సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 15:27:27

28వ తేదీ వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాలు

28వ తేదీ వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాలు

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. అసెంబ్లీ స‌మావేశాలు మొత్తం 17 రోజుల పాటు కొన‌సాగ‌నున్నాయి. 12, 13, 20, 27వ తేదీల్లో అసెంబ్లీకి సెల‌వులు ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో గంట పాటు ప్ర‌శ్నోత్త‌రాల‌కు కేటాయించారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో 6 ప్ర‌శ్న‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తిచ్చారు. అర గంట పాటు జీరో అవ‌ర్ కొన‌సాగ‌నుంది.  

అసెంబ్లీ స‌మావేశాల తేదీల‌ను బీఏసీ(బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీ) స‌మావేశంలో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకున్నారు. స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశానికి సీఎం కేసీఆర్, శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు అక్బ‌రుద్దీన్ ఓవైసీ, భ‌ట్టి విక్ర‌మార్క‌, అసెంబ్లీ సెక్ర‌ట‌రీ న‌రసింహాచార్యులు హాజ‌ర‌య్యారు. 

 కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా కానున్నది. కరోనా వ్యాప్తి నివారణ, బాధితులకు అందుతున్న వైద్యం, భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం.. తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయరంగంలో విజయాలు, నియంత్రిత సాగు లక్ష్యాలు, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ బిల్లుల విధానంపై చర్చ, ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ తదితర అంశాలతోపాటు.. ముఖ్యంగా కొత్త రెవెన్యూచట్టం, పరిపాలన సంస్కరణలు, పాలన వికేంద్రీకరణ, స్థానిక సంస్థల విజయాలపై చ‌ర్చించ‌నున్నారు.


logo