శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 02:36:33

ఇరిగేషన్‌కు కొత్తరూపు!

ఇరిగేషన్‌కు కొత్తరూపు!

  • ప్రాదేశిక విభాగాలుగా విభజన.. ఒక్కో సీఈకి ఒక్కో విభాగం 
  • ఇక అన్నీ ఒకే గొడుగు కిందకు
  • నేడు ఇరిగేషన్‌పై సీఎం సమీక్ష
  • పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం
  • నేడు సీఎంకు అధికారుల నివేదిక
  • కొత్త సచివాలయంపై రేపు చర్చ

తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్నది. వ్యవసాయానికి ప్రాణాధారం సాగునీరు. అందుకే రాష్ట్రంలో సాగునీటిశాఖ ప్రాధాన్యాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్‌.. ఆ శాఖను పునర్వ్యవస్థీకరించి, మరింత బలోపేతం చేయాలని సంకల్పించారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకోవడానికి ఆధారమైన సాగునీటిరంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా.. నీటిపారుదలశాఖ పునర్వ్యస్థీకరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మరోవైపు నూతన సచివాలయ పనులు కూడా వేగం పుంజుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో రెండు కీలకమైన ఇంజినీరింగ్‌ విభాగాల ముఖ్యులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమ, మంగళవారాల్లో ప్రగతిభవన్‌లో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండుగంటల నుంచి నీటిపారుదలశాఖ, మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రోడ్లు భవనాలశాఖ మంత్రులు, ముఖ్య అధికారులతో సమావేశమవుతారు. సమైక్య రాష్ట్రంలో నీటిపారుదలకు సంబంధించి తెలంగాణ దారుణమైన ప్రాంతీయ వివక్షకు గురైంది. కానీ, కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న జీవగడ్డ తెలంగాణ కాబట్టి.. ఈ ప్రాంతానికి పుష్కలమైన నీటి వసతి కల్పించే అవకాశం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పించారు. సమగ్ర అవగాహనతో ప్రణాళికలు వేసి, వాటిని పటిష్టంగా అమలుచేయడం వల్ల.. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన ఆరేండ్లలోనే తెలంగాణ నీటిపారుదల రంగంలో అద్భుత విజయాలు సాధించింది.  ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. చెరువులు పునరుద్ధరించింది. ఫలితంగా సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతున్నది. సాగునీటి లభ్యత పెరిగి, పంటలు పుష్కలంగా పండుతున్నాయి. ఆయకట్టు పెరుగుతున్నది. వ్యవసాయం విస్తరించింది. మొన్నటి యాసంగిలో తాము సేకరించిన ధాన్యంలో తెలంగాణ నుంచే దాదాపు 55శాతం వచ్చిందని స్వయంగా ఎఫ్‌సీఐ ప్రకటించడం తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో సాధించిన పురోగతికి ఒక నిదర్శనం. తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్నది. వ్యవసాయానికి ప్రాణాధారం సాగునీరు. అందుకే రాష్ట్రంలో సాగునీటిరంగానికి ప్రాధాన్యం పెరిగింది. సాగునీటిశాఖ ప్రాధాన్యాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్‌.. ఆ శాఖను పునర్వ్యవస్థీకరించి, మరింత బలోపేతం చేయాలని సంకల్పించారు. 

చిలువలు పలువలుగా..

ప్రస్తుతం నీటిపారుదలశాఖ భారీ, మధ్యతరహా, చిన్నతరహా, ఐడీసీ, ప్రాజెక్టులు, ప్యాకేజీలు పేరుతో విభజించడంతో చిలువలు, పలువలుగా ఉన్నది. వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని, తద్వారా పర్యవేక్షణ పటిష్టంగా ఉంటుందని సీఎం కేసీఆర్‌ భావించారు. నీటిపారుదలశాఖను 15-20 ప్రాదేశిక విభాగాలుగా మార్చి.. ఒక్కో దానికి ఒక్కో సీఈని ఇంచార్జిగా నియమించాలని నిర్ణయించారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, లిఫ్టులు, కాలువలు, చెరువులు, చెక్‌డ్యాములు మొత్తం ఈ సీఈల పరిధిలోనే ఉంటాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్‌ రెండురోజులపాటు నీటిపారుదలశాఖ పునర్వ్యవస్థీకరణపై వర్క్‌షాపు నిర్వహించి ముసాయిదాను తయారుచేశారు. దీనిని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పిస్తారు. ఈ ముసాయిదాపై సమీక్షలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. సమీక్షలో నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి, సీఎం కార్యదర్శి, ఈఎన్సీలు, సీఈలు పాల్గొంటారు.

తెలంగాణ వైభవానికి ప్రతీకగా సచివాలయం

సెక్రటేరియట్‌ నూతన భవన నిర్మాణంపై మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్‌ తెలంగాణ ప్రతిష్ఠ, వైభవానికి ప్రతీకగా ఉండాలని భావించిన సీఎం కేసీఆర్‌ ఇందుకు సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు. మంగళవారం వీటిపై సమీక్షించనున్నారు. సెక్రటేరియట్‌ బాహ్యరూపం ఎలాఉండాలి? లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చిస్తారు. తర్వాత మంత్రివర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. టెండర్లు పిలిచి కొత్త భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారు. రోడ్లు భవనాలశాఖ సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ముఖ్యకార్యదర్శి, ఇంజినీరింగ్‌ అధికారులు, తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్‌, పొన్ని తదితరులు పాల్గొంటారు.


logo