మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 12, 2020 , 16:37:03

రెండు వేల కోట్లతో 414 వంతెనలు నిర్మాణం

రెండు వేల కోట్లతో 414 వంతెనలు నిర్మాణం
  • - రోడ్ల బిల్లులు పెండింగ్‌లో లేవు
  • - అసెంబ్లీలో ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంతరెడ్డి వెల్లడి

హైదరాబాద్ : తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి దీటుగా వంతెనల నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. గత ఆరు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని వివిధ వాగులు, వంకలపై రూ.2,797 కోట్ల వ్యయంతో 414 వంతెనల నిర్మాణం చేపట్టగా అందులో రూ.1,700 కోట్ల వ్యయంతో 256 వంతెనలు ఈ సరికే పూర్తయ్యాయి. అసెంబ్లీలో బుధవారం  ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సంగతి వెల్లడించారు. రూ.11,257 కోట్ల అంచనా వ్యయంతో 7,554 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు ఆయన తెలిపారు. రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణకు రూ.3,146 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.1,868 కోట్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు. గత ఆరేళ్లలో మొత్తంగా రూ.16,800 కోట్లతో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయగా అందులో రూ.10,800 కోట్ల మేర రోజ్ల నిర్మాణం, మరమ్మత్తుల పనులు పూర్తయ్యాయని మంత్రి వివరంచారు.

ఈ రోడ్లపై గత ప్రభుత్వం తక్కువ ఎత్తులో నిర్మించిన వంతెనల కారణంగా వాగులు, వంకలు పొంగినప్పుడు రూకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందువల్ల ఎత్తయిన వంతెనలు కట్టాల్సి వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన రాయపట్నం, ఏటూరునాగారం, భద్రాచలంలోని మూడు పెద్ద వంతెనలను తమ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. కాగా 414 వంతెనల్లో 184 చోట్ల సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చెక్ డ్యాంలు నిర్మించామని చెప్పారు. రోడ్లతో పాటుగా వ్యవసాయానికి అండదండలు అందించాలన్న ఆశయంతో వీటిని చేపట్టామని అన్నారు. 130 చెక్ డ్యాంల పనులు పూర్తయ్యాయని తెలిపారు. సభ్యులు తమతమ నియోజకవర్గాలకు సంబంధించి వంతెనల కొరకు చేసిన అభ్యర్థనలను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు సరిగా చెల్లించడం లేదని కాంగ్రెస్ సభ్యుడు దుద్దిళ్ల శ్రీధర బాబు చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు రూ.50-60 కోట్లు మినగా మొత్త 1700 కోట్ల బిల్లుల చెల్లింపు పూర్తయిందని పేర్కొన్నారు.          


logo
>>>>>>