గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 03, 2020 , 02:43:49

60 ఏండ్ల ఆరాటం ఈ నీళ్ల కోసమే

60 ఏండ్ల ఆరాటం ఈ నీళ్ల కోసమే

  • ఆటలు ఆపండి.. నదుల్లో వాటాలు తేల్చండి.. 
  • సీఎం డిమాండ్‌.. కేంద్రానికి 14 పేజీల లేఖ


శ్రీ గజేంద్రసింగ్‌ షెకావత్‌ గారికి,

నదీజలాల వివాదాలపై చర్చించేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీజలాలకు సంబంధించి కొన్ని అంశాలను లేవనెత్తాలనుకుంటున్నాను.

1. కృష్ణా నది

ఏ. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి చేసుకుంటున్న కృష్ణా జలాల పంపకాల్లో తెలంగాణకు చాలా సందర్భాల్లో అన్యాయం జరిగింది. 

బీ. కృష్ణా నదీజలాల పంపకంలో తెలంగాణ వాటా ఏంటో కచ్చితంగా తెలుసుకునే హక్కు, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు. 

సీ. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తూ, దాని సామర్థ్యాన్ని పెంచుతూ తెలంగాణ హక్కులను కాలరాస్తున్నది. 


2.గోదావరి నది

డీ. గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం చెప్పడం గురించి.

మా నీళ్లు మేం దక్కించుకోవటం కోసం 60 ఏండ్లపాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. నీటి వాటాలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది. 54.4 టీఎంసీల నీటి వినియోగానికి ఉపయోగపడే అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టు, 100.7 టీఎంసీల భీమా ప్రాజెక్టు, 19.2 టీఎంసీల తుంగభద్ర లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ను రద్దుచేశారు. నాగార్జునసాగర్‌ డ్యామ్‌ను ఎల్లేశ్వరం నుంచి నందికొండకు 19 కిలోమీటర్ల కిందకి జరిపి తెలంగాణకు అన్యాయం చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని బచావత్‌ ట్రిబ్యునల్‌ కూడా లేవనెత్తింది. ‘కృష్ణానదిలో ప్రవహిస్తున్న జలాలను సరిపడా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలి. అదనపు జలాలు వాడుకోవచ్చు. ఇందులో తెలంగాణ ప్రాంతానికి కూడా వాటా ఉంటుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉండే సాగు ప్రాంతానికి నీళ్లు అందాలి. ఈ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలివేయడానికి వీల్లేదు’ అని ట్రిబ్యునల్‌ పేర్కొన్నది. అయితే, తెలంగాణ ఏర్పడి ఏడేండ్లు గడుస్తున్నా రాష్ర్టానికి దక్కాల్సిన వాటా దక్కలేదు. 

కృష్ణా నదీజలాల పంపకంలో తెలంగాణ వాటా ఎంత?

సరిపడా నీళ్లు లేక దశాబ్దాల పాటు తెలంగాణ ఇబ్బందులు ఎదుర్కొన్నది. అందువల్ల కృష్ణానదీ జలాలను సమానంగా పంచాలని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ కొన్ని రోజులకే 2014 జూలై 14న కేంద్ర జలవనరుల శాఖకు లేఖ రాసింది. ఆ తర్వాత పలు సందర్భాల్లోనూ ఈ అంశాన్ని కేంద్రం వద్ద లేవనెత్తాం. 2018 డిసెంబర్‌ 26న నేనే స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాశాను. ఇద్దరం వ్యక్తిగతంగా కలుసుకున్న సందర్భాల్లోనూ దీని గురించి మాట్లాడాను. ఏడేండ్లు గడుస్తున్నా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తెలియరాలేదు. ఎందుకిలా? తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కాలయాపన చేయడానికి గల కారణం ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కేంద్రాన్ని మళ్లీ కోరుతున్నాం.

