ఆదివారం 12 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 02:44:29

టిక్‌టాక్‌కు దీటుగా తెలంగాణ చట్‌పట్‌!

టిక్‌టాక్‌కు దీటుగా తెలంగాణ చట్‌పట్‌!

వికారాబాద్‌:  చైనా యాప్‌ టిక్‌టాక్‌కు దీటుగా తెలంగాణ యువకుడు ‘చట్‌పట్‌' యాప్‌ను రూపొందించారు. టిక్‌టాక్‌పై కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో చట్‌పట్‌కు కూడా ప్లేస్టోర్‌లో డిమాండ్‌ పెరిగింది. ఒక్కరోజులోనే వైరల్‌ అయిన ఈ యాప్‌ ప్లేస్టోర్‌ ట్రెండింగ్‌ సోషల్‌ క్యాటగిరీలో టాప్‌-10లో నిలిచింది. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండల కేంద్రానికి చెందిన నస్కంటి శ్రీనివాస్‌ చట్‌పట్‌ యాప్‌కు రూపకల్పన చేశారు. శ్రీనివాస్‌ ఇదివరకు ఏడు యాప్‌లను రూపొందించినప్పటికీ వాటికి సరైన స్పందన రాలేదు. అయినా నిరాశ చెందకుండా చట్‌పట్‌కు రూపకల్పన చేశారు. ఈ యాప్‌ జూన్‌ 29న ప్లేస్టోర్‌ వేదికపైకి వచ్చింది. మొదటిరోజే మూడువేల మందికి పైగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. సోషల్‌ విభాగం ట్రెండింగ్‌లో టాప్‌ 10లో చట్‌పట్‌ 9వ స్థానానికి చేరింది. వినియోగదారులు చట్‌పట్‌కు 4.9 రేటింగ్‌ ఇచ్చారు.


logo