బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 02:31:04

పప్పు.. నూనె.. సిరిధాన్యం మన బ్రాండ్‌

పప్పు.. నూనె.. సిరిధాన్యం మన బ్రాండ్‌

  • రైతుకు లాభం.. కొనుగోలుదారులకు నాణ్యత
  • జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ కొత్త ఒరవడి
  • అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యవసాయ వర్సిటీ ఉత్పత్తులు
  • మార్కెట్లోకి పలు సరుకులు
  • త్వరలో మరింత విస్తృతంగా
  • ‘కార్తాగోల్డ్‌'గా కుసుమ నూనె
  • ప్రొపల్స్‌ బ్రాండ్‌గా కందిపప్పు
  • ‘మిల్లెట్‌ ప్లస్‌'గా చిరుధాన్యాలు 
  • జగిత్యాల, వరంగల్‌, పాలెంలో ఉత్పత్తి యూనిట్లకు ఏర్పాట్లు

మన ఉత్పత్తి.. మన బ్రాండ్‌.. మనం నిర్ణయించిన ధర. అంతర్జాతీయ నాణ్యత.. ఆహారం, ఆరోగ్య భద్రత.. మన వ్యవసాయ యూనివర్సిటీ కొత ఒరవడి ఇది. కార్పొరేట్‌ మార్కెట్‌ శక్తుల నియంత్రణ నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు విముక్తి కల్పించి.. అన్నదాతకు గిట్టుబాటు వచ్చేలా.. వినియోగదారుకు అందుబాటులో ఉండేలా ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ తానే ఉత్పత్తులను రూపొందించి నేరుగా మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నది. అకడమిక్‌ బోధనలకే పరిమితం కాకుండా.. అద్భుతమైన పరిశోధనలు చేస్తూనే.. పంట ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసి నేరుగా విక్రయిస్తూ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతుకు తన పంటను అమ్మబోతే అడవి.. వినియోగదారుకు ఆ పంటను కొనబోతే కొరివి. మన సమాజంలో ఉత్పత్తి చేసిన వాడు.. దాన్ని వినియోగించినవాడు.. ఇద్దరూ బాధితులే. చెమట చుక్క కూడా రాల్చకుండా ఉత్పత్తిని అటు నుంచి ఇటు చేరవేసే దళారి మాత్రం ధనవంతుడైపోతాడు. ఈ మార్కెట్‌ శక్తుల నుంచి అటు అన్నదాతను, ఇటు వినియోగదారులను బయటపడేయడానికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా.. వినియోగదారులకు సరసమైన ధరలకే వస్తువులు దొరికేలా కార్యాచరణకు పూనుకొన్నది.

రాష్ట్రంలో రైతులు పండించే పలు వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం, నూనెలు, పప్పులను ప్రాసెస్‌చేసి తనదైన బ్రాండ్ల ఉత్పత్తులతో పెద్ద ఎత్తున మార్కెట్లోకి ప్రవేశించబోతున్నది. రాజేంద్రనగర్‌ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ‘మిల్లెట్‌ ప్లస్‌' బ్రాండ్‌తో 20 రకాల చిరుధాన్యాల ఉత్పత్తులు, వికారాబాద్‌ జిల్లా తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ‘కార్తా గోల్డ్‌' బ్రాండ్‌తో ‘కోల్డ్‌ ప్రెస్డ్‌' కుసుమ నూనె,  ప్రొపల్స్‌ బ్రాండ్‌తో కందిపప్పును వ్యవసాయ వర్సిటీ విక్రయిస్తున్నది. ఇదే తరహాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం నుంచి వేరుశనగ (పల్లీలు), జగిత్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం  నుంచి పెసర్లు, మినుములను ప్రాసెసింగ్‌చేసి విక్రయించనున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి వీ ప్రవీణ్‌రావు తెలిపారు. 

