గురువారం 02 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 01:42:51

స్కూళ్లు ఇప్పుడే కాదు

స్కూళ్లు ఇప్పుడే కాదు

  • ఎలాంటి మార్గదర్శకాలివ్వలేదు
  • యథాతథంగా పది పరీక్షలు
  • విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభంపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ తెలిపారు. జూన్‌ 8 నుంచి జూలై 5 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నందున స్కూళ్లను ప్రారంభించే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టంచేశారు. జూలై ఒకటి నుంచి ఉన్నత పాఠశాలలు, ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు ప్రారంభమవుతాయని ఒక దినపత్రికలో వచ్చిన వార్తలను చిత్రారామచంద్రన్‌ ఖండించారు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. క్యాబినెట్‌ సబ్‌కమిటీ ఆమోదం లేకుండా పాఠశాలలను ప్రారంభించలేమని పేర్కొన్నారు. ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే విషయంలో కూడా విద్యాశాఖ ఎటువంటి ఆలోచన చేయడంలేదని స్పష్టంచేశారు. షెడ్యూలు ప్రకారం పదోతరగతి పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.  జూలై 10 నుంచి 15 వ తేదీల మధ్యలో స్కూళ్లను ప్రారంభిస్తే బాగుంటుందని ఇప్పటికే పలువురు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అభిప్రాయాలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర క్యాబినెట్‌ సబ్‌కమిటీలో స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి సంబంధించిన అన్ని విషయాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకొంటారు. 

తల్లిదండ్రుల్లో ఆందోళన

మరోవైపు కరోనా విషయంలో సాధారణ పరిస్థితులు వచ్చేదాక తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది. ముఖ్యంగా 1-5 తరగతుల విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు ఆందోళనచెందుతున్నారు. చిన్నారులకు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా నియంత్రిచడం కష్టసాధ్యమని చెప్తున్నారు. చిన్నారులు తరుచూ మాస్కులు వాడటం వల్ల వారిలో ఆక్సిజన్‌శాతం తగ్గుతుందని వైద్యులు కూడా ధ్రువీకరిస్తున్నారు. యాజమాన్యాలు నిబంధనలు పాటించినా చిన్నారులకు వైరస్‌ సోకకుండా అడ్డుకోవడం కష్టమంటున్నారు. ప్లే స్కూళ్లు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పాఠశాలలు అసలే ప్రారంభించవద్దని పలువురు సూచిస్తున్నారు. తమ పిల్లలకు ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు బోధించడానికి అంగీకరిస్తాం కానీ, స్కూళ్లకు పంపే ప్రసక్తే లేదని ఆయా తరగతుల చిన్నారుల తల్లిదండ్రులు చెప్తున్నారు. వైరస్‌ కేసులు విజృంభిస్తున్న ఈ సమయంలో 1-10 వరకు ఉన్న స్కూళ్లు ప్రారంభించకపోవడమే మేలని, స్కూళ్లకు జీరో ఇయర్‌చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

పది పరీక్షలు రద్దు చేయండి

జూన్‌ 8 నుంచి తిరిగి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు రద్దుచేయాలని, ఉపాధ్యాయసంఘాలు కోరుతున్నాయి. ఇంటర్నల్స్‌, సమ్మెటివ్‌, అసైన్‌మెంట్లు, ప్రీఫైనల్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులను కొలమానంగా తీసుకొని ఫలితాలు విడుదలచేయాలని సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ స్టడీస్‌ చైర్మన్‌ నాగటి నారాయణ, పీఆర్టీయూటీఎస్‌ రాష్ట్ర నాయకులు శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


logo