గురువారం 04 జూన్ 2020
Telangana - May 05, 2020 , 10:42:40

నేడు క్యాబినెట్‌ భేటీ.. లాక్‌డౌన్‌పై నిర్ణయం

నేడు క్యాబినెట్‌ భేటీ.. లాక్‌డౌన్‌పై నిర్ణయం

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితి, లాక్‌డౌన్‌ అమలు, ఆర్థికపరంగా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించడానికి రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం సమావేశం కానున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నది. కేంద్రం మూడు దఫాలుగా విధించిన లాక్‌డౌన్‌ను చివరిసారిగా ఈ నెల 17వరకు పొడిగిస్తూ కొన్ని సడలింపులను ప్రకటించింది. కరోనా కేసులు లేని ప్రాంతాలలో మద్యం అమ్మకాలకు అనుమతినివ్వడంతోపాటు, పలు ఇతర రంగాలలో యథావిధిగా పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు అనుమతిస్తూ కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. రాష్ట్రంలో నెలన్నర రోజులకుపైగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ కరోనా విస్తరణకు కళ్లెం పడకపోగా ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు కరోనా రోగులకు పూర్తిస్థాయి చికిత్సనందిస్తూనే మరోవైపు వైరస్‌ విస్తరణను అరికట్టేందుకు కఠిన చర్యలు అమలుచేస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలపై చర్చించి లాక్‌డౌన్‌ కొనసాగింపుపై మంత్రివర్గంలో నిర్ణయించనున్నారు. త్వరలోనే రాష్ట్రంలో వానకాలం సీజన్‌ ప్రారంభం కానుండటంతో వ్యవసాయం పనులు మొదలు కానున్నాయి. ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానాన్ని ఈ సీజన్‌ నుంచే అమలుచేయాలని భావిస్తున్నది. వ్యవసాయ రంగంతోపాటు విద్యా సంవత్సరం ప్రారంభం, పరీక్షల నిర్వహణపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉన్నది.


logo