శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 03:12:44

దేశానికే ఆదర్శంగా తెలంగాణ ఆడిట్‌

దేశానికే ఆదర్శంగా తెలంగాణ ఆడిట్‌

  • కర్ణాటక బృందం ప్రశంస

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో అమలుచేస్తున్న ఆన్‌లైన్‌ ఆడిట్‌ విధానం దేశానికే ఆదర్శంగా ఉన్నదని కర్ణాటక బృందం ప్రశంసించింది. కర్ణాటకకు చెందిన పంచాయతీరాజ్‌, ఆడిట్‌ శాఖల ఉన్నతాధికారుల బృందం మంగళవారం తెలంగాణలో పర్యటించింది. ఆన్‌లైన్‌ ఆడిట్‌ విధానాన్ని పరిశీలించింది. అనంతరం రాష్ట్ర ఆడిట్‌శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర్‌రావుతో బృందం సభ్యులు సమావేశమయ్యారు. గత రెండు నెలలుగా నిర్వహించిన ఆన్‌లైన్‌ ఆడిట్‌ విధానాన్ని ఈ సందర్భంగా ఆయన వారికి వివరించారు. పంచాయతీలను ఎంపిక చేయడం, అభ్యంతరాల నమోదు, పంచాయతీల నుంచి నివేదికల సేకరణ వరకు తీసుకున్న ప్రతి చర్యను, ఈ క్రమంలో ఎదురైన సవాళ్లను పరిష్కరించిన తీరును వివరించారు. కర్ణాటక బృందం సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా బీదర్‌ స్టేట్‌ ఆడిట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ వీ శ్రీకాంత్‌ మాట్లాడుతూ తెలంగాణ ఆడిట్‌ విధానం దేశంలోనే గొప్పగా ఉన్నదని కొనియాడారు. ఈ విధానాన్ని కర్ణాటకలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర ఆడిట్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాము, జాయింట్‌ డైరెక్టర్లు దాక్షాయని, ఇందిర, డిప్యూటీ డైరెక్టర్లు రేవతి, రాము, వెంకట్‌, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక బృందంలో శ్రీకాంత్‌తోపాటు బెంగళూరు ఆడిట్‌ అధికారి శివరాజ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ సీనియర్‌ ప్రోగ్రామర్‌ గిరీశ్‌ తదితరులు ఉన్నారు.