బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 01:29:48

నేడు అసెంబ్లీ

నేడు అసెంబ్లీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో అర్థంతరంగా వాయిదా పడిన శాసనసభ మంగళవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. జీహెచ్‌ఎంసీ సహా పలు చట్టాల సవరణ కోసం అసెంబ్లీ ఒకరోజు భేటీ కానుంది. మంగళవారం ఉదయం 11.30గంటలకు సమావేశం ప్రారంభం కానుండగా, ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. సభ ప్రారంభంకాగానే నేరు గా నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. జీహెచ్‌ఎంసీలో వార్డుల రిజర్వేషన్లకు రొటేషన్‌ లేకుం డా ప్రస్తుతమున్న వాటినే కొనసాగించే విధంగా చట్టాన్ని సవరించనున్నారు. నాలా చట్టం, రిజిస్ట్రేషన్‌ చట్టానికి కూడా ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించనుంది. నేర విచారణ స్మృతి (సీఆర్‌పీసీ) చట్టానికి కూడా ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. 

బిల్లులపై చర్చ, ఆ వెంటనే వాటి ఆమోదం పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నించనుంది. ఇక శాసనమండలి ఈ నెల 14న ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను మండలిలో కూడా చర్చిం చి ఆమోదించనున్నారు. ఈ సమావేశాల ఏర్పాట్లను సోమవారం శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమీక్షించారు. అసెంబ్లీ సమావేశ మందిరాన్ని స్పీకర్‌ పోచారం, మండలిని చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వీ నర్సింహాచార్యులు పరిశీలించారు. సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉభయ సభల సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసులు కొ విడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.


logo