పోతిరెడ్డిపాడు అక్రమం.. దారుణం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తూ, దాని సామర్థ్యాన్ని పెంచుతూ తెలంగాణ హక్కులను కాలరాస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథ కం పేరిట పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, కాల్వలను విస్తరించడంపై తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అసలు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అనేదే అక్రమం. దానికి ఎలాంటి నీటి కేటాయింపులుగానీ, చట్టబద్దమైన సంస్థల నుంచి అనుమతులుగానీ లేవు. అవతల బేసిన్‌కు కృష్ణాజలాలను తరలించడమే దాని లక్ష్యం. వాస్తవంగా కృష్ణా నది ద్వారా తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు తాగు, సాగునీటి అవసరాలు తీరాలి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు తాగునీటిలో ఫ్లోరైడ్‌ పరిమాణం ఎక్కువై అల్లాడిపోతున్నాయి. మొదట కృష్ణా బేసిన్‌లోని నీటి అవసరాలు తీరాలని బచావత్‌ ట్రిబ్యునల్‌ తన అవార్డులో ఉద్ఘాటించింది. 

బచావత్‌ అవార్డులోని పేజీ నంబరు 127 ప్రకారం.. 

‘ఒక నదీ బేసిన్‌లోని భూములకు సాగునీరు అంది.. అక్కడి పూర్తి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే మిగులుజలాలను అవసరమైతే అవతలి బేసిన్లకు తరలించాలి. నదీ బేసిన్‌లోని అవసరాలను విస్మరించి.. జలాలను అవతలి బేసిన్‌కు తరలించడమనేది అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తుంది.’

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏ ఒక్క చట్టబద్ధమైన సంస్థ అనుమతి లేదు. అయినా పెన్నా, దాని పొరుగు బేసిన్లకు కృష్ణాజలాలను తరలించేందుకు శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున కృష్ణాజలాల్ని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపడుతున్నది. ఈ మేరకు ఈ ఏడాది మే 5న జీవో 203తో పాలనా అనుమతులు ఇచ్చింది. టెండర్ల ప్రక్రియను ముగించేందుకు దూకుడుగా ముందుకుపోతున్న తరుణంలో తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేయగా.. టెండర్లపై ముందుకు పోవద్దని కృష్ణాబోర్డు ఏపీని ఆదేశించింది. దీంతోపాటు కృష్ణాజలాలను పెన్నా బేసిన్‌కు తరలించేందుకుగాను అనేక కాల్వలు, రిజర్వాయర్ల విస్తరణ పనుల కోసం రూ.24వేల కోట్ల మేర పాలనా అనుమతులు కూడా ఇచ్చింది. 

1500 క్యూసెక్కుల నుంచి.. 44వేల క్యూసెక్కులకు..

చెన్నై నగరానికి 1500 క్యూసెక్కుల నీటిని అందించేందుకు వీలుగా ‘పోతిరెడ్డిపాడు’కు అనుమతి ఇచ్చారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాల్ని పణంగా పెట్టిన అప్పటి సమైక్య పాలకులు ఏకంగా 11,150 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో కాల్వ నిర్మాణాన్ని చేపట్టారు. ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచారు. ప్రస్తుతం ఈ అంశం బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ ముందు పెండింగులో ఉన్నందున ఎలాంటి ముందస్తు అనుమతులు కూడా ఉండవు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవాహ సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచి అవతలి బేసిన్లకు కృష్ణాజలాల్ని తరలించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం 44వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఉన్న పోతిరెడ్డిపాడు ద్వారానే 2019-20 నీటి సంవత్సరంలో 179 టీఎంసీల కృష్ణాజలాల్ని అవతలి బేసిన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు అంగీకరిస్తే.. కృష్ణా బేసిన్‌లోనే ఉన్న తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులకు చుక్క నీరు మిగలదు. కనీసం దేశంలోనే మెగా మెట్రోపాలిటన్‌ నగరమైన హైదరాబాద్‌కు కూడా మంచినీళ్లు దొరకవు. ఈ నేపథ్యంలో అవతలి బేసిన్‌కు కృష్ణాజలాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టనున్న ఈ అక్రమ ప్రాజెక్టును వెంటనే నిలుపుదల చేసేలా ఆదేశాలు జారీ చేయండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే అనేక ప్రాజెక్టులకు అనుమతులు కూడా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌, ఇతర కాల్వల విస్తరణ పనులను వెంటనే నిలుపుదల చేయించాలి.

