ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 01:56:59

జనహితమే ధ్యేయంగా.. కీలక సంస్కరణలు

జనహితమే ధ్యేయంగా.. కీలక సంస్కరణలు

 • నేటి నుంచి అసెంబ్లీ
 • నెలాఖరు వరకు కొనసాగనున్న సమావేశాలు
 • ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా
 • కొత్త రెవెన్యూ చట్టంపై చర్చించే అవకాశం 
 • కేంద్ర ప్రభుత్వ తీరుపై సభవేదికగా వివరణ
 • నేటి సాయంత్రం క్యాబినెట్‌ సమావేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జనహితమే ధ్యేయంగా.. సంస్కరణలవైపు సాగే కీలకమైన అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా కానున్నది. కరోనా వ్యాప్తి నివారణ, బాధితులకు అందుతున్న వైద్యం, భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం.. తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయరంగంలో విజయాలు, నియంత్రిత సాగు లక్ష్యాలు, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ బిల్లుల విధానంపై చర్చ, ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ తదితర అంశాలతోపాటు.. ముఖ్యంగా కొత్త రెవెన్యూచట్టం, పరిపాలన సంస్కరణలు, పాలన వికేంద్రీకరణ, స్థానిక సంస్థల విజయాలపై చర్చించాలని బీఏసీ సమావేశంలో ప్రభుత్వం ప్రతిపాదించనున్నది. సోమవారం ఉదయం 11 గంటలకు మొదలయ్యే సమావేశాల్లో తొలుత ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి నివాళులర్పిస్తారు. 

అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. జనహితమే ధ్యేయంగా పలు చట్టాలకు కీలక సంస్కరణలను ప్రతిపాదించనున్న నేపథ్యంలో ఈసారి జరుగబోయే సమావేశాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని, సభను ఎన్ని రోజులైనా నడిపిస్తామని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. కూలంకషంగా చర్చ జరుగాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని స్పష్టంచేశారు. అసెంబ్లీలో చర్చకు వచ్చే అంశాలపై సంపూర్ణ సమాచారంతో మంత్రులు సిద్ధంగా ఉండాలని సూచించారు. నెలాఖరు వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నది. 

కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు 

కరోనా నేపథ్యంలో ఉభయ సభల నిర్వహణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన వారినే లోనికి అనుమతిస్తారు. సభలో ఒక సీట్లో ఒకరే కూర్చొనేలా.. అదనంగా అసెంబ్లీలో 40, మండలిలో 8 సీట్లు ర్పాటు చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసులకు కరోనా టెస్టులు చేస్తున్నారు. అసెంబ్లీ ఆవరణలోని పలు ప్రాంతాల్లో శానిటైజర్‌ యంత్రాలు, ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిలో మాస్కు ధరించని వారి వివరాలు, వారి ఉష్ణోగ్రతలు ఎప్పుటికప్పుడు తెలుస్తాయి. అసెంబ్లీకి వచ్చే ఫైల్స్‌ను శానిటైజ్‌ చేసేందుకు ప్రత్యేక యంత్రాలను అమర్చారు. సందర్శకులను, ఎమ్మెల్యేల పీఏలను అనుమతించరు. మీడియాను పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నారు. మంత్రుల పేషీ నుంచి ఒక పీఏ, ఒక పీఎస్‌నే అనుమతిస్తారు.


నేడు క్యాబినెట్‌ భేటీ

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం రాత్రి 7.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ అవుతుంది. ఈ సమావేశంలో కొత్తగా రూపొందిస్తున్న రెవెన్యూ చట్టంతోపాటు, శాసనసభలోప్రవేశ పెట్టాల్సిన ఇతర బిల్లులపై చర్చించే అవకాశం ఉన్నది.  

నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష (టీఆర్‌ఎస్‌ఎల్పీ) సమావేశం ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించనున్నారు. తెలంగాణభవన్‌లో సాయం త్రం ఐదు గంటలకు జరుగనున్న సమావేశంలో అసెంబ్లీ, శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహం సహా పలు అంశాలపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారు.  

బీఏసీ సమావేశంలో ప్రభుత్వం ప్రతిపాదించనున్న అంశాలు 

 • కరోనా వ్యాప్తి నివారణ, బాధితులకు అందుతున్న వైద్యం
 • భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం.. తీసుకోవాల్సిన చర్యలు
 • వ్యవసాయరంగంలో విజయాలు, నియంత్రిత సాగు లక్ష్యాలు
 • విద్యుత్‌రంగంలో విజయాలు, శ్రీశైలం జలవిద్యుత్‌కేంద్రంలో జరిగిన ప్రమాదం
 • కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ బిల్లుల విధానంపై చర్చ
 • ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ 
 • నీటిపారుదల రంగ విజయాలు
 • వైద్యసేవల విస్తరణ, కంటివెలుగు
 • జీఎస్టీ అమలులో అన్యాయం.. కేంద్రం మొండివైఖరి
 • హరితహారం విజయాలు, అడవుల పునరుజ్జీవనం
 • కొత్త రెవెన్యూచట్టం, పరిపాలన సంస్కరణలు, పాలన వికేంద్రీకరణ,  
 • పట్టణప్రగతి, బస్తీ దవాఖానలు 
 • పల్లెప్రగతి, సంక్షేమం, గ్రామీణ ఆర్థిక వ్య వస్థ బలోపేతం, శాంతిభద్రతలు, మిషన్‌ భగీరథ 
 • మాజీ ప్రధాని పీవీకి భారతరత్న.. పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణ 


logo