సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 09, 2020 , 02:55:55

హైదరాబాద్‌కు 10 వేల కోట్లు

హైదరాబాద్‌కు 10 వేల కోట్లు
  • ఐదేండ్లలో రూ.50 వేల కోట్లతో అభివృద్ధి
  • విశ్వనగరానికి మరిన్ని మెరుగులు
  • పట్టణాభివృద్ధికి రూ.14,809 కోట్లు కేటాయింపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచస్థాయి నగరాలకు దీటుగా హైదరాబాద్‌కు మరిన్ని సొబగులు అద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే అనేక ఐటీ సంస్థలు, పరిశ్రమలు ఇక్కడలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండటంతో మరిన్ని సౌకర్యాల కల్పనకు పూనుకొన్నది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించింది. ఇలా ఐదేండ్లపాటు రూ.50వేల కోట్లతో అభివృద్ధి పను లు చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్‌, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధితోపాటు మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు అమలుకు ఈ నిధులను కేటాయించింది. రాష్ట్ర రాజధానితోపాటు ఇతర పట్టణాల అభివృద్ధికి కూడా  భారీగా నిధులు ప్రకటించింది. 


గత బడ్జెట్‌లో పట్టణాభివృద్ధికి రూ.3,284 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.14,809 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ వ్యయం రూ.1,261.98 కోట్లు కాగా, ప్రగతిపద్దు నిమిత్తం రూ.13,546.97 కోట్లను ప్రకటించింది. పట్టణాల్లో పచ్చదనం పారిశుద్ధ్యం మెరుగుపర్చడానికి, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని అలవాటు చేయడానికి ప్రభుత్వం పట్టణప్రగతిని చేపట్టింది. పట్టణాల్లో ప్రజా మరుగుదొడ్లను ప్రభుత్వ స్థలాల్లోనే వీటిని మూడునెలల్లోపు నిర్మించాలని నిర్ణయించింది. ఘనవ్యర్థాల నిర్వహణను సమర్థంగా చేపట్టడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. 


పలు పట్టణాల్లో డంపింగ్‌ యార్డు కోసం స్థలాల గుర్తింపు పూర్తయ్యింది. సమీకృత మార్కెట్లు, పార్కులు, వీధి వ్యాపారులు, ఓపెన్‌ జిమ్‌లు, ఆటస్థలాల నిర్మాణం వంటివాటి కోసం ప్రతినెలా ప్రభుత్వం రూ.148 కోట్లను విడుదలచేస్తుంది. పట్టణ మిషన్‌ భగీరథ కింద 38 మున్సిపాలిటీల నిమిత్తం రూ.800 కోట్లను తాజా బడ్జెట్‌లో కేటాయించింది. హైదరాబాద్‌ను అంతర్జాతీయస్థాయి ఖ్యాతిని మెట్రో రైలు తీసుకొచ్చింది. ఈ క్రమంలో మెట్రో రైలుకు సంబంధించి పాత బస్తీలో మిగిలిన ఐదు కిలోమీటర్ల మార్గం త్వరలోనే పూర్తిచేయనున్నారు. రెండోదశలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్‌, బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌వరకు మెట్రోరైలు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.


ప్రభుత్వ నిబద్ధతకు అద్దం

  • సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో విశ్వనగరం స్థాయికి రాజధాని
  • హైదరాబాద్‌కు బడ్జెట్‌ కేటాయింపులపై మంత్రి కేటీఆర్‌ హర్షం


బడ్జెట్‌లో హైదరాబాద్‌ అభివృద్ధికి రూ. 10వేల కోట్లు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ నిబద్ధతకు కేటాయింపులు అద్దంపడుతున్నాయన్నారు. హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్ప న, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినందున నగరాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు. రానున్న ఐదేండ్లలో రూ.50వేల కోట్లు ఖర్చుచేయనున్నట్టు వెల్లడించారు. ప్రపంచం అబ్బురపడేలా కాళేశ్వరం వంటి అతి భారీ ప్రాజెక్టును స్వల్పకాలంలో పూర్తిచేసిన సీఎం నాయకత్వంలో హైదరాబాద్‌ వేగంగా విశ్వనగరం స్థాయికి చేరుకోగలదన్న ఆశాభావం వ్యక్తంచేశారు.


హైదరాబాద్‌ను ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలబెట్టే ప్రయత్నం నిరంతరం కొనసాగుతుందన్నారు. మొదటినుంచి హైదరాబాద్‌ అభివృద్ధికి కృషిచేస్తున్నట్టు వివరించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమం (ఎస్సార్డీపీ) కింద మౌలిక వసతుల కోసం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భాగంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ద్ద్రీని తగ్గించేలా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మించినట్టు పేర్కొన్నారు. రెండోదశ మెట్రోరైలు కోసం వేగంగా ప్రణాళికలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వ సహకారంతో అవి త్వరలోనే కార్యరూపం దాలుస్తాయన్న విశ్వాసం వ్యక్తంచేశారు.


logo