శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 02:36:39

ఉస్మానియాను మళ్లీ కట్టాలి

ఉస్మానియాను మళ్లీ కట్టాలి

  • వైద్య సంఘాలదీ అదే మాట
  • కొత్త భవనాల నిర్మాణం దిశగా సర్కారు సమాలోచన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రెండురోజుల వానతో ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా దవాఖాన డొల్ల బయటపడింది. భవనానికి మరమ్మతులు కూడా దండుగేననే విషయం తేటతెల్లమైంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలతోపాటు ప్రతిపక్షాలు, మేధావులు, వైద్యసంఘాలు సైతం గ్రహించినట్టుగా తెలుస్తున్నది. హెరిటేజ్‌ భవనం అనే కారణంతో కూల్చొద్దని గతంలో నానా యాగీచేసిన ప్రతిపక్షాలు సైతం మెత్తబడినట్టు మౌనంగా ఉండటాన్ని బట్టి అవగతమవుతున్నది. ప్రస్తు తం భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, తరచూ పెచ్చులూడి ప్రమాదకరంగా మారిందని వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి భవనంలో చికిత్సలు అందించలేమని పేర్కొంటూ.. ఉస్మానియా వైద్యసిబ్బంది వందరోజులపాటు ఆందోళన నిర్వహించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే మొద టి, రెండో అంతస్థును ఖాళీచేశామని, గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే రోగులకు చికిత్స అందిస్తున్నామని చెప్తున్నారు. ‘ఇటీవలి వానకు వార్డుల్లోకి మోకాల్లోతు మురుగునీరు చేరింది. పడకలపై ఉన్న రోగుల వద్దకు వెళ్లి వైద్యం అందించలేని స్థితికి చేరుకున్నాం. ఇలాంటి సమయంలో పెద్దవర్షాలు కురిస్తే భవనం పెచ్చులూడి పడే ప్రమాదం పొంచి ఉన్నది. ఇవి ఎవరిమీదైనా పడి ప్రాణాలు కోల్పోతే బాధ్యలు ఎవరు?’ అని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. అందుకే కొత్త నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ఈ మేరకు తెలంగాణ మెడికల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, తెలంగాణ డాక్టర్ల అసోసియేషన్‌సహా ఇతర సం ఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తున్నాయి. వైద్యసంఘాలు, సామాజికవేత్తలు ఉస్మానియా ప్రాంగణంలో కొత్త బిల్డింగ్‌ నిర్మించాలని కోరుతుండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తున్నది. పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా తాత్కాలిక చర్యలను ఇప్పటికే చేపట్టింది. మరోవైపు ప్రతిపక్షాలు సైతం కొత్త బిల్డింగ్‌ నిర్మాణానికి మౌనంగా మద్దతు తెలుపుతుండటంతో తదుపరి చర్యల గురించి సర్కారు ఆలోచిస్తున్నది. ఇప్పుడున్న వార్డులను తరలించి కొత్త బిల్డింగ్‌ నిర్మాణం చేపట్టడం తదితర అంశాలపై వైద్యాధికారులతో చర్చలు జరుపుతున్నది. అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి

వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల 

హైటెక్‌ యు గంలో పురాతన కట్టడాల పేరుతో ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. ఉస్మానియా దవాఖాన స్థానంలో కొత్త నిర్మాణం సత్వరం చేపట్టాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్‌ సరైన నిర్ణ యం తీసుకుంటారు.

ఒకప్పటి గోల్సావాడీ బస్తీ 

నిజాం నసీరుద్దౌలా బ్రిటిష్‌ వైద్యచికిత్సలుచేసే దవాఖానను హైదరాబాద్‌లో ఏర్పాటుకు తొలుత సంకల్పించారు. మూసీనది ఆనుకొని ఉండే గోల్సావాడీ బస్తీలో దానిఏర్పాటుకు నిర్ణయించారు. 1866నాటికి అప్జల్‌గంజ్‌ దవాఖానగా వైద్యసేవలు ప్రారంభించింది. అప్పటివరకు కంటోన్మెంట్‌లోని బ్రిటిష్‌ సైనికులకు మాత్రమే అందిన వైద్యసేవలు సామాన్యులకు చేరువయ్యాయి. 1908లో వచ్చిన మూసీ వరదల్లో దవాఖాన తీవ్రంగా దెబ్బతిన్నది. మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ అప్జల్‌గంజ్‌ దవాఖానను 27 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పుడున్న భవనాన్ని నిర్మించారు.  


logo