శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 15:35:41

నేటి శాస‌న‌స‌భ సంక్షిప్తంగా..

నేటి శాస‌న‌స‌భ సంక్షిప్తంగా..

హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. మంగ‌ళ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మైన శాస‌న‌స‌భ‌లో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్ర‌శ్నోత్త‌రాలు చేప‌ట్టారు. ప్ర‌శ్నోత్త‌రాల్లో భాగంగా పాడి ప‌రిశ్ర‌మను ప్రోత్స‌హించ‌డం‌, భ‌వ‌న నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, రాష్ట్రంలో పట్టణ పార్కులు(అర్బన్ లంగ్ స్పేసెస్), నర్సంపేట నియోజకవర్గం పరిధిలో పర్యాటకాభివృద్ధిపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయా శాఖ‌ల మంత్రులు వివ‌రంగా స‌మాధానం ఇచ్చారు. అనంత‌రం జీరో అవ‌ర్ చేప‌ట్టారు. ఆ త‌ర్వాత ప‌ది నిమిషాల పాటు స‌భ‌కు టీ బ్రేక్ ఇచ్చారు.

తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లో విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు, శ్రీశైలం పవర్ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ చేప‌ట్టారు. ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క‌, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధ‌న్ మాట్లాడిన అనంత‌రం మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు.

ఆ త‌ర్వాత కేంద్ర విద్యుత్ చ‌ట్టంపై సీఎం కేసీఆర్ వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ చ‌ట్టం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, రైతుల‌కు గొడ్డ‌లి పెట్టు వంటింద‌ని సీఎం పేర్కొన్నారు. కేంద్రం రాష్ర్టాల హ‌క్కుల‌ను కాల‌రాస్తుంద‌ని మండిప‌డ్డారు. కేంద్ర విద్యుత్ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌స్తే రాష్ర్టాల ప‌రిధిలోని డిస్కంలు, జెన్ కో, ట్రాన్స్ కో లోని వేల ఉద్యోగాలు పోతాయ‌ని సీఎం తెలిపారు. 

అనంత‌రం కేంద్ర ప్ర‌తిపాదిత చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. బిల్లును ఉప‌సంహ‌రించుకోవాల‌ని స‌భ‌లో సీఎం కేసీఆర్ తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మ‌ద్ద‌తిచ్చాయి. అనంత‌రం కేంద్ర విద్యుత్ చ‌ట్టం బిల్లు ఉప‌సంహ‌ర‌ణ తీర్మానానికి శాస‌న‌స‌భ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. 

సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానం‌

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన విద్యుత్ చ‌ట్టం 2003 స‌వ‌ర‌ణ బిల్లును తెలంగాణ శాస‌న‌స‌భ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ది. స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ర్టాల హ‌క్కుల‌ను హ‌రించే విధంగా, రైతులు, పేద‌ల ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీసే విధంగా ఈ బిల్లు రూప‌క‌ల్ప‌న జ‌రిగింది. దేశ ప్ర‌జ‌ల‌పై ఈ చ‌ట్టాన్ని రుద్ద‌వ‌ద్ద‌ని, కొత్త బిల్లును వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ శాస‌న‌స‌భ ఏక‌గ్రీవంగా తీర్మానిస్తున్న‌ది. 


logo