గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 13, 2020 , 03:21:42

జీఎస్టీలో తెలంగాణ బెస్ట్‌

జీఎస్టీలో తెలంగాణ బెస్ట్‌
  • రాబడిలో రాష్ట్రం ముందున్నది
  • 15వ ఆర్థికసంఘం సభ్యుడు అజయ్‌నారాయణ కితాబు
  • ప్రగతి ఆధారంగా వెయిటేజీ ఇవ్వాలని రాష్ట్ర అధికారుల వినతి

ప్రత్యేకప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణలో జీఎస్టీ నిర్వహణ వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నదని 15వ ఆర్థికసంఘం సభ్యుడు అజయ్‌ నారాయణ ఝా కితాబిచ్చారు. బుధవారం ఆయన బీఆర్కే భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తెలంగాణలో జీఎస్టీ రాబడి ఇతర రాష్ర్టాల కంటే పెరుగడానికి గల కారణాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో వాణిజ్యపన్నుల సర్కిళ్లను హేతుబద్ధంచేసి అధికారులందరికీ సమానంగా బాధ్యతలు అప్పగించామని సీఎస్‌ తెలిపారు. సర్కిళ్ల పరిధిలో ఉన్న అంతరాలను తగ్గించి పరిపాలనకు అనుకూలంగా మార్చామని, అవసరమైనచోట కొత్త డివిజన్లు, సర్కిళ్లను ఏర్పాటుచేశామని వివరించారు. 


పన్ను ఎగవేతను అరికట్టి పకడ్బందీగా వసూలు చేయడానికి ఎకనామిక్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్లను, స్ట్రాటజిక్‌ ట్యాక్స్‌ యూనిట్లను నెలకొల్పి భారీ సంఖ్యలో ట్రేడర్లను ట్యాక్స్‌ నెట్‌లోకి తెచ్చామని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పలు రకాల యాప్‌లను అందుబాటులోకి తెచ్చిన విధానాన్ని వివరించారు. వాణిజ్యపన్నులశాఖలో ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయివరకు  అధికారులు, సిబ్బంది యాప్‌లను ఉపయోగించి ట్రేడర్లు, డీలర్ల నుంచి సకాలంలో పన్నులను రాబట్టారన్నారు. పన్ను ఎగవేతదారులకు వెంటనే నోటీసులు పంపడం, జీఎస్టీ రిటర్న్‌లను పెండింగ్‌లో ఉంచినవారికి ఎస్‌ఎంఎస్‌ పంపడం, పన్ను ఎగవేస్తున్నవారిని గుర్తించి 3-ఏ నోటీసులు ఆటోమేటిక్‌గా వెళ్లిపోయేలా రూపొందించిన వ్యవస్థను అజయ్‌ నారాయణకు కండ్లకు కట్టినట్టు చూపారు.


పటిష్ఠమైన వ్యవస్థ వల్ల జీఎస్టీ ప్రారంభమైననాటి నుంచి రాష్ట్రంలో ఇబ్బందులు లేవని, రాబడిలో తెలంగాణ ముందువరుసలో ఉన్నదని ఆర్థికసంఘం సభ్యుడు అజయ్‌ ప్రశంసించారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఇచ్చిన కొన్ని సూచనలు, సలహాలను ఆయన స్వీకరించి ప్రత్యేకంగా నోట్‌ చేసుకున్నారు. ఐజీఎస్టీ డాటా షేరింగ్‌, కేంద్రానికి రాష్ర్టానికి మధ్య సమన్వయం, సహకారం వంటి అంశాలపై అజయ్‌ చర్చించారు. జీఎస్టీతోపాటు చాలా రంగాల్లో తెలంగాణ దేశంలోనే అన్ని రాష్ర్టాల కంటే మంచి ఫలితాలను సాధిస్తున్నదని రాష్ట్ర ఉన్నతాధికారులు అజయ్‌కు వివరించారు. బెస్ట్‌ ఫర్ఫార్మింగ్‌ స్టేట్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలిచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరారు. ప్రగతి ఆధారంగా వెయిటేజీని పెంచితే రాష్ర్టాలు అభివృద్ధికి పాటుపడుతాయని చెప్పారు. అజయ్‌నారాయణతో జరిగిన సమావేశంలో ప్రభుత్వ సలహాదారు జీఆర్‌ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావు, వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌ నీతూప్రసాద్‌, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ తదితరులు పాల్గొన్నారు.


logo