చేష్టలుడిగిన కృష్ణాబోర్డు

ఇక నేను మీ దృష్టికి కృష్ణా నది యాజమాన్య బోర్డు నిష్క్రియాపరత్వం గురించి చెప్పదల్చుకున్నా. రెగ్యులేటరీ బోర్డుగా ఉన్న ఈ సంస్థ తరచూ అనేక అంశాల్లో విఫలమయింది. బేసిన్‌లో లేని ప్రాంతాలకు కృష్ణానది నీటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరలించుకొని వెళ్లింది. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాల పనులను చేపట్టారని, వీటిని నిలుపుదల చేసేలా చూడాలని 2020 ఫిబ్రవరిలోనే కేఆర్‌ఎంబీ దృష్టికి మేం తీసుకువచ్చాం. కానీ, కృష్ణానది యాజమాన్య బోర్డు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయా పనులకు టెండర్లు పిలువకుండా నిలువరించలేకపోయింది. ఇక పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇష్టారీతిన నీళ్లను మళ్లించుకొని వెళ్లినా కేఆర్‌ఎంబీ ప్రేక్షకపాత్ర పోషించింది. నీళ్లను అక్రమంగా మళ్లించుకుంటున్నారని మేం అనేక ఫిర్యాదులు ఇచ్చాం. వేటిపైనా కేఆర్‌ఎంబీ నుంచి సరైన స్పందన కనిపించలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశకాలను పాటించి టెలిమెట్రీ విధానాన్ని ఏర్పాటు చేయాల్సింది. దీనిపై 2016లో కేంద్ర జలవనరుల శాఖ (ఎంవోడబ్ల్యూఆర్‌) కార్యదర్శి నేతృత్వంలోని హైలెవల్‌ కమిటీ సమావేశమై మూడునెలల్లోనే టెలిమెట్రీని ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ, ఈ రోజు వరకు అక్రమంగా తరలించుకొని వెళ్తున్న నీటికి లెక్కలు తీయలేదు. టెలిమెట్రీ విధానాన్ని ఏర్పాటు చేయలేదు. ఇక శ్రీశైలం ఎడమకాల్వపై ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి నీటి విడుదలను కూడా ఆపాలంటూ కేఆర్‌ఎంబీ సూచిస్తూ లేఖ రాయడంతో దిగ్భ్రాంతికి గురయ్యాం. కేఆర్‌ఎంబీ ఇచ్చిన లేఖ ప్రతిని కూడా నా ఈ లేఖతో జత చేస్తున్నాను. శ్రీశైలం ప్రాజెక్టు హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు అన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. బచావత్‌ ట్రిబ్యునల్‌లో ఇక్కడ 33 టీఎంసీల నీళ్లు ఆవిరి నష్టాలకు గురయ్యే అవకాశం (ఎవాపరేషన్‌ లాసెస్‌) ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు నీళ్లు వెళ్లే క్రమంలో హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులో విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటాం. ఇక్కడి నీటి ద్వారా ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు స్థానికంగా కోటి మంది ప్రజల దాహార్తిని తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచే హైదరాబాద్‌కు కూడా తాగునీటి సరఫరా జరుగుతుంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీళ్లను వాడుకుంటే పట్టించుకోని కేఆర్‌ఎంబీ.. తెలంగాణలో పంటల సాగు నడిమధ్యన ఉన్న సమయంలో విద్యుత్‌ ఉత్పత్తికి నీళ్లను ఇవ్వకపోగా, విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయాలని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. 

