మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 07, 2020 , 01:55:27

20 వరకు అసెంబ్లీ

20 వరకు అసెంబ్లీ
 • శాసనసభలో 12 పనిదినాలు , మండలిలో 8
 • ప్రజాసమస్యలపై ఎన్నిరోజులైనా చర్చకు రెడీ
 • సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం
 • బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 20వ తేదీవరకు నిర్వహించాలని సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం నిర్ణయించింది. శాసనసభలో 12 రోజులు, శాసనమండలిలో 8 రోజులపాటు సమావేశాల నిర్వహణకు ఎజెండా ఖరారుచేసింది. ఆదివారం (8న) అసెంబ్లీలో ఆర్థికశాఖమంత్రి హరీశ్‌రావు, మండలిలో శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు.. ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను ఎన్నిరోజులైనా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. 


ఈ నెల 20వ తేదీ వరకు సభ ఎజెండాను ఖరారు చేసుకుందామని, పొడిగించాలనుకుంటే అదేరోజు తిరిగి బీఏసీని సమావేశపరుచుకుందామని చెప్పా రు. శుక్రవారం అసెంబ్లీలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం.. సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్సీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెడుతుందని పేర్కొన్నారు. సభలను మరిన్ని రోజులు పొడిగించాలని సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క కోరగా.. దీనిపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. 


కాంగ్రెస్‌ సభ్యులు చర్చల సమయంలో సభలోనే ఉండటంలేదని, ఇంకా సమావేశాలు పొడిగించడం ఎందుకని ప్రశ్నించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్‌ టీ పద్మారావు, మంత్రులు టీ హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, విప్‌లు గొంగిడి సునీత, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వీ నరసింహాచార్యులు పాల్గొన్నారు.


శుక్రవారం అసెంబ్లీలో స్పీకర్‌ పోచారం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, మంత్రులు వేముల, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఈటల, కొప్పుల, గంగుల, విప్‌ దాస్యం, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఉన్నారు.


అసెంబ్లీ ఎజెండాలో 12 రోజులు

అసెంబ్లీ ఎజెండాలో భాగంగా 12 రోజులు సమావేశాలు ఉంటాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 9, 10, 15 తేదీలు సెలవురోజులని పేర్కొన్నారు. సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు సీఎం కేసీఆర్‌ చెప్పారని, దీనిపై స్పీకర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.


అసెంబ్లీ ఎజెండా

 • శనివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ఆమోదం
 • ఆదివారం (మార్చి 8) బడ్జెట్‌ ప్రసంగం 
 • మార్చి 11న బడ్జెట్‌పై చర్చ ప్రారంభం
 • మార్చి 12న బడ్జెట్‌పై చర్చకు సమాధానం, ఆమోదం
 • మార్చి 13న గృహనిర్మాణం, సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ, మహిళా, శిశుసంక్షేమశాఖల పద్దులపై చర్చ, ఆమోదం 
 • మార్చి 14న రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, ఎైక్సెజ్‌, వాణిజ్యపన్నులు, రవాణా, హోం, వ్యవసాయం, పశుసంవర్ధక, సహకార, పౌరసరఫరాలశాఖల పద్దులపై చర్చ, ఆమోదం
 • మార్చి 16న పాఠశాల, ఉన్నత, సాంకేతిక, క్రీడలు, యువజన సర్వీసులు, వైద్యారోగ్యశాఖల పద్దులపై చర్చ, ఆమోదం
 • మార్చి 17న పరిశ్రమలు, వాణిజ్యం, కార్మిక, ఉపాధి, దేవాదాయ, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యాటక, సాంస్కృతిక, ఐటీ, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌శాఖల పద్దులపై చర్చ, ఆమోదం
 • 18న పట్టణాభివృద్ధి, మున్సిపల్‌ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల తదితరశాఖల పద్దులపై చర్చ, ఆమోదం 
 • మార్చి 19న అసెంబ్లీ, గవర్నర్‌, మంత్రివర్గం, జీఏడీ, న్యాయ, సమాచార పౌరసంబంధాలశాఖ పద్దులపై చర్చ, ఆమోదం
 • మార్చి 20 ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, ఆమోదం


మండలిలో 8 పనిదినాలు

శాసనమండలిలో చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. 8 పనిదినాలు వచ్చేలా మండలి ఎజెండాను ఖరారు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, మంత్రులు మహమూద్‌ అలీ, ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, ప్రభు త్వ చీఫ్‌విప్‌ వెంకటేశ్వర్లు, విప్‌ భానుప్రసాద్‌రావు, ఎంఐఎం సభ్యుడు జాఫ్రీ, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు.


శాసనమండలి ఎజెండా

 • శనివారం (మార్చి 7న) గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ 
 • ఆదివారం (మార్చి 8న)  బడ్జెట్‌ ప్రసంగం 
 • మార్చి 11న బడ్జెట్‌పై చర్చ 
 • మార్చి 12న బడ్జెట్‌పై చర్చకు సమాధానం, ఆమోదం 
 • మార్చి 13, 14 తేదీల్లో సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్సీఆర్‌పై చర్చ, వాటిని వ్యతిరేకిస్తూ తీర్మానం, పలు అంశాలపై స్వల్పకాలిక చర్చ 
 • 20న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ.


logo
>>>>>>