సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 01:59:05

ఉభయసభల్లో నేడు బడ్జెట్‌

ఉభయసభల్లో నేడు బడ్జెట్‌
  • అసెంబ్లీలో హరీశ్‌రావు..మండలిలో వేముల ప్రశాంత్‌రెడ్డి
  • బడ్జెట్‌కు క్యాబినెట్‌ ఆమోదం సుమారు లక్షన్నర కోట్ల పద్దు!

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం శనివారం రాత్రి ప్రగతిభవన్‌లో సమావేశమై బడ్జెట్‌ను ఏకవాక్య తీర్మానంతో ఆమోదించింది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, శాసనమండలిలో ఆర్‌అండ్‌బీ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 


ఆదాయ, వ్యయాలను రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా అంచనావేసి వాస్తవిక దృక్పథంతో బడ్జెట్‌ను రూపొందించింది. ప్రపంచ మార్కెట్లలో ప్రస్తుతం నెలకొన్న ఒడిదుడుకులను, దేశంలో కొనసాగుతున్న ఆర్థికమాంద్యాన్ని పరిగణనలోకి తీసుకొని గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఎక్కడా భారీ అంచనాలకు పోకుండా పకడ్బందీగా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తున్నది. గతంలో మాదిరిగా బడ్జెట్‌లో సంక్షేమ, నీటిపారుదల, వ్యవసాయరంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చినట్టు సమాచారం. 


కేంద్ర జీడీపీ వృద్ధిరేటు అమాంతంగా పడిపోవడం, పన్నుల వాటాలో కోత తదితర ప్రతికూల అంశాలను దృష్టిలో ఉంచుకొని శాఖలవారీగా నిధుల కేటాయింపులో రాష్ర్ట ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తున్నది. ఆర్థికమాంద్యం నీలినీడలను, జాతీయస్థాయిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను ముందే పసిగట్టిన సీఎం కేసీఆర్‌ రాష్ట్ర బడ్జెట్‌ విషయమై నాలుగునెలల క్రితమే ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. అన్ని రంగాల్లో ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఆదేశాలకు అనుగుణంగానే 2020-21 బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. ఈసారి రాష్ర్ట వార్షిక బడ్జెట్‌ మొత్తం రూ.1.50 లక్షల కోట్లకు కొంచెం అటుఇటుగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


logo