శ్రీశైలం నిర్వహణ మాకే ఇవ్వండి

 ఇక గతంలో చేసిన నిర్వహణపరమైన ఏర్పాటులో భాగంగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించారు. వీటిపై కేఆర్‌ఎంబీ ఎప్పటికప్పుడు సమర్ధంగా పర్యవేక్షించాల్సి ఉన్నది. కానీ, కేఆర్‌ఎంబీ ఘోరంగా విఫలం కావడాన్ని ఆంధ్రప్రదేశ్‌ తనకు అనుకూలంగా మలుచుకున్నది. ఇక ఇదే అదనుగా భావించి పోతిరెడ్డిపాడు నుంచి పెద్ద ఎత్తున నీటిని మళ్లించుకున్నది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను కూడా తెలంగాణకే అప్పగించాలని కోరుతున్నాం. 

చట్టంలో ఉన్నా పట్టించుకోరా?

ఇక కేంద్ర ప్రభుత్వం చేష్టలుడిగిన తీరుతో తెలంగాణకు మరో అన్యాయం కూడా జరిగింది. రాష్ట్ర పునర్విభజన చట్టం -2014లోని సెక్షన్‌ 89 ప్రకారం కేడబ్ల్యూడీటీ-2 ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరుపాల్సి ఉంటుంది. నీటి ప్రవాహం తక్కువ ఉన్న సందర్భాల్లో  ఎలా వ్యవహరించాలన్నదానిపై కూడా విధానం ఉండాలి. అయితే, కేడబ్ల్యూడీటీ-2 నియమ నిబంధనల ప్రకారం తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ మధ్య నీటి పునఃకేటాయింపులకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో 19.10.2016 కేడబ్ల్యూడీటీ-2 ఇచ్చిన తీర్పులో తెలంగాణకు నీటి కేటాయింపుల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించవచ్చని, కేంద్ర ప్రభుత్వం 1956 అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం ప్రకారం చేసే అవకాశం ఉన్నది. తెలంగాణ ఇచ్చిన ఫిర్యాదులపై కేంద్రం స్పందించి ఉంటే నీటి పంపకాల సమస్య ఈ సమయానికి పరిష్కారమయ్యేదే. కానీ, దురదృష్టం. కేంద్రం తగురీతిలో స్పందించలేదు. సెక్షన్‌ 3 ప్రకారం పరిశీలించాలని ట్రిబ్యునల్‌కు కేంద్రం చెప్పలేదు. దీంతో ఇప్పటికీ సమస్య అలాగే ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల మధ్య నీటి పంపిణీని ట్రిబ్యునల్‌ ఇప్పటికీ చేయలేదు.. అలాగే ఆపరేషనల్‌ ప్రొటోకాల్‌ను కూడా నిర్దేశించలేదు. వీటిని పూర్తిచేసిన తర్వాతనే నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై మాట్లాడగలం. ఇప్పుడు నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై చర్చించడం అపరిపక్వమైనది, అర్థంలేనిది అవుతుంది.

ఏపీ అభ్యంతరాలన్నీ అసత్యాలే..

