మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 12:54:37

దేశానికే ధాన్య నగరి తెలంగాణ : మంత్రి కేటీఆర్

దేశానికే ధాన్య నగరి తెలంగాణ : మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రం దేశానికే  ధాన్యా గారంగా మారిందని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లాలోని ముస్తాబాద్ మండలం బందనకల్ లో మంత్రి  పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా బందనకల్ గ్రామానికి గోదావరి జలాలు చేరడంతో ఊర చెరువు దగ్గర గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి మంత్రి మాట్లాడారు. చరిత్రలో ఎన్నడు చూడని దృశ్యాన్ని చూస్తున్నామని తెలిపారు. తెలంగాణలో బంగారం లాంటి సారవంతమైన నేలలు ఉన్నాయని, చెరువుల కింద రెండు పంటలు పండించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. నీళ్లు లేక నోళ్లు ఎండబెట్టిన చెరువులు, కుంటలు ఎండా కాలంలోనూ చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు. ఇంతటి అద్భుత ఘట్టం సీఎం కేసీఆర్ నాయకత్వంతోనే ఇది సాధ్యమైందని మంత్రి తెలియజేశారు.

సీఎం కేసీఆర్ అపర భగీరథుడని, సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులోని ప్రాంతాలకు గోదావరి జలాలు తరలిస్తూ పుడమి తల్లిని పాడి పంటలతో సస్యశ్యామలం చేస్తున్నారని తెలిపారు. బందనకల్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదని, జల, హరిత, గులాబీ, నీలి, శ్వేత విప్లవాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. యువత వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై దృష్టి సారించాలని సూచించారు.

అలాగే సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు వేయాలి. మద్దతు ధరకు మించి రైతులకు పైసలు రావాలి. అందరూ ఒకే పంట వేస్తే రైతులు నష్టపోతారు. దళారుల చేతుల్లో రైతులు మోసపోకూడదన్నదే సీఎం ఆలోచనని వివరించారు. రైతుబంధు పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదన్నారు. తప్పుడు ప్రచారం నమ్మొద్దని రైతులను కోరారు. నేడు సిరిసిల్లలో జరుగుతున్న అభివృద్ధిని ఐఏఎస్ లకు శిక్షణ పాఠంగా చెబుతున్న స్థాయికి ఎదిగామన్నారు. logo