శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 24, 2021 , 02:10:01

15 గంటల్లో పట్టేశారు

15 గంటల్లో పట్టేశారు

  • మన పోలీసులకు చిక్కిన ముత్తూట్‌ దొంగలు
  • తమిళనాడులో దోపిడీ.. ఇక్కడ అరెస్టు
  • 12 కోట్ల ముత్తూట్‌ బంగారం స్వాధీనం
  • 7 తుపాకులు లభ్యం.. 8 మంది అదుపులోకి  
  • రాష్ట్రం దాటకుండా 10 గంటలకుపైగా వేట

హైదరాబాద్‌ సిటీబ్యూరో, జనవరి 23(నమస్తే తెలంగాణ): తమిళనాడులో ఓ భారీ దోపిడీకి పాల్పడి నాగ్‌పూర్‌ పారిపోతున్న ఓ ముఠాను తెలంగాణ పోలీసులు చాకచక్యంగా బంధించారు. తమిళనాడు పోలీసులనుంచి సమాచారం అందడంతోనే అప్రమత్తమైన రాజధానిలోని 3 కమిషనరేట్ల పరిధిలోని 100 మందికిపైగా పోలీసులు, అధికారులు దోపిడీ ముఠా కోసం వేట మొదలుపెట్టారు. సరిహద్దుల్లో అణువణువూ గాలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌లోకి చొరబడి భారీగా బంగారం దోపిడీ చేసి తెలంగాణ మీదుగా పారిపోతున్న యూపీ ముఠాను 15 గంటల్లోనే హైదరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని రాష్ట్ర పోలీస్‌ గ్రేట్‌ అని మరోసారి నిరూపించుకున్నారు. శనివారం గచ్చిబౌలిలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌, తమిళనాడు కృష్ణగిరి ఎస్పీ గంగాధర్‌తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఘటన వివరాలను వెల్లడించారు. 

పక్కాగా స్కెచ్‌

తమిళనాడు కృష్ణగిరి జిల్లా హడ్కో పోలీసుస్టేషన్‌ పరిధిలోని ముత్తూట్‌ సంస్థకు శుక్రవారం మూడు బైకుల మీద ఆరుగురు వచ్చా రు. ఇద్దరు బయట ఉండగా నలుగురు మాస్కులు, హెల్మెట్లు ధరించి లోపలికి వెళ్లా రు. తుపాకులతో బెదిరిస్తూ.. కార్యాలయంలో ఉన్న ఆరుగురు ఉద్యోగులను ఒక చోట చేర్చి 25 కిలోల బంగారాన్ని పెద్ద బ్యాగులో వేసుకొని పరారయ్యారు. ఆ తర్వాత దుండగులు నేరుగా బెంగుళూరు, తమిళనాడు సరిహద్దుకు వచ్చి అక్కడ ఆగి ఉన్న కంటైనర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాబిన్‌లో బంగారంతోపాటు తుపాకులను దాచిపెట్టారు. బైక్‌లను అక్కడే వదిలేసి ట్రక్కులో కొద్దిదూరం వచ్చి అక్కడ ఐదుగురు వ్యక్తులు ఓ టాటా సుమోలో  కంటైనర్‌ వెనుకాలే రాత్రి 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ చేరుకున్నారు. 

అప్పటికే రంగంలోకి దిగిన తమిళనాడు పోలీసులు ప్రాథమికంగా సీసీ కెమెరాలు ఇతర క్లూస్‌ ఆధారంగా సేకరించిన సమాచారంతో వెంబడిస్తున్నారు. దొంగ ల కదలికలపై అటు కర్ణాటక, ఏపీ, తెలంగాణ పోలీసులను అప్రమత్తం చేశారు. అనంతపురం నుంచి మరో టాటా సుమోను మాట్లాడుకున్న దొంగలు నాగ్‌పూర్‌ వెళ్లేందుకు తెలంగాణలోకి ప్రవేశించారు. అప్పటికే తమిళనాడు పోలీసుల సమాచారంతో అప్రమత్తమైన సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌, స్థానిక పోలీసులు సిద్ధంగా ఉన్నారు. నిందితుల వద్ద తుపాకులు ఉన్నాయని తెలియడంతో గస్తీ సాయుధ దళాలు సైతం రంగంలోకి దిగాయి. 


తెల్లవారుజామున 2.30 గంటలకు రాయ్‌కల్‌ టోల్‌ప్లాజా వద్ద దుండగులు ప్రయాణిస్తున్న సుమో, కంటెయినర్‌ను గుర్తించారు. ఉదయం 3 గంటల సమయంలో తొండుపల్లి వద్దకు రాగానే భారీగా మోహరించిన పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నా రు. కంటైనర్‌లో చాలాసేపు వెతికినా వారికి ఏ క్లూ దొరకలేదు. అనుమానం వచ్చి మరోసారి తనిఖీ చేయగా డ్రైవర్‌ వెనుకున్న రహస్య క్యాబిన్‌ కనబడింది. అందులో 25 కేజీల బంగారం, ఏడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. 

నిందితులు రూప్‌సింగ్‌ బాగల్‌, శంకర్‌సింగ్‌ బాగల్‌, పవన్‌కుమార్‌, భూపేందర్‌ మాంజీ, వివేక్‌ మండల్‌, టెక్‌రామ్‌, రాజీవ్‌కుమార్‌, లులియా పాండ్యాను అదుపులోకి తీసుకోగా అమిత్‌ అలియాస్‌ వివేక్‌ శుక్లా పరారీలో ఉన్నాడు. ఈ ముఠా పంజాబ్‌లోని లుథియానాలోనూ ముత్తూట్‌ సంస్థలో బంగా రం దోపిడీకి ప్రయత్నించి విఫలమైనట్టు దర్యాప్తులో తేలింది. సమావేశంలో శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, ట్రాఫిక్‌ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్‌, క్రైం డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఎస్‌ఓటీ అదనపు డీసీపీ సందీప్‌, క్రైం అదనపు డీసీపీ ఇందిర, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. ముఠాను పట్టుకున్న సిబ్బందికి సీపీ సజ్జనార్‌ రివార్డులు ప్రకటించారు. 

కృష్ణగిరి ఎస్పీ మనోడే

25 కేజీల బంగారం దోపిడీ కేసులో చాకచక్యంగా వ్యవహరించి దుండగులు ప్రయాణిస్తున్న వాహనాలను గుర్తించిన కృష్ణగిరి ఎస్పీ బండి గంగాధర్‌ తెలంగాణలోని నిజామాబాద్‌ వాసి. 2011 బ్యాచ్‌ ఐపీఎస్‌గా ఎంపికైన ఆయన తమిళనాడు క్యాడర్‌ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముత్తూట్‌లో దోపీడీ సమాచారం రాగానే స్పాట్‌లోకి వచ్చిన ఆయన హుటాహుటిన 50 మందితో టీమ్‌ ఏర్పాటు చేసి శాస్త్రీయ ఆధారాలు సేకరించి నిందితుల వెంటపడ్డా రు. కొంత ఆలస్యమైనా దొంగలు తప్పించుకొనేవారు. సమాచారం అందడంతో తెలంగాణ పోలీసులు వేగంగా స్పందించడం సంతోషంగా ఉందని గంగాధర్‌ చెప్పారు. ఈ కేసును తెలంగాణవాసిగా తెలంగాణ పోలీసులతో కలిసి చేధించడం ఆనందంగా ఉన్నదని ‘నమస్తే తెలంగాణ’తో తెలిపారు.

VIDEOS

logo