గోదావరి బేసిన్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏడు ప్రాజెక్టులు నిర్మిస్తున్నదంటూ ఏపీ అభ్యంతరం చెప్తున్నదని మీరు రాసిన లేఖలో పేర్కొన్నారు. అవన్నీ అసత్యాలు. ఆ ప్రాజెక్టుల డిజైన్‌, నిర్మాణం ఉమ్మడి ఏపీ హయాంలోనే 2014కు ముందే జరిగింది.  పరిపాలన, సాంకేతిక అనుమతులు, నీటి కేటాయింపులు, కాంట్రాక్టు అప్పగింత, భూ సేకరణ వంటివన్నీ ఉమ్మడి ఏపీ హయాంలోనే జరిగాయి. తెలంగాణ ఏర్పడకముందే రూ.15వేల కోట్ల నుంచి రూ.20వేల కోట్ల మేర వ్యయం సైతం చేశారు. ఉదాహరణకు గోదావరి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు (జీఎల్‌ఐఎస్‌) 2001లో జీవో-461 ద్వారా పాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి. 2014 నాటికి రూ.7292 కోట్ల మేర ఖర్చు చేశారు. జీఎల్‌ఐఎస్‌లో భాగమైన కంతనపల్లి ప్రాజెక్ట్‌ డిజైన్‌ ప్రకారం 17 గిరిజన గ్రామాలకు చెందిన 11,408 ఎకరాల భూమి ముంపునకు గురవుతుండటంతో ప్రాజెక్టును 20 కిలోమీటర్ల మేర పైకి తుపాకులగూడెం వరకు జరిపారు. గిరిజనుల గౌరవార్థం ఈ ప్రాజెక్టుకు సమ్మక్క సాగర్‌గా పేరు మార్చాం. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం దీనిని కొత్త ప్రాజెక్టుగా పేర్కొనడం హాస్యాస్పదం. అదేవిధంగా ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కింద మహారాష్ట్రలో ముంపు ప్రాంతాలను తగ్గించేందుకు, కేంద్ర జల సంఘం సూచన ప్రకారం రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు, తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీడిజైనింగ్‌ చేశాం. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని దీనికి కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చాం.  కేంద్ర జలవనరుల శాఖ సైతం కాళేశ్వరం ప్రాజెక్టు పాతదేనని స్పష్టం చేసింది. అదేవిధంగా 2005లో జీవో-249 కింద మంజూరైన రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టులను కలిపి సీతారామ ప్రాజెక్టును నిర్మించాం. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇందిరాసాగర్‌ హెడ్‌వర్క్‌ పనులు పోలవరం ప్రాజెక్టు పరిధిలోకి వెళ్లాయి. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలుపడంతో ఈ ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టులో ఎక్కువ భాగం ఏపీకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రీడిజైన్‌ చేసి ఏర్పాటు చేసిన సీతారామ ప్రాజెక్టుకు జలసంఘం అనుమతులు కూడా వచ్చాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఉమ్మడి ఏపీలోనే మొదలయ్యాయి. సీతారామ ప్రాజెక్టుకు కేటాయించిన జలాలు బేసిన్‌లోని తెలంగాణ వాటా నుంచే వినియోగిస్తున్నాం. కాబట్టి ఈ ఏడు ప్రాజెక్టులపై ఏవేవో ఊహించుకొని కొత్త ప్రాజెక్టులుగా పేర్కొనడం సరికాదు. 

దృష్టి మళ్లించే ఎత్తుగడ..

కాళేశ్వరం ప్రాజెక్టును నాతోపాటు మహారాష్ట, ఏపీ ముఖ్యమంత్రులు, ఉమ్మడి ఏపీ గవర్నర్‌ కలిసి 2019 జూన్‌ 21న ప్రారంభించాం. ఆ సమయంలో రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే పనుల్లో 95% పూర్తయ్యాయి. ప్రాజెక్టు ప్రాంతంలో నీటి లభ్యత ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టును రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే విధంగా నిర్మించాం.  ఈ విషయం మొదటి నుంచీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పేరుతో చేస్తున్న అక్రమ పనుల నుంచి దృష్టిని మరల్చేందుకు అనవసరంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై గాయిగాయి చేస్తున్నది.