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న కంది పప్పు బ్యాగులు

నాణ్యమైన ఉత్పత్తులే లక్ష్యం

రైతులకు అదనపు ఆదాయం కల్పించడం, ప్రజలకు కల్తీలేని, నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో వ్యవసాయ విశ్వవిద్యాలయం నూనెలు, పప్పులు, బియ్యం వంటి ఉత్పత్తులను ప్రాసెసింగ్‌ ద్వారా ప్రత్యేక బ్రాండ్‌తో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం రాజేంద్రనగర్‌ పరిశోధన స్థానంలో 20 రకాల చిరుధాన్యాలతో వివిధ రకాల ఉత్పత్తులను తయారుచేసి అమ్ముతున్నది. అదేవిధంగా ఆర్గానిక్‌ బియ్యాన్ని కూడా విక్రయిస్తున్నది. మరోవైపు తాండూరు పరిశోధనస్థానంలో ఉన్న ప్రాసెసింగ్‌ యూనిట్‌లో నెలకు మూడు వేల నుంచి నాలుగు వేల లీటర్ల మేర కుసుమనూనె ఉత్పత్తి అవుతున్నది. కిలో నూనెను రూ.400 చొప్పున అమ్ముతున్నారు. కందిపప్పు కిలో రూ.140 చొప్పున విక్రయిస్తున్నారు. కుసుమనూనెకు వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తుండటంతో 2020-21 లో పది నుంచి పన్నెండు వేల లీటర్ల నూనెను ప్రాసెస్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. తాండూరు యూనిట్‌లో రోజుకు 400- 500 కిలోల కందిపప్పును ప్రాసెసింగ్‌ చేస్తున్నారు. భవిష్యత్తులో వరంగల్‌లో కూడా కందుల ప్రాసెసింగ్‌ చేయాలని యోచిస్తున్నారు. 

  కోల్డ్‌ ప్రెస్డ్‌ వంటనూనెలో పోషకాలు 

కోల్డ్‌ ప్రెస్డ్‌ కుసుమ నూనెతో శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తిస్థాయిలో అందుతాయి. 175 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతల వద్ద ప్రైవేటు కంపెనీలు నూనెలను తయారుచేస్తాయి. ఇలాంటి రిఫైన్డ్‌ నూనెల్లో పోషకాలు నశిస్తాయి. తాండూరు ప్రాసెసింగ్‌ యూనిట్‌లో లీటర్‌, ఐదు లీటర్ల ప్యాక్‌లను తయారుచేస్తున్నాం. రోజుకు 100 లీటర్ల కుసుమనూనె ఉత్పత్తి చేస్తున్నాం. ఈ కుసుమలను తాండూరు పరిసర గ్రామాల రైతుల నుంచి, కర్ణాటక నుంచి సేకరిస్తున్నాం. ఈ ఏడాదికి అవసరమైన 300 క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నాయి. తాండూరు ప్రాసెసింగ్‌ యూనిట్‌లో తయారుచేసిన కుసుమ నూనెను రాజేంద్రనగర్‌లో ఏర్పాటుచేసిన అవుట్‌లెట్‌ ద్వారా విక్రయిస్తున్నాం. సూపర్‌మార్కెట్లు, వినియోగదారులు అక్కడికి వచ్చి కొంటున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా నూనెలను ఉత్పత్తిచేసేందుకు కొత్త మిషనరీతెచ్చాం.

-  సుధాకర్‌, ప్రధాన శాస్త్రవేత్త, తాండూరు ,వ్యవసాయ పరిశోధన కేంద్రం 

  నెలరోజుల్లో మూడు యూనిట్లు

వ్యవసాయ వర్సిటీ ప్రాసెస్‌ చేసిన నూనెలు, పప్పులకు మార్కెట్‌లో లభిస్తున్న డిమాండ్‌ నేపథ్యంలో.. జగిత్యాల, పాలెం, వరంగల్‌లో మరో మూడు ప్రాసెసింగ్‌ యూనిట్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లుచేశాం. జగిత్యాల ప్రాంతంలో నువ్వులు ఎక్కువగా సాగు చేస్తున్నందున జగిత్యాల పరిశోధన కేంద్రంలో నువ్వుల నూనె, ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశనగ అధికంగా పండిస్తున్నందున పాలెంలో  వేరుశనగ నూనె, వరంగల్‌లో  పెసర, మినుముల పంట అధికంగా సాగవుతున్నందున వరంగల్‌ ప్రాంతీయ పరిశోధన స్థానంలో మినుము, పెసర పప్పు ప్రాసెసింగ్‌యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. వాస్తవంగా ఈ ప్రాసెసింగ్‌ యూనిట్లను మార్చిలో ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ.. కరోనా పరిస్థితుల్లో వాయిదా పడింది. మరో నెల రోజుల్లో ఈ యూనిట్లను ప్రారంభిస్తాం. ఈ యూనిట్లు నెలకు 3000 నుంచి 4000 లీటర్ల నూనెను ఉత్పత్తి చేస్తాయి. 

- వీ ప్రవీణ్‌రావు, ఉపకులపతి, వ్యవసాయ విశ్వవిద్యాలయం


logo