట పడుతున్నారు. జేబులు గుల్ల చేసుకుంటూ బాధపడుతున్నారు. కార్పొరేట్‌ దవాఖానల్లో పడకల సామర్థ్యం తక్కువగా ఉండడంతో సహజంగానే పడకల కొరత ఏర్పడుతుంది. మరికొన్ని దవాఖానలు ప్రీ బుకింగ్‌ను అందుబాటులోకి తీసుకురావటంతో కృత్రిమ కొరత ఏర్పడుతున్నది. ఆసక్తికర విషయమమేమిటంటే.. రోగుల నుంచి డిమాండ్‌ ఉండటంతో కొన్ని కార్పొరేట్‌ దవాఖానలు అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. లక్షణాలు లేకున్నా సంపన్న వర్గాల వారికి ప్రత్యేకంగా విల్లాలు, హోటళ్లలో ఐసొలేషన్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. అంటే దవాఖానల్లో కాకుండా విల్లాలు, హోటళ్లలోనే చికిత్స అందిస్తున్నాయి. అందుకోసం రోజుకు రూ.50వేల నుంచి రూ.లక్ష దాకా వసూలు చేస్తున్నట్టు సమాచారం.

ప్రభుత్వ దవాఖానలపై అభాండాలు

ప్రభుత్వ దవాఖానలు ఉచితంగా పరీక్షలు, నాణ్యమైన  చికిత్స అందిస్తున్నా కొందరు కొవిడ్‌ బాధితులు ప్రైవేటు హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల మరణించిన ఓ కరోనా రోగిని చేర్చుకోవాలని ప్రైవేటు చుట్టూ తిరిగి, ఫలితం లేకపోవటంతో చివరికి గాంధీకి తీసుకొచ్చారు. ఇంతలో విలువైన సమయం గడిచిపోవటంతో ఆ రోగి ప్రాణాలు వదిలాడు. చాలా కేసుల్లో ప్రైవేటు చుట్టూ తిరిగి ప్రభుత్వ దవాఖానలకు వస్తున్నారు. దీంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతున్నది. చివరకు తమ వారిని బతికించలేదని, వైద్యం అందించలేదని ప్రభుత్వ దవాఖానలపై అభాండాలు వేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ కొవిడ్‌ దవాఖానల్లో దాదాపు 92 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయి. కరోనా సోకిన వారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉచితంగా చికిత్స అందిస్తున్నది. పీపీఈ కిట్లు, ఇతర వైద్య సామగ్రి దవాఖానల్లో రెడీగా ఉంది. వైరస్‌ సోకినా మనోధైర్యంతో ముందడుగు వేయాలని, అదే అసలైన మందు అని నిపుణులు చెప్తున్నారు.


logo