సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 14, 2020 , 00:59:29

అపెక్స్‌ కౌన్సిల్‌కు అస్ర్తాలు!

అపెక్స్‌ కౌన్సిల్‌కు అస్ర్తాలు!

తెలుగు రాష్ర్టాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి అపెక్స్‌ కౌన్సిల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకవైపు రెండు రాష్ర్టాలు అన్ని రకాల అస్త్రశస్ర్తాలను సిద్ధంచేసుకుంటుండగా.. మరోవైపు కేంద్రం కూడా సమగ్ర వివరాల సేకరణలో హడావుడిగా అడుగులు వేస్తున్నది. దీంతో జల్‌శక్తితోపాటు రెండు రాష్ర్టాల జలవనరులశాఖ ఇంజినీర్లంతా ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమయ్యారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర జల్‌శక్తి నిర్వహించనున్న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయి. ఈ నెల 20 తర్వాత సమావేశ నిర్వహణకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంగీకారం తెలిపిన దరిమిలా కేంద్రం ఆ మేరకు చర్యలు ప్రారంభించింది. ఇందు లో భాగంగా సమావేశ తేదీలను ఖరారుచేసేందుకు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. సమావేశ నిర్వహణకు రెండుమూడు తేదీలను సూచించాలని కోరారు. రెండు రాష్ర్టాల నుంచి వచ్చే తేదీల ఆధారంగా జల్‌శక్తి ఒక తేదీని ఖరారుచేసి.. తిరిగి రాష్ర్టాలకు సమాచారం ఇవ్వనున్నది. ఈ నెలలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించుకుందామని రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఇప్పటికే రాసిన లేఖలో స్పష్టతనిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల మూడోవారంలో సమావేశాన్ని నిర్వహించవచ్చని జలవనరులశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రెండు రాష్ర్టాల ఇంజినీర్లు సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు.

గట్టిగా బదులిచ్చేందుకు..

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై ఫిర్యాదుచేసిన ఆంధ్రప్రదేశ్‌.. వాస్తవాలు తెలుసుకోకుండా నిలుపుదల ఆదేశాలు జారీచేసిన కేంద్రానికి దీటైన బదులిచ్చేందుకు తెలంగాణ సిద్ధమవుతున్నది. ఈ మేరకు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ జలవనరులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి సమగ్రం గా చర్చించారు. దీంతోపాటు జలవనరులశాఖ అధికారులు కూడా అపెక్స్‌ కౌన్సిల్‌కు సంబంధించి సమస్త వివరాలను సీఎం కేసీఆర్‌కు అందుబాటులో ఉంచేందుకు సిద్ధంచేస్తున్నారు. ట్రిబ్యునల్స్‌ మొదలు రెండు నదులపై నిర్మించిన ప్రాజెక్టులు.. కృష్ణా, గోదావరి నదీ యాజమా న్య బోర్డులకు సంబంధించిన అంశాలను ఇందులో పొందుపరుస్తున్నారు. ముఖ్యంగా ఏపీ ఫిర్యాదుచేసిన ప్రాజెక్టులు పాతవేనంటూ గతంలోనే పలుమార్లు తెలంగాణ ప్రభుత్వం కేంద్రం, నదీ బోర్డులకు సమాధానమిచ్చింది. గతంలో జరిగిన మొదటి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ సీఎం కేసీఆర్‌ స్వయంగా వివరించారు. ఈ నేపథ్యంలో తిరిగి ఆ సమాచారంతోపాటు అప్‌డేట్స్‌ను కూడా ప్రభుత్వానికి ఇవ్వనున్న నివేదికలో అధికారులు పొందుపరుస్తున్నారు.

గంటల్లోనే సమాచారం కోరిన సీడబ్ల్యూసీ

అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి కసరత్తు జరుగుతున్న క్రమంలో కేంద్ర జలసంఘం తాజాగా తెలుగు రాష్ట్రాలకు రాసిన లేఖ ఒకటి చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని సీడబ్ల్యూసీ ప్రధాన కార్యాలయం ఆదేశానుసారం హైదరాబాద్‌లోని కేంద్ర జలసంఘం కార్యాలయం డైరెక్టర్‌ ఎం రఘురాం రెండు రాష్ర్టాలకు లేఖ రాశారు. సాధారణంగా సమాచారం కోసం కనీసం రోజుల వ్యవధి ఇస్తారు. కానీ బుధవారం ఉదయం రాసిన ఈ లేఖలో సాయంత్రానికి అన్ని వివరాలు పంపాలని సూచించడం గమనార్హం. ప్రస్తుతం ఆయా రాష్ర్టాల్లో రెండు నదులపై ఉన్న ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులు, అమోదించిన సంవత్సరం, ఆ సమయంలో ప్రాజెక్టు అంచనా వ్యయం, ప్రస్తుత అంచనా వ్యయంతోపాటు ఈ ఏడాది మార్చివరకు ఆయా ప్రాజెక్టులపై ఖర్చుచేసిన వ్యయాన్ని తగిన ఫార్మాట్‌లో పొందుపరిచి పంపాల్సిందిగా లేఖలో సూచించారు. దీని ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నాటికి రెండు రాష్ర్టాలకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల వివరాలను కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రికి అందుబాటులో ఉంచేందుకు అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.logo