గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 03:12:41

ఒక్కో సీఎం.. ఒక్కో బ్లాక్‌..!

ఒక్కో సీఎం.. ఒక్కో బ్లాక్‌..!

  • అవసరాలకనుగుణంగా మారిన పాత సెక్రటేరియట్‌ భవనం
  • 132 ఏండ్లలో పది బ్లాకుల నిర్మాణం.. పార్కింగ్‌, టాయిలెట్‌ సమస్యే
  • ఆధునికహంగులతో సమీకృత సచివాలయం నిర్మాణానికి సన్నాహాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిర్మాణపరంగా చూస్తే పాత సచివాలయానికి 132 ఏండ్ల చరిత్ర. కానీ, దాని ప్రాంగణంలోఉన్న భవనాలు ఒకేసారి నిర్మించినవి కావు.. ఒక్కరే కట్టినవీ కావు. ఒక్కో సీఎం ఒక్కో బ్లాక్‌కు శంకుస్థాపన చేశారు. ఒకరు శంకుస్థాపన చేసిన బ్లాకులను మరో సీఎం ప్రారంభించారు. 25 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ప్రాంగణంలో 10 లక్షల చదరపు అడుగుల్లో మొత్తం 10 బ్లాకులు నిర్మాణమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులతో కలుపుకొని మొత్తం 16 మంది సీఎంలు ఈ సచివాలయం నుంచి పరిపాలన కొనసాగించారు.

అతి పురాతన బ్లాక్‌ సర్వహిత

పాత సచివాలయంలో అతిపురాతనమైన ‘జీ’ బ్లాక్‌ (సర్వహిత)ను 1888లో 6వ నిజాం హయాంలో నిర్మించారు. సీఎంలు కొలువుదీరిన ‘సీ’ బ్లాక్‌ను 1978లో నాటి సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. మొత్తం ఆరు అంతస్తులున్న ఈ బ్లాక్‌లోనే సీఎం చాంబర్లు ఉండేవి. ‘ఏ’ బ్లాక్‌ భవన సముదాయాన్ని 1981లో నాటి సీఎం టీ అంజయ్య ప్రారంభించారు. మొన్నటివరకు ఏపీ ఆధీనంలోఉన్న ‘జే’ ‘ఎల్‌' బ్లాక్‌లను మర్రి చెన్నారెడ్డి 1990 నవంబర్‌ 12న ప్రారంభించారు. ‘జే’ బ్లాక్‌ సచివాలయం నిర్మాణాలన్నింటిలోనూ అతిపెద్ద బ్లాక్‌. ‘ఏ’ బ్లాక్‌ ఫేజ్‌-2ను 1998 ఆగస్టు 10న చంద్రబాబు ప్రారంభించారు. అలాగే ‘డీ’ బ్లాక్‌కు 2003లో చంద్రబాబు శంకుస్థాపన చేయగా.. 2004లో వైఎస్‌ఆర్‌ ప్రారంభించారు. 

అడ్డదిడ్డం.. ఇష్టారాజ్యం

పాత సచివాలయంలో బ్లాకులన్నింటినీ అడ్డదిడ్డంగా నిర్మించారు. ముఖ్యమంత్రులు ఎవరైనా తమకు నచ్చినట్టుగా, ఇష్టారాజ్యంగా నిర్మించారు. అధికారులు, ప్రజలు, సందర్శకుల సౌకర్యం చూడకుండా ఒక్కోబ్లాకును ఒక్కోచోట నిర్మించారు. ఎవరికి నచ్చిన వాస్తును వారు అమలుచేశారు. సచివాలయం ప్రధానగేటునూ ఇష్టం వచ్చినట్టుగా మార్చారు. ఒకరు తెలుగుతల్లి ఫ్లైఓవర్‌వైపు ప్రధాన గేటు పెడితే.. మరొకరు దానిని మూసివేసి హుస్సేన్‌సాగర్‌వైపు తెరిచారు. అంతకుముందు ఎన్టీయార్‌ గార్డెన్‌ వైపు గేటు ఉండేది. పైగా మంత్రి కార్యాలయం ఒక బ్లాక్‌లో ఉంటే.. ప్రిన్సిపల్‌ సెక్రటరీ మరో బ్లాక్‌లో లేదా మరో ఫ్లోర్‌లో ఉండేవారు. ఇక ఎస్‌వోలు.. సెక్రటరీలు, జాయింట్‌, అసిస్టెంట్‌ సెక్రటరీలు ఎక్కడ ఉంటారో తెలిసేది కాదు. ఒక్క ఫైలు కోసం అన్ని బ్లాకులూ తిరుగాల్సి వచ్చేది. ఒక సారూప్యత అంటూ లేకుండా నిర్మించిన బ్లాకులతో ప్రజలు, అధికారులు దశాబ్దాలపాటు ఇబ్బందులు పడ్డారు. క్రమపద్ధతిలో పార్కింగ్‌ లేదు. గ్రీనరీ మచ్చుకైనా కానరాదు. టాయిలెట్లు, క్యాంటీన్‌ సౌకర్యం లేదు. ముఖ్యంగా ఏపీకి కేటాయించిన భవనాలు సరైన పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరాయి. రాష్ట్ర ప్రధాన పరిపాలనా భవనమే తెలంగాణ స్వపరిపాలనకు మచ్చగా మారింది. 

సమీకృత సచివాలయం

పాత సచివాలయంలో ఉన్న సమస్యలను సరిచేసినా పరిష్కారం కానివిగా తయారయ్యాయి. ఒక సమస్యను పరిష్కరిస్తే మరొకటి పుట్టుకొచ్చేలా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అటు ప్రజలు, ఇటు అధికారులు, సిబ్బందికి అనువుగా ఉండేలా సమీకృత సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. పాత భవనాలన్నింటినీ కూల్చివేసి అదే ప్రాంగణంలో ఆధునిక హంగులతో కొత్త భవన నిర్మాణానికి పూనుకొన్నా రు. రూ.500 కోట్లతో, సుమారు 6 లక్షల చదరపు అడుగుల్లో సమీకృత సచివాలయం నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందులో శాఖలవారీగా కార్యాలయాలు ఉండనున్నాయి. మంత్రులు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ నుంచి సెక్రటరీ, జాయింట్‌, అసిస్టెంట్‌ సెక్రటరీలు, ఎస్‌వోలు, ఏఎస్‌వోలు, ఇతర స్టాఫ్‌ అంతా ఒకే సముదాయంగా ఉండేలా ఇందులో ఏర్పాట్లుచేయనున్నారు. logo