రాష్ట్రంలో గోదావరీ జలాల వినియోగానికి సంబంధించి 2014 ఫిబ్రవరిలో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రాజెక్టులవారీగా స్పష్టమైన ప్రకటన చేశారు. తెలంగాణలోని ప్రాజెక్టులకు 967.94 టీఎంసీలు, ఏపీ ప్రాజెక్టులకు 518.215 టీఎంసీలు కేటాయిస్తున్నట్టు తెలిపారు. గోదావరి బేసిన్‌లో 1486.155 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంటుందన్న అంచనాల ప్రకారం ఈ విభజన జరిగింది. గోదావరి నది జలాల్లో 80% తెలంగాణలోనే పోగవుతున్నా (క్యాచ్‌మెంట్‌) కేటాయింపులు మాత్రం 65.13% మాత్రమే జరిగాయి. గోదావరి జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌ (జీడబ్ల్యూడీటీ) ఏ పాయింట్‌లో ఎంత నీటిని వినియోగించుకోవచ్చో స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల ప్రకారం..సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ)కు చెందిన 53 సంవత్సరాల గేజ్‌ రికార్డుల ప్రకారం గోదావరి నదిపై చిట్టచివరగా ఏర్పాటు చేసిన గేజ్‌ స్టేషన్‌ ఆధారంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ర్టాలు వాడుకున్న తర్వాత కూడా గోదావరి నది నుంచి 3000 టీఎంసీల జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయనేది గుర్తించడం చాలా ప్రాధాన్యం కలిగిన అంశం. గతంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గోదావరి నదీ జలాల్లో 65.13 శాతం నీటిని తెలంగాణ ప్రాంతానికి కేటాయించింది. ప్రతి ఏటా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల నీటినికూడా నిర్ణీత నిష్పత్తిలో (ప్రో-రాటా పద్ధతిలో) ఉపయోగించుకునే అవకాశంకూడా ఉన్నది. ప్రస్తుతం కేటాయించిన 967.15 టీఎంసీలతో పోల్చుకుంటే.. సాగుకు, పరిశ్రమలకు, తాగునీటి కోసం తెలంగాణ మొత్తంగా 1950 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. మెగా-మెట్రో సిటీ అయిన హైదరాబాద్‌లో సుమారు కోటికిపైగా జనాభా ఉంది. ఇందులో 30 నుంచి 40 లక్షల మంది వలస కూలీలే ఉన్నారు. వీరందరి అవసరాలను తీర్చేందుకు ఈ అదనపు జలాలు కావాలి. ఐటీ, ఫార్మా లాంటి పరిశ్రమలతోపాటు పట్టణ సముదాయాలుగా ఉన్న హైదరాబాద్‌ నగరం అవసరాలుకూడా గణనీయంగా పెరుగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర డిమాండ్లు

14. ఈ లేఖలో నీటి కేటాయింపునకు సంబంధించి లేవనెత్తిన అంశాలన్నింటినీ త్వరలో జరుగనున్న 2వ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో అజెండా అంశాలుగా చేర్చాలని కోరుతున్నాను. దీనితోపాటు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్‌ విస్తరణ పనులు, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను ఆపివేయాలని ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని కోరుతున్నాను. దీనిని పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా శ్రీశైలం రిజర్వాయర్‌ నిర్వహణ, యాజమాన్య బాధ్యతలను వెంటనే తెలంగాణకు అప్పగించాలని కోరుతున్నాను.

15. తెలంగాణ ఆరు దశాబ్దాలుగా న్యాయంగా, సమానంగా దక్కాల్సిన జలాల కోసం పోరాడింది. కానీ కేంద్ర ప్రభుత్వం నిస్తేజంగా వ్యవహరించడంతో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గడిచిన ఏండేండ్లుగా ఆ జలాలను మేము కోల్పోవాల్సి వచ్చింది. రెండు రాష్ర్టాల మధ్య అర్థంలేని జల వివాదాలను సుదీర్ఘకాలంపాటు సాగనీయకుండా.. ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం కృష్ణానది జలాలను సమానంగా, స్పష్టంగా కేటాయించేలా ప్రస్తుత ట్రిబ్యునల్‌కు సూచనలు, నిబంధనలు (టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌) చేస్తారని మనవి చేస్తున్నాను. దీనివల్ల రెండు రాష్ర్టాలు మరింత నష్టపోకుండా ఉంటాయి.