గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 15:47:15

ఈ నెలలోనే రైతు రుణమాఫీ చెక్కులు

ఈ నెలలోనే  రైతు రుణమాఫీ చెక్కులు

హైదరాబాద్‌:  తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి.  వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రైతు రుణమాఫీ అమలుపై హరీశ్‌ రావు బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 

ఆచరణకు సాధ్యమైన హామీలనే టీఆర్‌ఎస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో  ఇస్తూ వస్తున్నది. ఇచ్చిన హామీలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు అమలు చేస్తున్నది. అందులో రైతుల రుణమాఫీ ముఖ్యమైంది.  తెలంగాణ రైతులకు ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రైతు రుణమాఫీ చేస్తామని టీఆర్‌ఎస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రుణమాఫీ హామీ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నదన్నారు. 

25 వేల రూపాయల లోపు రుణాలున్న రైతులు రాష్ట్రంలో 5,83,916 మంది ఉన్నారు. వారందరి రుణాలను నూటికి నూరు శాతం ఒకే దఫా మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలలోనే రూ.25వేల లోపున్న రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వం రూ.1,198 కోట్లను విడుదల చేస్తుంది. రుణమాఫీ మొత్తాన్ని ప్రతీ రైతుకు వ్యక్తిగతంగా, చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రభుత్వం అందజేస్తుంది.

రూ.25వేల పైన రుణాలను..

ఇక రూ.25వేల నుంచి లక్షలోపు రైతుల రుణాల మొత్తం 24,738 కోట్లుగా ఉంది. వీటిని కూడా వ్యక్తిగతంగా, చెక్కుల రూపంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా నాలుగు విడతలుగా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఈ ఏడాది రైతు రుణమాఫీ కోసం 6,225 కోట్లను ప్రతిపాదించినట్లు మంత్రి పేర్కొన్నారు. 


logo