మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 12:52:06

తెలంగాణ సరిహద్దులు మూసివేత

తెలంగాణ సరిహద్దులు మూసివేత

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచే ఎక్కువగా వైరస్‌ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అన్నిమార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బాసర ధర్మాబాద్‌ వద్ద అంతర్‌ రాష్ట్ర రహదారి మూసివేశారు.

తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో జహీరాబాద్‌ చిరాజ్‌పల్లి చెక్‌పోస్టు వద్ద ఖతార్‌ నుంచి వచ్చిన 37 మందిని పోలీసులు నిలిపివేశారు. వీరంతా విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ఖతార్‌ నుంచి ముంబయి వచ్చామని, ముంబయి విమానాశ్రయంలో వైద్య పరీక్షలు చేశారని ప్రయాణికులు తెలిపారు.  తామంతా ఖతార్‌లో ఉపాధి కోసం వెళ్లామని పోలీసులకు వివరించారు. తెలంగాణకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. కరోనాతో ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఇద్దరు మృతి చెందారు. ఇవాళ తాజాగా 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 74కు చేరింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే వారిని తెలంగాణలోకి అనుమతించడంలేదు.


logo
>>>>>>